సంక్షేమ హాస్టళ్లలో కొత్త చేరికల్లేవ్‌

ABN , First Publish Date - 2021-10-22T08:07:14+05:30 IST

కొవిడ్‌ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత సంక్షేమ హాస్టళ్లను తెరిచేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

సంక్షేమ హాస్టళ్లలో కొత్త చేరికల్లేవ్‌

  • ప్రస్తుతానికి పాత విద్యార్థులకే అనుమతి
  • తెరుచుకున్న పోస్ట్‌ మెట్రిక్‌ వసతిగృహాలు
  • ప్రీ మెట్రిక్‌ హాస్టళ్ల ప్రారంభం త్వరలోనే..


హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత సంక్షేమ హాస్టళ్లను తెరిచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవలే ఉన్నతాధికారులు హాస్టళ్లు తెరిచేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతానికి పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లను మాత్రమే తెరిచారు. త్వరలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానుండడంతో ఇటీవలే పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లను తెరిచారు. అందులోనూ పాత విద్యార్ధుల్ని మాత్రమే తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి కొత్త విద్యార్ధులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదు. ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు తెరిచే విషయంలో ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొవిడ్‌ తీవ్రత ఇంకా పూర్తిస్థాయిలో తగ్గకపోవడం, మూడోదశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు, పిల్లలకు టీకా అందుబాటులోకి రాకపోవడం వంటి కారణాలతో ప్రీ మెట్రిక్‌ హాస్టళ్ల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,750 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. 650 పోస్ట్‌ మెట్రిక్‌ కాగా మిగతావి ప్రీ మెట్రిక్స్‌. వీటి పరిధిలో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్ధులు వసతి పొందుతున్నారు. కాగా, బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని విద్యా సంస్థలు శుక్రవారం నుంచి పనిచేస్తాయని ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన జాగ్రత్తలపై ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులతో ఆయన గురువారం ఆన్‌లైన్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థల్లో సిబ్బంది కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలని, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-10-22T08:07:14+05:30 IST