పాత రేడియోలు, టీవీలు ఉన్నాయా? అయితే మీరు కోటీశ్వరులే..!

ABN , First Publish Date - 2020-09-19T13:24:56+05:30 IST

‘మీ వద్ద 50 ఏళ్ల క్రితం వినియోగించిన మర్ఫీ రేడియో ఉందా?’, గ్రామ్‌ఫోన్‌ ఉందా...? గతంలో తాత ముత్తాతలు వాడిన పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా...?, నేషనల్‌, షార్ప్‌, పానాసోనిక్‌ రేడియోలు

పాత రేడియోలు, టీవీలు ఉన్నాయా? అయితే మీరు కోటీశ్వరులే..!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి) : ‘మీ వద్ద 50 ఏళ్ల క్రితం వినియోగించిన మర్ఫీ రేడియో ఉందా?’, గ్రామ్‌ఫోన్‌ ఉందా...? గతంలో తాత ముత్తాతలు వాడిన పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా...?, నేషనల్‌, షార్ప్‌, పానాసోనిక్‌ రేడియోలు లేదా టేప్‌ రికార్డర్లు ఉన్నాయా..?. సాలిడాయిర్‌, డయానోరా కంపెనీ టీవీలు (అప్పట్లో టీవీలకు షట్టర్‌లు ఉండేవి) ఉన్నాయా...? ఇలా పాత తరం ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, కెమెరాలు.. చార్జింగ్‌లైట్లపై చర్చ సాగుతోంది. పాత తరం వస్తువుల్లో ద్రవంతో కూడిన కాయిల్‌ ఉంటుందని.. దానికి రూ. వంద కోట్ల వరకు డిమాండ్‌ ఉందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది పాత సామాను.. దానికి సంబంధించిన వస్తువులను వెదికే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. తమ వద్ద ఆ రసాయనం ఉందని, కొనేవారు ఎవరని ఎవరైనా అడిగితే మాత్రం దానికి సమాధానం చెప్పేవారు లేరు.


పాత సామాన్ల సర్దుబాటు

ఇప్పటి దాకా ఎలాగోలా బతికాము.. ఒక్క కాయిల్‌ దొరికితే దశ తిరిగి పోతుంది. క్షణాల్లో తామే కాదు... తమ తరతరాల సభ్యులూ కోటీశ్వరులుగా మారిపోతాయని పేద, మధ్య తరగతి కుటుంబీకులకు చెందిన కొందరు కలలు కంటున్నారు. దాని కోసం పాత జమానాకు చెందిన రేడియోలు, టీవీలు, టేప్‌రికార్డర్లు వెదికే పనిలో నిమగ్నమయ్యారు.


పాత సామాన్ల మార్కెట్లు ఫుల్‌

పాత తరం ఎలకా్ట్రనిక్‌ కాయిల్‌కు అత్యధిక విలువ ఉందని సోషల్‌మీడియా వేదికగా వైరల్‌ కావడంతో వాటి కోసం పాత సామన్లు విక్రయించే మార్కెట్లపై చాలా మంది ఎగబడుతున్నారు. జుమ్మెరాత్‌ బజార్‌, మదీనా ఆదివారం మార్కెట్‌, నాంపల్లి మార్కెట్‌, రాణిగంజ్‌, సికింద్రాబాద్‌, ఎర్రగడ్డ సంతల వద్ద జనం బారులు తీరుతున్నారు. పాత కాలానికి చెందిన రేడియోలు, టీవీలు దొరుకుతాయేమోనని పోటీ పడి వెదుక్కుంటున్నారు. మరి కొందరు ఆన్‌లైన్‌ సెకండ్‌ సేల్స్‌లో తమ వద్ద పాత రేడియోలు ఉన్నాయి. కానీ దాన్ని ఓపెన్‌ చేయకుండానే డబ్బులు చెల్లించాలంటూ డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు.


కరోనాకు మందు..

ఒకరు అందులో ఉన్న ద్రవాన్ని లక్షల లీటర్ల నీళ్లలో కలిపి దాన్ని మెడిసిన్‌గా మార్చి ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్‌ పేరిట విరుగుడు లభిస్తుందని చెబుతున్నారు. మరొకరు నాసాలో అత్యవసరంగా దాని అవసరం ఉందని.. దానికోసం అప్పట్లో వినియోగించిన ఆ రసాయనం లభించడం లేదని అందుకే కొనుగోలుకు సిద్ధమవుతున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం అమృత సంజీవనిలా పని చేస్తుందని ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సమాధానమిస్తున్నారు. 


మరో రైస్‌ పుల్లింగ్‌?

అతీంద్రీయ శక్తులు, ఉపగ్రహాల్లో వాడకం లాంటి ప్రచారం కల్పిస్తూ రైస్‌ పుల్లింగ్‌ (బింజాన్ని ఆకర్షించడం) పేరిట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి అలాంటి రైస్‌ పుల్లింగ్‌ అనే లోహమే లేదు. అయినా అమాయకులను బురిడీ కొటిస్తూ చాలా మంది వద్ద డబ్బులు దోచేశారు. ఈ కాయిల్‌ కూడా అలాంటిదేనని, ఇదో కొత్త తరహా మోసమనే అనుమానాలు కూడా ఉన్నాయి.

Updated Date - 2020-09-19T13:24:56+05:30 IST