యూనిట్‌ పెడితేనే.. అప్పు

ABN , First Publish Date - 2021-07-31T05:12:59+05:30 IST

స్వయం శక్తి సంఘాల మహిళలకు రుణాల మంజూరు విధానంలో ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాన్ని సభ్యులంతా సమానంగా పంచుకుని నెల నెలా క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించేవారు. ఇక నుంచి యూనిట్ల ఏర్పాటు ద్వారా మహిళల జీవనోపాధి పెంపుతో పాటు, వారి ఆదాయ అభివృద్ధికి మాత్రమే రుణం మంజూరు చేయనున్నారు. అంటే సంఘాలకు చెందిన మహిళలు వ్యాపారం చేస్తామంటేనే రుణం తీసుకోవాలి. ఏ యూనిట్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో చెబితేనే రుణం మంజూరు చేస్తారు.

యూనిట్‌ పెడితేనే.. అప్పు
డిజిటల్‌ విధానంపై డ్వాక్రా సంఘాలకు అవగాహన కల్పిస్తున్న వెలుగు సిబ్బంది

 - స్వయంశక్తి సంఘాలకు రుణాల మంజూరులో కొత్త విధానం

- రేపటి నుంచి అమలుకు సన్నాహాలు

- ఆందోళన చెందుతున్న మహిళా సభ్యులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

స్వయం శక్తి సంఘాల మహిళలకు రుణాల మంజూరు విధానంలో ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాన్ని సభ్యులంతా సమానంగా పంచుకుని నెల నెలా క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించేవారు. ఇక నుంచి యూనిట్ల ఏర్పాటు ద్వారా మహిళల జీవనోపాధి పెంపుతో పాటు, వారి ఆదాయ అభివృద్ధికి మాత్రమే రుణం మంజూరు చేయనున్నారు. అంటే సంఘాలకు చెందిన మహిళలు వ్యాపారం చేస్తామంటేనే రుణం తీసుకోవాలి. ఏ యూనిట్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో చెబితేనే రుణం మంజూరు చేస్తారు. యూనిట్‌ ఏర్పాటయ్యాక మండల సీసీతో పాటు, మహిళలు బయోమెట్రిక్‌ వేయాలి. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) నిబంధనల ఆధారంగా మార్గదర్శకాలను అమలు చేయనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నూతన రుణ మంజూరు ప్రక్రియ అమలు కానుంది.  కొత్త విధానంతో మహిళా సంఘ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణం సొంత అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉండదని మధనపడుతున్నారు. 


ఏకగవాక్ష విధానం :

ఇప్పటి వరకు మహిళలు తమ ఆర్థిక అవసరాలను బట్టి బ్యాంకు రుణంతో పాటు, సీఐఎఫ్‌, స్త్రీనిధి రుణాలను తీసుకుంటున్నారు. ఇక నుంచి వాటన్నింటినీ ఏకగవాక్ష(సింగిల్‌ విండో) విధానం కిందకి తీసుకురానున్నారు. ఉదాహరణకు ఒక సంఘానికి రూ.6లక్షల రుణం అవసరమైతే ఇప్పటి వరకు నేరుగా బ్యాంకు నుంచి మంజూరు చేసేవారు. కొత్తవిధానంలో మొదట వంద శాతం రుణ మొత్తాన్ని పొదుపు ఖాతా నుంచే సర్దుబాటు చేయాలి. ఒక వేళ అక్కడ రెండు లక్షలు మాత్రమే అందుబాటులో ఉంటే మిగతా మొత్తాన్ని వరుసగా గ్రామ సంఘం(వీవో), సామాజిక పెట్టుబడి నిధి(సీఐఎఫ్‌), స్త్రీనిధి, సంఘంలో ఎస్సీ, ఎస్టీ సభ్యులంటే ఉన్నతి నుంచి ఇప్పిస్తారు. అప్పటికీ రూ.6 లక్షలు సమకూరకపోతే మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లింకేజీ ద్వారా ఇస్తారు. 


డిజిటల్‌ విధానంలోనే.. :

జిల్లాలో మొత్తం 59,208 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అందులో 6,69,995 మంది సభ్యులు ఉన్నారు. ఇక నుంచి నూతన విధానంలో డిజిటల్‌కు పెద్దపీట వేయనున్నారు. రుణం మంజూరు నిమిత్తం అవసరమైన మహిళ బయోమెట్రిక్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. సమావేశాల వివరాలు... అప్పుల తీర్మానాలు దస్త్రాల్లో పొందుపరిచే విధానానికి స్వస్తి పలుకుతారు. ఒక సంఘంలో రుణం అవసరమైన వారే తీసుకోవాలి. అప్పు తీసుకునేటప్పుడు, తిరిగి చెల్లించేటప్పుడు ప్రతి నెలా వేలిముద్ర తప్పనిసరి. ఇది నమోదు కాని వారికి ఐరిష్‌ తీసుకుంటారు. రుణ వాయిదాలను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే విధానాన్ని తీసుకురానున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరు ప్రక్రియను గ్రామ సంఘం సహాయకులు(వీవోఏ) చేపట్టగా, వారికి సమాంతరంగా వలంటీర్లను అందులో భాగస్వామ్యం చేయనున్నారు.   


జీవనోపాధి మెరుగు కోసమే.. : 

మహిళలు జీవనోపాఽధి మెరుగుపరుచుకుని ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అందుకే రుణాల మంజూరులో సింగిల్‌ విండో విధానం అమలు చేయనుంది. కొత్త విధానంపై మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి మండలంలోని సంఘాలలో నిల్వ ఉన్న నిధులు అంతర్గత అప్పులు ఇవ్వడం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయనున్నాం. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నూతన విధానం ద్వారా రుణ మంజూరు ప్రక్రియ చేపట్టనున్నాం.

 డి.శాంతిశ్రీ, పీడీ, డీఆర్‌డీఏ.

Updated Date - 2021-07-31T05:12:59+05:30 IST