కొత్త కేసులు 3 వారాల గరిష్ఠం

ABN , First Publish Date - 2021-07-31T07:09:54+05:30 IST

కేరళకు తోడు కర్ణాటక..! తమిళనాడుతో పాటు మహారాష్ట్రలోనూ కొంత ఆందోళన..! వెరసి దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

కొత్త కేసులు 3 వారాల గరిష్ఠం

  • దేశంలో తాజాగా 44 వేలపైగా పాజిటివ్‌లు
  • మూడో రోజూ యాక్టివ్‌ కేసుల్లో పెరుగుదల
  • కేరళలో మళ్లీ 20 వేల పైనే బాధితుల సంఖ్య
  • చెన్నై సహా తమిళనాడులో పలుచోట్ల అలర్ట్‌


న్యూఢిల్లీ, జూలై 30: కేరళకు తోడు కర్ణాటక..! తమిళనాడుతో పాటు మహారాష్ట్రలోనూ కొంత ఆందోళన..! వెరసి దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం 44,230 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. గత 22 రోజుల్లో ఇవే అత్యధికం. ఇప్పటికే కేరళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటే, కర్ణాటకలో 19 రోజుల తర్వాత కేసులు 2 వేలు దాటాయి. మహారాష్ట్రలో వారం రోజుల అత్యధిక సంఖ్యలో 7,242 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. తమిళనాడులో మూడు రోజుల నుంచి బాధితుల సంఖ్య అధికం అవుతోంది. రాజధాని చెన్నై సహా 20 జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో చెన్నై, కన్యాకుమారి, కోయంబత్తూర్‌ సహా పలు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కేరళ సరిహద్దులను కర్ణాటక కట్టుదిట్టం చేసింది. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరి చేసింది. బెంగళూరులో వారం రోజుల్లోనే కట్టడి ప్రాంతాలు 25 శాతం పెరగడం వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తోంది. దేశంలో వరుసగా మూడో రోజు యాక్టివ్‌ కేసులు పెరిగాయి. గురువారం 42,360 మంది కోలుకున్నారు.  4.05 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. కేరళలో జూలై 1 నాటికి లక్ష యాక్టివ్‌ కేసులుండగా.. ఇప్పుడు లక్షన్నర దాటాయి. శుక్రవారం 20,772 కేసులు నమోదయ్యాయి. నాలుగో రోజూ 20 వేల పైగా పాజిటివ్‌లు రావడం గమనార్హం.


ఈ మూడు కారణాలతోనే కేసులు అధికం

లాక్‌డౌన్‌లతో విసిగిన ప్రజలు ఆంక్షల తొలగింపుతో బయటకు వస్తున్నారని, కొవిడ్‌ జాగ్రత్తలు విస్మరిస్తుండటంతో పాటు వేగంగా వ్యాపించే వేరియంట్ల కారణంగా కేరళ, ఛత్తీస్‌గఢ్‌, ఈశాన్యరాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర సహాయమంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ లోక్‌సభకు తెలిపారు. డెల్టాప్లస్‌ లేదా లామ్డా వేరియంట్ల వల్లే కేసులు పెరుగుతున్నాయా అని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.


తెలంగాణ, ఏపీల్లో రెండేసి డెల్టాప్లస్‌ కేసులు

దేశంలో ఇప్పటివరకు 46,124 శాంపిళ్లను జన్యు విశ్లేషణ చేయగా 70 డెల్టా ప్లస్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. తెలంగాణ, ఏపీల్లో రెండేసి కేసులు వచ్చినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 23, మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10 డెల్టా ప్లస్‌ నమోదైనట్లు వివరించారు. 17,169 నమూనాల్లో డెల్టా వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు తెలిపారు. 4,172 ఆల్ఫా, 217 బీటా వేరియంట్‌ కేసులు బయటపడినట్లు పేర్కొన్నారు. కాగా, భారత్‌కు ప్రయాణలపై ఉన్న నిషేధాన్ని ఫిలిప్పీన్స్‌ ఆగస్టు 15 వరకు పొడిగించింది. మరో తొమ్మిది దేశాలకూ దీనిని వర్తింపజేయనుంది.

Updated Date - 2021-07-31T07:09:54+05:30 IST