కొత్త ‘వ్యవసాయ’ విపత్తులు!

ABN , First Publish Date - 2020-09-24T06:37:44+05:30 IST

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో సెప్టెంబర్ 20వ తేదీని దుర్దినంగా భావించవలసి ఉంటుంది. గ్రామీణ భారతదేశంలో 70శాతం మందికి పైగా వ్యవసాయమే...

కొత్త ‘వ్యవసాయ’ విపత్తులు!

బడా వ్యాపార సంస్థలకు రూ.68,000 కోట్లు రుణాన్ని రద్దు చేసిన మోదీ సర్కార్ వరి, గోధుమలకు రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్‌ ఇవ్వకూడదని ఆదేశించింది! కోట్లాది రైతుల కన్నా కొద్దిమంది కార్పొరేట్‌ పెద్దలకు మేలు చేయటమే ప్రస్తుత పాలకుల లక్ష్యమని స్పష్టమవుతోంది. కేరళలో వలే ‘రుణ ఉపశమన చట్టం’ తీసుకు రావాలన్న రైతు సంఘాల విజ్ఞప్తిని ప్రధానమంత్రి పట్టించుకోవడం లేదు. కొత్త వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుని సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేస్తూ భారత రైతుల ఐక్యవేదిక ‘ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ’ ఈ నెల 25న దేశ వ్యాప్త బంద్‌కు పిలుపు ఇచ్చింది.


భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో సెప్టెంబర్ 20వ తేదీని దుర్దినంగా భావించవలసి ఉంటుంది. గ్రామీణ భారతదేశంలో 70శాతం మందికి పైగా వ్యవసాయమే జీవనాధారం. రైతులలో నూటికి 82మంది సన్నకారు చిన్న రైతులే. ఈ రైతుల, వ్యవసాయ కార్మికుల ఆదాయాలను తీవ్రంగా దెబ్బతీసే మూడు బిల్లులను పార్లమెంటు ఆమోదించడం అత్యంత దురదృష్టకరం. కొత్త వ్యవసాయ బిల్లులు భారత రైతాంగానికి ఎనలేని మేలు చేస్తాయని ప్రధాని మోదీ గంభీరంగా ఉద్ఘాటిస్తున్నారు. కానీ, కోట్లాది రైతులలో ఈ బిల్లులు తమ మెడలకు ఉరితాళ్ళను బిగించబోతున్నాయనే భావన బలంగా ఉంది.


‘రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక, సులభతర బిల్లు-’ దేశ రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు కానుంది. ఎపియంసి చట్టం–1966ను అనుసరించి వ్యవసాయ మార్కెట్‌ యార్డులు, వాటిల్లో గోదాములు, ప్లాట్‌ఫామ్‌లు వంటి మౌలిక వసతులను కొంతమేరకు కల్పించారు. ఈ చట్టానికి 2003లో పలు సవరణలు చేశారు. ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులు; రైతులు, వినియోగదారుల మార్కెట్‌లు; పూలు, కూరగాయలు, -పండ్ల అమ్మకాల కో‍సం ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించారు. కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌కు కూడా వెసులుబాటు కలిగింది. ఉద్యోగుల జీతభత్యాలకు, గోడౌన్లు, ఓపెన్‌షెడ్ల నిర్వహణకు, నిర్మాణాలకు సాధారణంగా 0.5శాతం నుంచి 2శాతం వరకు మార్కెట్‌ఫీజుగా వసూలు చేస్తున్నారు. కొనుగోలుదారులు మార్కెటింగ్‌ శాఖ నుంచి లైసెన్సు తీసుకోవలసి ఉంటుంది. వాళ్లే మార్కెట్‌ఫీజు చెల్లించాలి తప్ప రైతులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 2017లో నరేంద్రమోదీ ప్రభుత్వమే మార్కెట్‌ఫీజును కొనసాగించాలని సూచిస్తూ కొన్ని సంస్కరణలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆ మేరకు పలు రాష్ట్రాలలో చట్ట సవరణలు జరిగాయి. అయితే ప్రస్తుత బిల్లులో, ప్రైవేట్ మార్కెట్‌లతో సహా మార్కెట్‌యార్డుల వెలుపల ఒక్క పైసా కూడా మార్కెట్‌ఫీజు చెల్లించాల్సిన పని లేకుండానే రిలయన్స్‌, వాల్‌మార్ట్‌, మెట్రో, మోర్‌, బిగ్‌బజార్‌ లాంటి బడా వ్యాపారసంస్థలే కాకుండా ఎవరైనాసరే రైతుల నుంచి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసుకునేందుకు వీలు కల్పించారు.


నిజానికి ఇటువంటి వెసులు బాటు కల్పించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దీనివల్ల రానున్న కాలంలో వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ కుప్పకూలుతుంది. ఫలితంగా వివిధ కారణాలు చూపుతూ వ్యాపారసంస్థలు కనీస మద్దతుధరల కంటే తక్కువ ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వేలకోట్ల రూపాయిల మేరకు అధనంగా లాభాలనార్జించటానికి వీలు కలుగుతుంది. కేంద్రప్రభుత్వం వెనువెంటనే మద్దతుధరల విధానాన్ని నిలిపివేయకపోయినా, రైతులకు తగిన ధరలు లభించక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. 2017లో మార్కెట్‌ ఫీజు ఉండాలన్న మోదీ సర్కార్ ఇప్పడు మార్కెట్‌ఫీజు లేకుండానే కొనుగోలు జరిపే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి? ప్రధానమంత్రి కానీ, కేంద్రమంత్రులు కానీ, ఈ విషయం గురించి మాట్లాడటం లేదు. ఇప్పటికే పంజాబ్‌, హర్యానా, పశ్చిమ యూపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో మార్కెటింగ్‌యార్డు వ్యవస్థ పనిచేస్తూ ఉండటం వల్ల వరి, గోధుమ పంటలకు మద్దతుధరకు దరిదాపు ధరలు లభిస్తున్నాయి. వ్యవసాయ మార్కెటింగ్‌యార్డుల నిర్వహణలో కొన్ని లోపాలు, మౌలిక సదుపాయాల కొరత ఉన్న మాట నిజమే. ఆ పరిస్థితులను సరిదిద్దడానికి తగినన్ని నిధులు కేటాయించి రైతులకు మెరుగైన సేవలు అందేట్లు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధానం ద్వారా రైతులు దేశంలో ఏ ప్రాంతంలోనైనా తమ ఉత్పత్తులను ఒక అధునాతన పద్ధతిలో అమ్ముకునే యత్నం 2016 నుంచి కొన్ని వందల మార్కెట్‌యార్డులలో ప్రారంభమయింది. అయితే అనేక యార్డులలో గ్రేడింగ్‌, సార్టింగ్‌ పరికరాలు, నాణ్యత ప్రమాణాలను నిర్ధారించే పరికరాలు, కంప్యూటర్ల సదుపాయాలు లేనందున ఆ అధునాతన పద్ధతి’ వల్ల రైతాంగానికి పెద్దగా మేలు చేకూరలేదు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం మిన్నకుండి పోయింది. అవసరమైన పరికరాలు సమకూర్చకుండా, సదుపాయాలు కల్పించకుండా మార్కెట్‌ వ్యవస్ధను కుప్పకూల్చే విధానాన్ని రూపొందించి మొత్తంగా వ్యవసాయ వాణిజ్యాన్ని కార్పొరేట్‌ శక్తులకు పళ్ళెంలో పెట్టి అందించడానికి మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. 


చక్కెర ఫ్యాక్టరీలు-, చెరుకు రైతుల మధ్య జరిగే ఒప్పందాలు, విత్తన కంపెనీలు, -రైతులకు మధ్య అవగాహనలు, ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్లు, రైతుల మధ్య జరిగే ఒప్పందాలు కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ కిందకే వస్తాయి. చెరుకు పంట మద్దతుధరలకు చట్టబద్ధత ఉండడం వల్ల చక్కెర ఫ్యాక్టరీలు తప్పనిసరిగా రైతులకు వెంటనే కానీ, ఆలస్యంగానైనా కానీ నిర్ధేశిత ధరను ఇచ్చి తీరవలసిందే. ఇతర ఒప్పందాలకు ఇటువంటి చట్టబద్ధత లేనందున రైతులకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆర్ధిక బలం పుష్కలంగా ఉండే కంపెనీలతో బక్కరైతులు తలపడి తమకు న్యాయంగా రావాల్సిన ధర విషయంలో కానీ, వివాదం తలెత్తినప్పుడు కానీ పరిష్కార వ్యవస్థ వద్ద పోరాడి సాధించుకోగలిగిన పరిస్ధితులు లేవని అనుభవం చెబుతూనే ఉంది. పంటలకు కేంద్రప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతుధరకు తగ్గకుండా కంపెనీలు కొనుగోలు చేయాలనే నిబంధన ఏదీ కొత్త బిల్లులో లేదు. ఫలితంగా, బడా వ్యాపారసంస్థలు వివిధ డొల్ల కారణాలు చూపుతూ రైతులకు అతి తక్కువ ధరలు చెల్లించి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించుకోవడానికి అవకాశం లభిస్తుంది.


వ్యవసాయం, పశుపోషణ, మత్స్యరంగం, వ్యవసాయ మార్కెటింగ్‌, - మార్కెట్‌ఫీజు అంశాలను రాజ్యాంగం రాష్ట్రాల జాబితాలో పొందుపరిచింది. రాష్ట్రాల పరిధిలో ఉన్న ఈ అంశాలపై కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేయటమే కాక కేవలం 21 రోజులలో అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా రాష్ట్రాలను కోరడం విడ్డూరం. ఈ ఆర్డినెన్స్‌లు జారీచేసిన సమయంలోనే కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం కర్ణాటక భూసంస్కరణల చట్టాన్ని సవరించింది. తద్వారా వ్యాపార సంస్థలతో సహా వ్యవసాయంతో సంబంధం లేని వారు కూడా వ్యవసాయ భూములను కొనుగోలు చేయడానికి వీలు కల్పించి, సీలింగ్‌ పరిమితిని రెండు నుంచి నాలుగు రెట్లకు పెంచటం చూస్తే బిజెపి అసలు ఎజెండా ఏమిటో అర్ధమవుతుంది. దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ వ్యాపార సంస్థలకు అప్పజెప్పడమే ఆ ఎజెండా అనటం నిస్సందేహం. 


స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ననుసరించి రైతులకు మద్దతుధరలు అమలు చేస్తామని తిరుపతిలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రధాని మోదీ ప్రకటించారు. కానీ అది ఉత్తి మాటగానే మిగిలిపోయింది. యూపీఏ ప్రభుత్వం రైతులకు మద్దతుధర ఇవ్వలేదని విమర్శించిన మోదీ, తమ ప్రభుత్వం కూడా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50శాతం కలిపిన మద్దతుధరను ఇవ్వడం లేదన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు? రైతులు అమాయకులనే భావనతో పచ్చి అబద్దాలు చెప్పడం పాలకులకు పరిపాటి అయింది. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన దానికి మించి ఒక్కపైసా కూడా మోదీ సర్కార్‌ అదనంగా ఇవ్వడం లేదు. పైపెచ్చు, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులని బ్యాంక్‌లు ప్రకటించిన బడా వ్యాపారసంస్థలకు రూ.68,000 కోట్ల రుణాన్ని రద్దు చేసిన మోదీ సర్కార్ వరి, గోధుమలకు రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్‌ ఇవ్వకూడదని ఆదేశించింది! కోట్లాది రైతుల కన్నా కొద్ది మంది కార్పొరేట్‌ పెద్దలకు మేలు చేయటమే మోదీ అభిలషిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. రైతులకు ఒక్క పర్యాయం రుణమాఫీ చెయ్యాలని, కేరళ లో వలే ‘రుణ ఉపశమన చట్టం’ తీసుకురావాలని దేశంలోని రైతు సంఘాలు ఎంతగా విజ్ఞప్తి చేసిన ప్రధాని పట్టించుకోవడం లేదు. ఈ కారణాల వల్లే అఖిల భారత రైతుల పోరాట సమన్వయ కమిటీ ఈ నెల 25న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. కొత్త వ్యవసాయ బిల్లులు మూడింటినీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని సెలెక్ట్‌ కమిటి పరిశీలనకు పంపాలని పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులు చేసిన డిమాండ్‌కు ఈ సమన్వయ కమిటీ మద్దతు ప్రకటించింది. 

వడ్డే శోభనాద్రీశ్వర రావు

Updated Date - 2020-09-24T06:37:44+05:30 IST