చైనా పక్కనే ఉన్న ఈ దేశంలో మరో కొత్త టెన్షన్.. ఇటీవల బయటపడిన ఓ పరిణామంతో..

ABN , First Publish Date - 2021-06-11T17:02:38+05:30 IST

కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మరో నూతన వేరియంట్ వెలుగు చూసిందా? ఇది భారత్‌లో విలయం సృష్టిస్తున్న డెల్టా వేరియంట్ కన్నా డేంజరా? అంటే అవుననే అంటోంది వియత్నాం ప్రభుత్వం.

చైనా పక్కనే ఉన్న ఈ దేశంలో మరో కొత్త టెన్షన్.. ఇటీవల బయటపడిన ఓ పరిణామంతో..

కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మరో నూతన వేరియంట్ వెలుగు చూసిందా? ఇది భారత్‌లో విలయం సృష్టిస్తున్న డెల్టా వేరియంట్ కన్నా డేంజరా? అంటే అవుననే అంటోంది వియత్నాం ప్రభుత్వం. చైనా పక్కనే ఉన్నా కూడా కరోనాను చాలా బాగా కట్టడి చేసిన ఈ దేశానికి ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. దీనికి కారణం ఇక్కడ తాజాగా వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంటే. పొరుగు దేశాలతో పోల్చుకుంటే వియత్నాంలో కరోనా కేసులు చాలా తక్కువ. ఇక్కడ ఇప్పటి వరకూ కేవలం 7,572 కరోనా కేసులు, 48 కరోనా మరణాలు మాత్రమే నమోదయ్యాయి. అయితే వీటిలో సగం కేసులు గడిచిన నెల రోజుల్లోనే నమోదవడం వియత్నాంను భయపెడుతోంది.


తమ దేశంలో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసిందని వియత్నాం తాజాగా ప్రకటించింది. ఆ దేశ ఆరోగ్య మంత్రి ఎన్గూయెన్ థాన్హ్ లాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ దేశంలోని వైరస్ మ్యూటెంట్.. భారత్‌లో, యూకేలో బయటపడిన వైరస్ మ్యూటెంట్ల కలయికలా కనబడుతోందని ఆయన వివరించారు. అయితే ఇది ఈ రెండింటిలా అంతటి ప్రమాదమా? అంటే ఇంకా పరిశోధనలు అవసరమని అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో). ఇప్పటికే ప్రపంచంలో వేలాది కరోనా వైరస్ మ్యూటెంట్లు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ లీడ్ ఫర్ కొవిడ్-19 మరియా వాన్ కెర్ఖోవే తెలిపారు. ‘‘మాకు తెలిసి వియత్నాంలో వెలుగు చూసిన వేరియంట్ భారత్‌లో కనిపించిన బి.1.617.2 మ్యూటెంటే. లేదంటే మరోసారి ఇది మ్యూటేట్ అయి ఉండొచ్చు’’ అని ఆమె అన్నారు.


ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వేలాది కరోనా వేరియంట్లలో చాలా వరకూ ప్రమాదకరం కాదని చెప్పిన మరియా.. కొన్ని మాత్రమే హానికారకంగా ఉన్నాయని వివరించారు. వారినే ‘‘వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్’’(ఆందోళన కలిగించే వేరియంట్లు)గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వీటిలో యూకేలో తొలిసారి కనిపించిన ఆల్ఫా లేక బి.1.1.7తోపాటు భారత్‌లో కనిపించిన బి.1.617.2 లేక డెల్టా, సౌతాఫ్రికాలో కనిపించిన బి.1.351 లేక బీటా, బ్రెజిల్‌లో కనిపించిన పి.1 లేక గామా వేరియంట్లను డబ్ల్యూహెచ్‌వో ప్రమాదకరంగా గుర్తించింది. వియత్నాంలో కనిపించిన వేరియంట్‌ గురించి ఇంకా ఎటువంటి నిర్ణయానికీ తాము రాలేదని, తమ వైరస్ ఎవల్యూషన్ వర్కింగ్  గ్రూప్ సిబ్బంది ఈ విషయంలో వియత్నాం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని తెలిపింది. ఈ కొత్త వేరియంట్ జెనెటిక్ కోడ్‌ను వియత్నాం ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.


అసలు కరోనా మ్యూటేషన్ అంటే ఏమిటి?

కరోనా వైరస్‌లో స్పైక్ ప్రొటీన్ అని ఉంటుంది. ఇదే మనుషుల్లోని కళాలకు అంటుకొని దాడి చేసేది. ఈ స్పైక్ ప్రొటీన్లో వచ్చే మార్పులే వైరస్ మ్యూటేషన్‌కు కారణం. ఇప్పటి వరకూ భారత్, యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో కనిపించిన కరోనా వేరియంట్లు అన్నింటిలో ఈ స్పైక్ ప్రొటీన్లోనే మార్పులు కనిపించాయి. వీటిలో కూడా భారత్‌లో వెలుగు చూసిన వేరియంట్లో బయటపడిన స్పైక్ ప్రొటీన్ (ఎల్452ఆర్) ముఖ్యమైంది. దీని వల్ల వైరస్ వ్యాప్తి వేగవంతం అవుతుంది. అయితే ఈ స్పైక్ ప్రొటీన్ మార్పుల వల్ల వైరస్ తీవ్రత ఎక్కువ అవుతుందా? ప్రాణాపాయం పెరుగుతుందా? అంటే అవునని చెప్పే ఆధారాలు లేవు. ఫైజర్, ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వంటి వ్యాక్సిన్లు ఈ వేరియంట్లపై కూడా కొద్దొగొప్పో ప్రభావం చూపుతున్నాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా భారత్‌లో కనిపించిన డెల్టా (బి.1.617.2) వేరియంట్ విషయంలో అయితే.. రెండు డోసులు ఇచ్చిన తర్వాత వ్యాక్సిన్ బాగా పనిచేస్తోందని తేలింది. అదే సమయంలో ఒక్క డోసు వ్యాక్సిన్ మాత్రమే తీసుకుంటే పెద్దగా ప్రభావం కనిపించకపోవడం గమనార్హం.


కరోనా విజృంభిస్తున్న తొలి రోజుల్లో వైరస్‌ను గట్టిగా నియంత్రించామన్న ధైర్యంతో వ్యాక్సినేషన్‌పై వియత్నం సరిగ్గా దృష్టి పెట్టలేదు. ఇక్కడ ఉన్న 9.7కోట్ల జనాభాలో కేవలం పదిలక్షల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇది ప్రపంచంలో అతి తక్కువ వ్యాక్సినేషన్ రేట్లలో ఒకటి. అయినా సరే వ్యాక్సిన్‌ పొందడానికి వియత్నాం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. అయితే ప్రస్తుతం కొత్త వేరియంట్ భయంతో వ్యాక్సిన్ కోసం వేట ప్రారంభించింది. వ్యాక్సిన్ దిగుమతులను వేగవంతం చేయడం కోసం బిజినెస్‌మ్యాన్లు, సంస్థలు, ప్రజలు అందరి నుంచి సలహాలూ, నిధులూ సేకరించే ప్రయత్నాల్లో పడింది. ఇప్పటికి 29 లక్షల డోసుల వ్యాక్సిన్లు సేకరించిన వియత్నాం.. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 150 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల సేకరణే లక్ష్యంగా పెట్టుకుంది.


 అలాగే మరోసారి కరోనాను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలు విధించింది. కొత్త సామాజిక దూరం నిబంధనలు అమల్లోకి తెచ్చింది. రిస్క్ గ్రూపుల్లో టెస్టింగ్ పెంచింది. రెస్టారెంట్లు, షాపులు మూతవేయడంతోపాటు మత సంబంధ కార్యక్రమాలను కూడా సస్పెండ్ చేసింది. యూకే వేరియంట్‌గా పిలిచే బి.1.1.7 వేరియంట్ ఇంగ్లండ్‌లో, డెల్టా వేరియంట్ భారత్‌లో ఎంతటి విలయాన్ని సృష్టించాయో చూసిన తర్వాత వియత్నాంలో కనిపించిన కొత్త వేరియంట్.. ఈ రెండింటి కలయిక అనే అభిప్రాయం రావడంతో ఈ కొత్త వేరియంట్ భయం వియత్నాం ప్రజలను వణికిస్తోంది. ఇది ప్రపంచం మీదకు ఎంతటి ప్రళయాన్ని తీసుకొస్తుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

Updated Date - 2021-06-11T17:02:38+05:30 IST