ఎల్లమ్మ ఆలయానికి కొత్త శోభ

ABN , First Publish Date - 2021-10-18T04:24:56+05:30 IST

కొమురవెల్లి మల్లన్నగుట్టపై వెలిసిన ఎల్లమ్మ తల్లి ఆలయానికి కొత్త శోభ సంతరించుకోనున్నది.

ఎల్లమ్మ ఆలయానికి కొత్త శోభ
పూర్తయిన ఎల్లమ్మ ఆలయ ముఖమండపం

పూర్తయిన ఆలయ మండప విస్తరణ పనులు

మహాబలిపురంలో కృష్ణశిలరాతితో అమ్మవారి విగ్రహం తయారీ

ఆలయానికి తీసుకొచ్చిన ఆలయవర్గాలు

నవంబరు 11న ప్రతిష్టాపనకు చర్యలు

చేర్యాల, అక్టోబరు 17 : కొమురవెల్లి మల్లన్నగుట్టపై వెలిసిన ఎల్లమ్మ తల్లి ఆలయానికి కొత్త శోభ సంతరించుకోనున్నది. ఈ మేరకు ఆలయ మండప విస్తరణ పనులు పూర్తికావచ్చాయి. ఎన్నో దశాబ్దాల క్రితం భారీగుండ్ల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. జాతర సమయంలో లక్షలాది మంది భక్తుల రాకతో మొక్కుబడులు తీర్చుకోలేక నానాతంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి గర్భాలయ ఆధునీకరణ మండప విస్తరణతో పాటు అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలయవర్గాలు నిర్ణయించాయి. మూడున్నరేళ్ల క్రితం మండప విస్తరణ పనులు చేపట్టారు. మొదట పనులు నెమ్మదిగా సాగాయి. కొన్నినెలల క్రితం ఆలయాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇటీవల పూర్తయ్యాయి. మహాబలిపురంలో కృష్ణశిలతో రూ.3.20 లక్షలతో ఆరడుగుల మేర అమ్మవారి విగ్రహాన్ని తయారీ చేయించి, ఇటీవల ఆలయానికి తీసుకొచ్చారు. వీర శైవాగమ శాస్త్రం ప్రకారం నవంబరు 11న ప్రతిష్టించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అందుకు వీర శైవపీఠాధిపతి పర్యవేక్షణలో 9, 10, 11 తేదీల్లో వేడుకలు నిర్వహించేందుకు ఆలయ ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి కసరత్తు చేపడుతున్నారు. అమ్మవారితో పాటు ఉపదేవతల విగ్రహాలనూ ప్రతిష్టించడంతో పాటు నిత్య నైవేద్యం కోసం పాకశాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. 

ఇత్తడి తొడుగు ఏర్పాటుకు రూ.2 లక్షల విరాళం

కొమురమెల్లిలో నూతనంగా ప్రతిష్ట చేసే ఎల్లమ్మ ఆలయ ముఖద్వారానికి ఇత్తడి తొడుగు ఏర్పాటుకయ్యే రూ.2 లక్షలను ఐనాపూర్‌ మాజీ సర్పంచ్‌ మెరుగు శ్రీనివా్‌సగౌడ్‌ ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఈవో బాలాజీ, భిక్షపతి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి తోడ్పడే భక్తులతో పాటు శ్రీనివా్‌సగౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మండలి సభ్యులు నర్సింహులు, నాగిరెడ్డి, కొమురవెల్లి, గిరిధర్‌, ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్‌ ఉన్నారు.            

మల్లన్న ఆలయంలో భక్తజన సందోహం

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం భక్తజన సందోహమైంది. ఆదివారం పొరుగు జిల్లాలకు చెందిన వందలాదిమంది తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా స్వామివారికి బోనం నివేదించి చెలక, నజరు, ముఖమండప పట్నాలు రచించారు. ఒడిబియ్యం, శేషవస్త్రాలు, బండారి అందించి స్వామివారిని దర్శించుకున్నారు. తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ గంగిరేగుచెట్టుకు ముడుపులు కట్టారు. మల్లన్న సహోదరి ఎల్లమ్మకు బోనం నివేదించి కల్లు, బెల్లంపానకం సాక పెట్టి ఒడిబియ్యం పోసి తమ పాడిపంటలు కాపాడాలని వేడుకున్నారు. భక్తులు ఉచిత, ప్రత్యేక దర్శన క్యూలైన్లలో బారులుతీరారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి తదితరులు పర్యవేక్షించారు.

Updated Date - 2021-10-18T04:24:56+05:30 IST