సగం మందికేనా కొత్త పుస్తకాలు..?

ABN , First Publish Date - 2021-07-27T09:01:26+05:30 IST

ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడానికి పాఠ్యపుస్తకాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

సగం మందికేనా కొత్త పుస్తకాలు..?

  • ఇప్పటికే ప్రారంభమైన ఆన్‌లైన్‌ క్లాసులు.. 
  • ఆగస్టు నుంచి కొత్త పాఠాల బోధన మొదలు
  • సగం మంది విద్యార్థులకు ఇంకా చేరని పాఠ్యపుస్తకాలు
  • ప్రైవేటు స్కూళ్లలోనూ ఇదే తీరు
  • ఆన్‌లైన్‌లో అర్థమయ్యేది అంతంత మాత్రమే..
  • సొంతగా చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇబ్బందులు


హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడానికి పాఠ్యపుస్తకాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నప్పటికీ.. వీటి ద్వారా పిల్లలు ఏ మేరకు పాఠాలను అర్థం చేసుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. కనీసం పాఠ్యపుస్తకాలైనా అందుబాటులో ఉంటే సొంతగా చదువుకుంటూ ఎంతోకొంత నేర్చుకునే వీలుంటుంది. కానీ రాష్ట్రంలో జూలై 1 నుంచే స్కూళ్లు ప్రారంభమైనా ఇంతవరకు విద్యార్థులకు కొత్త పుస్తకాల పంపిణీ పూర్తికాలేదు. పాఠ్యపుస్తకాల సహాయంతో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో నెల రోజుల నుంచి పుస్తకాల పంపిణీ జరుగుతూనే ఉంది. అయునా ఇంకా లక్షల మంది విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం బ్రిడ్జ్‌ కోర్సు క్లాసులు జరుగుతున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త క్లాసులకు సంబంధించిన సబ్జెక్టుల బోధన ప్రారంభం కానుంది. అప్పటికైనా విద్యార్థుల చేతుల్లోకి పాఠ్యపుస్తకాలు వస్తాయా లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


సగం మందికే చేరిన కొత్త పుస్తకాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో... ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం 1.42 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. అందులో 1.12 కోట్ల పుస్తకాలను ఇప్పటికే జిల్లాలకు పంపించినట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో సగం పుస్తకాలు ఇంకా విద్యార్థులకు చేరనేలేదు. మరో 30లక్షల పుస్తకాలను ఇంకా జిల్లాలకు పంపాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ఇంకా సగం మంది విద్యార్థులకు కూడా పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి కాలేదు. పుస్తకాల ముద్రణకు  అవసరమైన పేపర్‌ రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు రాకపోవడంతో ఆలస్యమవుతోందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఏపీలో కర్ఫ్యూ వల్ల జాప్యం జరుగుతోందని అధికారులు చెప్పారు. పేపర్‌ వచ్చిన తర్వాత మిగిలిన పుస్తకాలను ముద్రించే అవకాశం ఉంది. అయితే వీటి ముద్రణ, పంపిణీ పూర్తి కావడానికి ఆగస్టు నెలాఖరు వరకు సమయం పట్టొచ్చు. అంతేగాక వివిధ మీడియంలలో చదివే విద్యార్థుల కోసం తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ, తమిళం, కన్నడ తదితర భాషల్లోనూ పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. దీనివల్ల పుస్తకాల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.


జిల్లాల నుంచి విద్యార్థులకు ఎప్పుడు..?

హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు పంపించిన పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం లేదు. దీంతో ఇంకా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదు. స్కూళ్లు తెరిచిన తర్వాతే అందరికీ పుస్తకాలను పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే తొమ్మిది, పదో తరగతి విద్యార్థులందరికీ త్వరగా పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలను అందజేయాలని సూచించింది. దీంతో కొన్నిచోట్ల టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలు ఇస్తున్నారు. కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో స్కూళ్లలోనే పుస్తకాలు ఉన్నాయి. 


ప్రైవేటు స్కూళ్లల్లోనూ అదే పరిస్థితి

ప్రైవేటు స్కూళ్లకు కూడా ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్‌ ప్రకారమే పాఠ్యాంశాలు ఉంటాయి. దాని ప్రకారమే పుస్తకాల ముద్రణ చేస్తారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు 30లక్షల మందికి పైగా ఉంటారు. వారి కోసం మొత్తం 1.25 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయి. వాటిని ప్రైవేటు ముద్రణా సంస్థలు సిద్థం చేస్తాయి. స్కూళ్లు ఆయా ముద్రణా సంస్థల వద్ద పుస్తకాలను కొంటాయి. అయితే ఈసారి చాలా ప్రైవేటు స్కూళ్లు ఇంకా పూర్తిస్థాయిలో పుస్తకాలను కొనలేదని ముద్రణా సంస్థల ప్రతినిధులు చెప్పారు.  విద్యార్థులు ఇళ్లలోనే ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నందన... స్కూళ్లకు వెళ్లి పుస్తకాలు కొనడం లేదని తెలిపారు. 9, 10 తరగతుల విద్యార్థులు తప్ప మిగిలినవారు అంతగా ఆసక్తి చూపించడం లేదని చెప్పారు. పైగా ప్రత్యక్ష తరగతులు ఎప్పటి నుంచి మొదలవుతాయో ఇంకా స్పష్టత లేదు. ఆన్‌లైన్‌లో తరగతులు వింటే సరిపోతుందన్న భావన చాలామంది తల్లిదండ్రుల్లో కూడా ఉంది. వెంటనే పాఠ్యపుస్తకాలు కొనాలన్న ఆసక్తి కనిపించడం లేదు.

Updated Date - 2021-07-27T09:01:26+05:30 IST