గులాబీ పార్టీకి కొత్త బాసులు

ABN , First Publish Date - 2022-01-27T04:57:59+05:30 IST

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ జిల్లాల సారథులను ప్రకటించింది.

గులాబీ పార్టీకి కొత్త బాసులు

  • అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుల నియామకం
  • ప్రజాప్రతినిధులకే ‘పగ్గాలు’ అప్పగింత 
  • రంగారెడ్డికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
  • మేడ్చల్‌ అధ్యక్షునిగా శంభీపూర్‌ రాజు
  • మెతుకు ఆనంద్‌కు వికారాబాద్‌ బాధ్యతలు


అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ జిల్లాల సారథులను ప్రకటించింది. జిల్లాల విభజన అనంతరం మొదటిసారిగా పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించింది. అయితే ఊహించని వారికి ఈ పదవులు దక్కడం ఆశ్చర్యం కలిగించింది. ఉమ్మడి జిల్లాలో అధ్యక్ష పదవికి అనేకమంది రేసులో ఉన్నప్పటికీ అధిష్ఠానం ఆచూతూచి నియామకం చేపట్టింది. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించి చివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది.


రంగారెడ్డి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి) : పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టిసారించిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలకు కొత్త సారథులను నియమించింది. జిల్లా అధ్యక్షుల నియామకాలకు సంబంధించి కొంతకాలంగా కసరత్తు చేస్తున్న పార్టీ అధినాయకత్వం చివరకు అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. గతంలో ప్రతిపాదించిన జాబితాను పూర్తిగా పక్కన పెట్టి ‘ప్రజాప్రతినిధులకే’ పగ్గాలు అప్పగించింది. రాజకీయ అనుభవంతోపాటు సామాజిక సమతుల్యతను పాటిస్తూ నిర్ణయాలు తీసుకుంది. రంగారెడ్డిజిల్లా పార్టీ అధ్యక్షునిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని నియమించింది. అలాగే మేడ్చల్‌ జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుకు అప్పగించింది. వికారాబాద్‌ జిల్లా  అధ్యక్షునిగా వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను నియమించింది. జిల్లా అధ్యక్షుల నియామకం కోసం కొంతకాలంగా పార్టీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ, మండల కమిటీలను నియమించి వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. అలాగే స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. చివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయించింది. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవుల కోసం అనేక మంది పోటీ పడ్డారు. టీఆర్‌ఎస్‌ రంగారెడ్డిజిల్లా అధ్యక్షునిగా క్యామమల్లేష్‌, ప్రతా్‌పరెడ్డి, గణే్‌షగుప్తా తదితరుల్లో ఎవరికైనా బాధ్యతలు అప్పగించవచ్చనే ప్రచారం సాగింది. అలాగే వికారాబాద్‌ జిల్లా అధ్యక్ష రేస్‌లో కరణం పురుషోత్తమరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌  కొండల్‌రెడ్డి. జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయకుమార్‌ పేర్లు ఉన్నాయి. ఇక మేడ్చల్‌ జిల్లాలో హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సుధీర్‌రెడ్డి, నందారెడ్డి, పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ రాజశేఖర్‌రెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కేడర్‌ నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో కూడా వీరి పేర్లు ఉన్నాయి. అయితే అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం జిల్లా పగ్గాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచింది.


‘రంగారెడ్డి’లో అనుభవానికి ‘పెద్దపీట’

టీఆర్‌ఎస్‌ రంగారెడ్డిజిల్లా అధ్యక్షునిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని నియమించడం వెనుక ఆయనకు గతంలో ఉన్న అనుభవమే కారణం. ఉమ్మడి రంగారెడ్డిజిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఆయన ఏకంగా 15ఏళ్లపాటు పనిచేశారు. రాజకీయ అనుభవంతోపాటు  అందరినీ కలుపుకునిపోయేతత్వం ఉన్న వ్యక్తి కావడంతో ఆయనకు ఈ పదవి అప్పగించారు. జిల్లాలో ఆయనకు మంచి పరిచయాలు ఉండడంతోపాటు టీఆర్‌ఎస్‌లో సగం మందికి పైగా నేతలు టీడీపీ నుంచి వచ్చిన వారే ఉండడంతో వీరందరితో మంచిరెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో కీలకమైన రంగారెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కిషన్‌రెడ్డికి అప్పగించారు. 


డాక్టర్‌ వైపు మొగ్గు

వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుని నియామకం కోసం పార్టీ అధినాయకత్వం చాలా కసరత్తు నిర్వహించింది. అయితే చివరకు వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌కు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ పదవి కోసం సీనియర్‌ నేతలు కరణం పురుషోత్తమరావుతోపాటు అనేక మంది పోటీపడ్డారు. అయితే రాష్ట్రవ్యాప్త సమీకరణాల్లో భాగంగా పార్టీ సామాజిక సమతుల్యత పాటిస్తూ నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా  వికారాబాద్‌ జిల్లా పగ్గాలను మెతుకు ఆనంద్‌కు అప్పగించారు. సామాజిక సమీకరణాలు కూడా ఆయనకు కలిసివచ్చాయి. 


ఉద్యమకారునికి ‘పగ్గాలు’

టీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షునిగా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును నియమించడం ‘ఉద్యమకారున్ని’ గుర్తించినట్లయింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న శంభీపూర్‌ రాజుకు పార్టీ నాయకత్వం ఇప్పటికే సముచిత స్థానం కల్పించింది. రెండోసారి ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చి గెలిపించుకుంది. తాజాగా ఆయనకు కీలకమైన మేడ్చల్‌ జిల్లా అధ్యక్ష పగ్గాలు కూడా అప్పగించడం గమనార్హం. కేసీఆర్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతోపాటు పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శంభీపూర్‌రాజు వైపే పార్టీ మొగ్గుచూపింది. సామాజిక సమీకరణాలు కూడా ఆయనకు పదవి ఇచ్చేందుకు దోహదపడ్డాయి.


నమ్మకాన్ని వమ్ము చేయను 

నా మీద నమ్మకంతో జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయను. సీనియర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కేడర్‌ అందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్తాను. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తాం. జిల్లా పార్టీని రాష్ట్రంలోనే నంబర్‌-1 స్థానంలో ఉంచుతాం. గతంలో పనిచేసిన అనుభవంతో పార్టీని ముందుకు నడిపిస్తాను. అన్నివర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయి. వీటిపై ప్రజలందరికీ తెలియచేసేందుకు ఇంటింటి ప్రచారం చేస్తాం. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పనిచేస్తాం. పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లి మంచి ఫలితాలు తీసుకువస్తాం.

- పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్‌రెడ్డి


మంచిరెడ్డి రాజకీయ ప్రస్థావన

సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన మంచిరెడ్డి 1980లో ఎలిమినేడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1985-90 మధ్యకాలంలో ఎలిమినేడు పీఏసీఎస్‌ చైర్మెన్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ నుండి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరారు. 1997-2004 వరకు సుదీర్ఘకాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో మలక్‌పేట్‌ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2009, 2014లో రెండు పర్యాయాలు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున శాసనసభకు ఎన్నికైనారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2015లో టీఆర్‌ఎ్‌సలో చేరారు. 2018లో టీఆర్‌ఎస్‌ నుండి పోటీచేసి మూడవసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనారు.


అందరి సహకారంతో ముందుకు వెళ్తా..

నాపై ఎంతో నమ్మకంతో కీలకమైన మేడ్చల్‌ జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు. ఉద్యమకారునిగా ఇది నాకు లభించిన పదవి అని గర్వపడుతున్నాను. నాపై అపార నమ్మకంతో పార్టీ నాయకత్వం అప్పగించిన ఈ బాధ్యతలను నూటికి నూరుశాతం నెరవేరుస్తాను. పార్టీ నేతలు, కార్యకర్తల సహకారంతో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాను. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల వల్ల పేద, బలహీనవర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. వారి ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికపుడు తిప్పికొడతాం. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపుకోసం కేడర్‌ను సమాయత్తపరుస్తాం. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేస్తాం.

 - ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు


కేసీఆర్‌, కేటీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..

గత అసెంబ్లీ ఎన్నికల్లో నాపై అపారమైన నమ్మకంతో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వికారాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. నాకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని ఊహించలేదు. నాకు రాజకీయ జీవితం ప్రసాదించిన వారి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టి నాపై గురుతర బాధ్యతను చాలా పెంచారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల నమ్మకానికి అనుగుణంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం. జిల్లా ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల బాధ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్నివర్గాల సహకారంతో సీఎం కేసీఆర్‌ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.    

- డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, వికారాబాద్‌ ఎమ్మెల్యే

Updated Date - 2022-01-27T04:57:59+05:30 IST