డిజిటల్‌గా దున్నేశారు...

ABN , First Publish Date - 2021-01-31T14:39:55+05:30 IST

పదును చూసి విత్తనం నాటే వాడికి... అదును చూసి పెత్తనంపై పోరాడటం తెలుసు!

డిజిటల్‌గా దున్నేశారు...

పదును చూసి విత్తనం నాటే వాడికి... అదును చూసి పెత్తనంపై పోరాడటం తెలుసు!

కన్నుగప్పి పెరిగే కలుపుమొక్కల్ని పీకి పారేసేవాడికి... ఫేక్‌ వార్తల్ని పసిగట్టి ఏరిపారేయడమూ తెలుసు..!

చీడపీడల్ని నివారించిన వాడికి... చీటికీమాటికీ నోరేసుకొని వచ్చేవాళ్ల నోరు మూయించడమూ తెలుసు!

వాళ్లు పంజాబ్‌ రైతులు. అమాయకులు కాదు. గుడారాలు, ఇనుప పొయ్యలు, వంటపాత్రలు, గోధుమపిండి... సరంజామాతో తరలొచ్చిన ఉద్యమం అది. అంతేకాదు, సోషల్‌మీడియా సైన్యాన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇదివరకటిలా సంప్రదాయ రైతు ఉద్యమాల్లా కాకుండా... ప్రపంచానికి తెలిసేలా డిజిటల్‌ దారులను ఎంచుకున్నారు. ఉద్యమంలో రైతుల పిల్లల్ని సైతం భాగస్వాములను చేసి... కొత్తతరం మద్దతు కూడగట్టి.. డిజిటల్‌ ప్రపంచాన్ని దున్నేశారు... 


పంజాబ్‌ పొలాలను వదిలి... ఢిల్లీ శివార్లకు చేరిన రైతులు... వణికించే చలిలో ప్రభుత్వాన్ని వణికిస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్లు చేస్తున్న ఉద్యమానికి (కిసాన్‌ ఏక్తా మోర్చా) ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. దానికి కారణం? ప్రధాన మీడియా ఒక్కటే కాదు. రైతులే స్వయంగా ఏర్పాటు చేసుకున్న సోషల్‌ మీడియా. పంజాబ్‌, హర్యానాలలో ఆగస్టులోనే ఈ ఉద్యమం రగులుకుంది. అయితే అప్పటికి ఆ రాష్ట్రాలకే పరిమితం అయ్యింది. నవంబర్‌లో ఢిల్లీకి దగ్గరలో మార్చ్‌ చేయడంతో జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడింది.


దేశంలోని మిగిలిన రైతులతో పోల్చితే పంజాబ్‌ రైతులు సంపన్నులు! వారి పిల్లలు కూడా ఐటీ రంగంలో వివిధ దేశాలలో స్థిరపడ్డారు. దాంతో అన్నదాతలు ఎప్పుడైతే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి వారి పిల్లలు సైతం సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ట్విట్టర్‌లో యాష్‌ ట్యాగ్‌ (స్పీక్‌ అప్‌ ఫర్‌ ఫార్మర్స్‌) పోస్టు చేసి సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు కూడగట్టడం మొదలుపెట్టారు. తొలుత ఆశించిన మద్దతు లభించలేదు. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత మెల్లమెల్లగా సోషల్‌మీడియాలో చర్చకు దారి తీసింది. కొత్తతరం కూడా రైతు ఉద్యమానికి బాసటగా నిలవడం మొదలైంది. ట్విట్టర్‌లో రైతు అనుకూలురు ఒకవైపు.. ప్రభుత్వ వ్యతిరేకులు మరో వైపు మోహరించారు. ట్వీట్ల యుద్ధం జరిగింది. 


ఐటీ సెల్‌ సైన్యం..

ఢిల్లీ శివార్లలో పాగా వేసిన రైతుల శిబిరాలలోనే ఒక కీలక సమావేశం ఏర్పాటైంది. అప్పటికే సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడే అలవాటున్న రైతులంతా హాజరయ్యారు. అప్పటికప్పుడు- డిజిటల్‌ సాధనాలను ఎక్కువగా వాడే కొందరు యువకులను పంజాబ్‌ నుంచీ రప్పించారు. వాళ్లందరితో ఒక ఐటీసెల్‌ ఏర్పాటైంది. దాని నిర్వహణ బాధ్యతను తీసుకున్నాడు బల్జీత్‌సింగ్‌ సంధు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ రోజు మీడియాను కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వ అనుకూల ప్రసారమాధ్యమాలు మా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశాయి. ఒక టీవీ ఛానల్‌ అయితే ఫోటోలను మార్ఫింగ్‌ చేసి.. మా ఉద్యమంలో విదేశీయులు పాల్గొన్నారని తప్పుడు ప్రచారం చేసింది. మాకు వాళ్ల మద్దతు ఉందని చెబుతోంది. ఇంత చలిని సైతం లెక్క చేయకుండా వృద్దులు కూడా తరలివచ్చారు. ఈ ఉద్యమం మాది ఒక్కరిదే కాదు. దేశంలోని రైతులు అందరిదీ.


ఇలాంటి నకిలీ వార్తలు వచ్చినప్పుడు మాలో కొందరు తీవ్రమైన అసంతృప్తికీ, నిరాశకు లోనయ్యారు. బాధ అనిపించింది. అబద్దాలను ఎప్పటికప్పుడు ఖండించకపోతే అవే నిజాలు అనుకునే ప్రమాదం ఉంది. ఏమవుతుందిలే అని వదిలేస్తే ఉద్యమానికే ప్రమాదం అన్నారు సంధు. ఐటీసెల్‌ ఏర్పాటుకు అదే కారణం. ఐటీ నేపథ్యమున్న యువ రైతులు, ఆ కుటుంబాలలోని చదువరులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఔత్సాహికులు.. ఇలా అందరితో కలిసి ఐటీసెల్‌ ఏర్పడింది. బల్జీత్‌సింగ్‌ సంధు ఆధ్వర్యంలో వీరందరూ కలిసి పనిచేస్తారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించిన అధికారిక సమాచారం ఈ సెల్‌ నుంచే వెళుతుంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టే ఫేక్‌న్యూస్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించి... అడ్డుకుంటారు సభ్యులు. ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ఆ పనిచేస్తుంది. తాజా సమాచారాన్ని విడుదల చేయడం, వీడియోలను షూట్‌ చేయడం, ఎడిటింగ్‌ చేయడం... ఇలా ఎవరు చేసే పనిని వాళ్లు చేశారు. 


ఆ ప్రచారమే నిలబెట్టింది..

డిసెంబర్‌ 14న కిసాన్‌ ఏక్తా మోర్చా ఫేస్‌బుక్‌ పేజీ మొదలైంది. మూడు లక్షలకు పైగా ఫాలోవర్స్‌ వచ్చేశారు. రెండున్నర లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇక, యూట్యూబ్‌లో తమ ఛానల్‌కు అయితే 12.3 లక్షల సబ్‌స్ర్కైబర్స్‌ చేరారు. అన్ని సామాజిక మాధ్యమాల్లో కలిపి ఇప్పటి వరకు రెండున్నర కోట్ల మంది తమ ఉద్యమ విషయాలను తెలుసుకున్నారు. ఇదంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా వ్యక్తం చేసిన మద్దతు. వాస్తవానికి వారానికి కోటిమందిని చేరుకోవాలన్న లక్ష్యంతో పనిచేసింది ఐటీసెల్‌. అయితే కుప్పలుగా వస్తున్న సమాచారం, వీడియోలు, పోస్టులను పరిశీలించడానికే సమయం సరిపోవడం లేదు. ఉద్యమంలో అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో వీడియోను వాట్సప్‌ చేస్తుంటారు. విషయపరంగా కొన్ని రిపీట్‌ కూడా అవుతుంటాయి.


ఇలా రకరకాల వ్యక్తులు, సంఘాల నుంచి వచ్చిన కంటెంట్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించాకే అధికారిక మాధ్యమాల్లో పెడుతున్నాం.. అన్నారు కిసాన్‌ మోర్చా ఐటీ సెల్‌ వాలంటీర్‌. ప్రధాన మీడియాలో వచ్చిన కవరేజీ కంటే ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌లలోనే ఎక్కువ ప్రచారం లభించిందన్నది వారి అభిప్రాయం. ఉద్యమానికి జాతీయ మీడియా అండ లేకపోయినా సోషల్‌మీడియా ప్రచారం బాగా ఉపకరించింది. ప్రత్యామ్నాయ మీడియా ఎప్పుడూ అవసరమే. ఇప్పుడు మీరే చూస్తున్నారు. దేశంలో ఏం జరుగుతోందని? అన్ని వ్యవస్థలను ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకుంది. గీత దాటితే అధికారాన్ని ఉపయోగించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో సోషల్‌మీడియా పాత్ర అద్భుతం. ఇదే కనక లేకపోతే సామాన్యుల గళం వినిపించేందుకు మరో వేదిక ఉండేది కాదు కదా... అన్నాడు అమృత్‌సర్‌కు చెందిన అరవై ఏళ్ల రైతు హర్‌ప్రీత్‌ మాన్‌ సింగ్‌.


వైరల్‌ చేసిన యువతరం

ఐటీ సెల్‌ ఏర్పాటు చేసిన మొదట్లో.. ప్రత్యేక సాంకేతిక పరికరాల సమస్య వచ్చింది. ఢిల్లీ శివార్లలో ఉద్యమంలో ఉన్న కొందరు యువకులను తిరిగి పంజాబ్‌కు పంపించి... అక్కడ కొందరి దగ్గరున్న ల్యాప్‌టాప్‌లు, స్టాండ్‌లు, లైటింగ్‌ పరికరాలను తీసుకొచ్చారు. వీలైనంత వరకు స్మార్ట్‌ఫోన్లు వాడి వీడియోలను రికార్డు చేశారు. మా వాళ్లలో కొందరి దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి. వాటిని తీసుకుని రైతు సంఘాల నేతల ఇంటర్వ్యూలు, అభిప్రాయాలను రికార్డు చేశాం. దీక్షా శిబిరాలతో పాటు రైతుల ర్యాలీలు, సభలను కూడా చిత్రీకరించాం. వీలైనంత వరకు లైటింగ్‌ ఉన్నప్పుడు మాత్రమే షూట్‌ చేయడానికి ప్రయత్నించాం. కొన్నిసార్లు లైవ్‌ టెలికాస్ట్‌ కూడా చేశాం. ఎక్కువగా ఒప్పో, శ్యామ్‌సంగ్‌ ఫోన్లనే వాడాం... అన్నాడు ఒక ఉద్యమకారుడు. వ్యవసాయ చట్టాలను, రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన ప్రసంగంలోని ఒక్కో పాయింట్‌ను తీసుకుని... విమర్శించిన జగ్‌జీత్‌సింగ్‌ ప్రసంగానికి అనూహ్య స్పందన వచ్చింది. దాన్ని కిసాన్‌ ఏక్తా మోర్చాకు చెందిన ఐటీసెల్‌ వైరల్‌ చేసింది.


ఇద్దరు ఐటీసెల్‌ యువకులు ఫోన్‌లో టార్చ్‌ ఓపెన్‌ చేసి... ఆ వీడియోను షూట్‌ చేయడం విశేషం. ఉద్యమంలో పాల్గొన్న రైతుల్లో ఉత్సాహం నింపేందుకు ఫ్రింటర్‌ తీసుకొచ్చి... వ్యవసాయ చట్టాలపై నష్టాలను ఫ్రింట్‌ తీసి... వాళ్లకు పంచారు. ఇక, ఐటీసెల్‌ వాలంటీర్లు వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి వీడియోలు, టెక్ట్స్‌ మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేస్తున్నారు. ఫ్లెక్స్‌ బ్యానర్లు, టీ షర్టులను కూడా ముద్రించారు. కిసాన్‌ ఏక్తా మోర్చాకు ప్రత్యేకంగా ఒక క్యుఆర్‌ కోడ్‌ను రూపొందించారు. స్మార్ట్‌ఫోన్లలో ఆ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు... సామాజిక మాద్యమాల్లోని వారి అకౌంట్లను అనుసరించవచ్చు. బీజేపీ ఐటీ సెల్‌ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మేము ఒక్క రూపాయి వెచ్చించకుండా కోట్ల మంది మెప్పు పొందుతున్నాం. ఇప్పుడు కాలం మారింది. ఎన్ని నియంత్రణలు విధించినా సోషల్‌ మీడియా మా చేతుల్లో ఉంది.. అన్నాడు హర్యానాకు చెందిన ఒక యువ రైతు.


సిగ్నల్స్‌ను అడ్డుకుంది..

ఒకప్పుడు ఉద్యమాలను ముళ్లకంచెలు వేసి, బారికేడ్లు ఏర్పాటు చేసి... అడ్డుకునేది ప్రభుత్వం. ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని చిత్రవిచిత్ర పద్దతుల్లో అడ్డుకుంటోంది. ఢిల్లీ జాతీయ రహదారి పక్కనే తిష్ట వేసి కూర్చున్న ఉద్యమ శిబిరాలపై డేగ కన్ను వేశారు పోలీసులు, అధికారులు. అక్కడి నుంచే కిసాన్‌ ఏక్తా మోర్చ ఐటీసెల్‌ నడుస్తోంది. వీడియోలను షూట్‌ చేసి అప్‌లోడ్‌ చేయడం, పోస్టులు పెట్టడం, ట్వీట్లు చేయడం... ఈ పనులన్నీ నడుస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం లభిస్తున్న ప్రచారంతో... ఉద్యమం మరింత వేడెక్కేలా ఉందని, దాన్ని వీలైనంత వరకు ఆర్పే ప్రయత్నం చేయాలన్నది సర్కారు పన్నాగం. అందుకు ఎన్నో ఎత్తులు వేసింది.


ఢిల్లీ శివార్లలోని సెల్‌టవర్ల పరిధి నుంచే కంటెంట్‌ మొత్తం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అవుతున్న విషయాన్ని గుర్తించారు పోలీసులు. సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేయకుండా ఇంటర్‌నెట్‌ సిగ్నల్స్‌ అందకుండా ప్రత్యేక జామర్లను ఏర్పాటు చేశారని రైతులు ఆరోపించారు. హఠాత్తుగా మొబైల్‌ ఫోన్లన్నీ నెమ్మదించాయి. టెలిఫోన్ల నెట్‌వర్క్‌, ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సమస్యలు వచ్చాయి. మొదట్లో ఇలాంటి ఇబ్బందులు లేవు. ఎప్పుడైతే ఐటీసెల్‌ ఏర్పాటు చేసి... సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం మొదలుపెట్టామో అప్పటి నుంచీ ఇంటర్‌నెట్‌ వేగాన్ని పూర్తిగా నియంత్రించడం మొదలుపెట్టారు. ఇదో కొత్తరకం అణిచివేత. ఇలాంటి సమస్యలు ఏ ఉద్యమానికీ ఎదురుకాలేదు.. అన్నాడో రైతు సంఘం నేత.  


సెలబ్రిటీల సంగీతం..

రైతు ఉద్యమానికి పంజాబ్‌, హర్యానాల్లోని సినీతారలు, గాయకులు, కళాకారులు, యువతరం మద్దతు భారీగా లభించింది. డిజిటల్‌ విప్లవమే దానికి కారణం. వీరిలో చాలామంది పాపులర్‌ అయిన సెలబ్రిటీలు. యూట్యూబ్‌లో బోలెడన్ని ప్రత్యేక మ్యూజిక్‌ వీడియోలు, పాటలు, ప్రసంగాలను విడుదల చేశారు. లూథియానాకు చెందిన ముప్పయి ఎనిమిదేళ్ల రూపీందర్‌సింగ్‌ జిప్పీ గ్రేవాల్‌ పంజాబీలకు ఇష్టమైన సింగర్‌. పంజాబ్‌ సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఫుల్కరీ పాట ఆయనదే! జిప్పీ గ్రేవాల్‌ నటుడు, సంగీతకారుడు, రచయిత, దర్శకుడు, డ్యాన్సర్‌.. ఇలా రకరకాల విభాగాల్లో పేరు సంపాదించిన అతను... తాజాగా రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తూ వీడియోలను తయారుచేసి... యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు.


జాలమ్‌ సర్కారన్‌ పాటతో అన్నదాతల అభిమానాన్ని పొందాడు. దీన్ని సుమారు ఇరవై ఏడు లక్షలకు పైగా వీక్షించారు. పంజాబ్‌ సంగీత ప్రపంచంలో మరో పేరున్న సింగర్‌ రంజిత్‌ బవ. అతను పలు ఆల్బమ్స్‌తో అభిమానులను ఏర్పరచుకున్నాడు. పలు సినిమాల్లో పాటలు పాడాడు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు పంజాబ్‌ బోల్దా పాటను యూట్యూబ్‌లో విడుదల చేశాడు. వీళ్లతోపాటు రాజ్‌వీర్‌ సిధు, మంక్రిత్‌ ఓలక్‌.. ఇలా పలువురు తమ సంగీత సాహిత్యాలతో ఆకట్టుకున్నారు. పంజాబీ మ్యూజిక్‌ వీడియోలు ఒకవైపు అలరిస్తూనే... మరోవైపు చైతన్యాన్ని రగిలించాయి. 


రగిలించేది సోషల్‌మీడియానే...!

ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని రగిలిన ఉద్యమాలు చాలానే ఉన్నాయి. అవే నేటి పంజాబ్‌ రైతులకు ప్రేరణగా నిలిచాయి. 2009లో ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలప్పుడు ఆ దేశంలో గందరగోళం నెలకొంది. తీవ్రమైన సంక్షోభం ఏర్పడింది. ఇరానియన్‌ గ్రీన్‌ మూవ్‌మెంట్‌ బయలుదేరింది. అప్పుడు సోషల్‌మీడియా ఒక ఉత్ర్పేరకం అయ్యింది. 2011లో ఈజిప్టులో ఆ దేశ అధ్యక్షుడైన హొసినీ ముబారక్‌ను పడగొట్టేందుకు ఉద్యమం బయలుదేరింది. అప్పట్లో సుమారు వందకు పైగా పోలీసుస్టేషన్లను కూడా దహనం చేశారు ఉద్యమకారులు. ఇక, అరబ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చాలానే నడిచాయి. పేదరికం పెరిగిపోయింది. బతకడమే కష్టంగా ఉందంటూ ట్యునీషియాలో ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు ప్రారంభించారు. బతుకే భారమైన జీవితాలకు భరోసా కల్పించలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, పోయినా ఒకటేనని ఆగ్రహించారు ప్రజలు.


అక్కడ రాజుకున్న ప్రజాఉద్యమం లిబియా, ఈజిప్టు, యెమన్‌, సిరియా, బహ్రెయిన్‌.లకు వ్యాపించింది. అల్లర్లు, తిరుగుబాట్లతో పౌరయుద్ధం బయలుదేరింది. మెరాకో, జోర్డాన్‌, అల్జీరియా, కువైట్‌, సూడాన్‌, లెబనాన్‌... ఇలా అనేక చోట్ల ప్రజావ్యతిరేకత, ఉగ్రవాదం, ఏర్పాటువాదం.. రకరకాల సంక్షోభాలు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ సోషల్‌మీడియా వేదిక అయ్యింది.  ఫ్రాన్స్‌లో పెట్రోల్‌ టాక్స్‌ పెంచినప్పుడు... హాంకాగ్‌పై చైనా ఆధిపత్యం ప్రదర్శించినప్పుడు, అమెరికాలో నల్లజాతీయుడైన జార్జిఫ్లాయిడ్‌ను పోలీసులు చంపినప్పుడు... ఇవన్నీ సోషల్‌మీడియాతోనే రగిలాయి. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమం కూడా ఇలాగే విస్తరించింది. మహిళలపై లైంగిక వేధింపులను ప్రపంచానికి వినిపించింది సోషల్‌మీడియా. సెలబ్రిటీలు సైతం తమకు జరిగిన వేధింపులను బహిరంగంగా ప్రకటించి... నిరసన వ్యక్తం చేశారు. 


యూట్యూబ్‌లో...

జాలమ్‌ సర్కారన్‌- 2,746,655

పంజాబ్‌ బోల్దా-22,184,136

చుప్‌ కర్జా ఢిల్లీ యే- 4,96,317

కిసాన్‌ ఆంథెమ్‌- 23,358,263

అట్‌ వాడి కిసాన్‌- 5,31,086



భవిష్యత్‌  ఉద్యమాలకు ప్రేరణ...

మీడియా మద్దతుతోనే రైతుల ఉద్యమాలు ఎన్నో విజయాలు సాధించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వాల కనుసన్నల్లోనే ఎక్కువ భాగం మీడియా పనిచేయాల్సి వస్తున్నది. లేదంటే ఒత్తిడి పెడుతోంది. అందుకే మా ఉద్యమానికి మొదట్లో పెద్ద ప్రచారం ఇవ్వలేదు మీడియా. ఉద్యమం ఊపందుకున్నాక ప్రత్యేకించి కొన్ని టీవీఛానళ్లు దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాయి. మా ఉద్యమాన్ని పలుచన చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాయి. సోషల్‌ మీడియాలో కూడా నకిలీ అకౌంట్లు సృష్టించి.. అపోహలను కలిగించి.. గందరగోళం సృష్టించేందుకు విఫలయత్నం చేస్తున్నారు కొందరు. హఠాత్తుగా ఇన్నేసి ట్విట్టర్‌ అకౌంట్లు, ఫేస్‌బుక్‌ పేజీలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. అందుకే మేమంతా రాత్రికి రాత్రే ఒక నిర్ణయం తీసుకున్నాం.


మాకంటూ ఒక సొంత ఐటీసెల్‌ ఉండాలని. ఈ ఐటీసెల్‌ను ఇతరులకు అప్పగిస్తే ప్రభుత్వం హైజాక్‌ చేసే ప్రమాదం ఉంది. లేదంటే వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపేయొచ్చు. అందుకే రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి - మీలో ఎవరెవరికి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌, యూట్యూబ్‌ ఆపరేట్‌ చేయడం, వీడియోలను అప్‌లోడ్‌ చేసే నైపుణ్యం, వైరల్‌ చేసే చాకచక్యం ఉన్నవాళ్లు ముందుకు రండి అని అడిగాను. అప్పటికప్పుడే 37 మంది రైతులు ముందుకు వచ్చారు. అలా పుట్టింది ఐటి సెల్‌.  

- బల్జీత్‌ సింగ్‌ సంధు, ఐటీసెల్‌, కిసాన్‌ ఏక్తా మోర్చా

Updated Date - 2021-01-31T14:39:55+05:30 IST