ఆగ్రహ జ్వాల

ABN , First Publish Date - 2022-01-29T08:18:04+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై నిరసనలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రాలను మార్చాలంటూ రోడ్డెక్కుతున్నారు. జిల్లాల సరిహద్దులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి.

ఆగ్రహ జ్వాల

  • కొత్త జిల్లాలపై మిన్నంటిన నిరసనలు
  • రోజు రోజుకు తెరపైకి కొత్త డిమాండ్లు 
  • మండపేటను ‘తూర్పు’లో కలపాలని తీర్మానం
  • ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై నిరసనలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రాలను మార్చాలంటూ రోడ్డెక్కుతున్నారు. జిల్లాల సరిహద్దులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. రోజు రోజుకూ కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యార్థులు, యువజన, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, బంద్‌లతో హోరెత్తించాయి. సీఎం సొంత జిల్లా కడప నుంచి విభజిస్తున్న రాయచోటి జిల్లా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైల్వేకోడూరులో అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాజంపేటలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజన సంఘాలు, వివిధ పార్టీల నేతలు హైవేపై రాస్తారోకో చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో రాజంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మేడా సోదరుడు మేడా విజయశేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకులు అద్దేపల్లె ప్రతా్‌పరాజు, ఇడిమడకల కుమార్‌, సీపీఎం, సీపీఐ, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలో బీజేపీ నేత, రాజంపేట ఇన్‌చార్జి పోతుగుంట రమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో అన్నమయ్య విగ్రహం నిరసన తెలిపారు.


తాళ్లపాక ముఖద్వారం 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద జనసేన నాయకులు అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీ నాయకులు అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు. ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్టలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తహసీల్దారుకు వినతిపత్రం అందించారు.


చిత్తూరు జిల్లాలోని మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ క్రమేపీ పెరుగుతోంది. మదనపల్లెలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయాన్ని వైసీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు ముట్టడించాయి. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, జనసేన, సీపీఐ, సీపీఎం నేతలు తదితరులున్నారు. మార్కెట్‌ యార్డు ఎదుట జాతీయ రహదారిపై జిల్లా సాధన సమితి కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో రాస్తారోకో చేశారు. మదనపల్లె జిల్లా కోసం ములకలచెరువు, పీటీఎం, బి.కొత్తకోటలో ఆందోళనలు చేపట్టారు. కాగా నగరి నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కాకుండా బాలాజీ జిల్లాలో కలపాలని పుత్తూరు టీడీపీ నేతలు మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. 




నరసాపురం బంద్‌ 

పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం కాకుండా సబ్‌ డివిజన్‌ కేంద్రంగా ఉన్న నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ అఖిలపక్షం బంద్‌ చేపట్టింది. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు కొద్దిసేపు వశిష్ఠ గోదావరిలో జల దీక్ష చేపట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో కోనసీమ జిల్లాలో చేర్చిన మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి (రాజమహేంద్రవరం) జిల్లాలో కలపాలంటూ అఖిలపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. అదేవిధంగా కొత్తపేట అసెంబ్లీ పరిధిలోని ఆలమూరు మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని ఆలమూరులో అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. విభజిత పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి పదెకరాలు విరాళంగా ఇస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు గాదిరాజు సుబ్బరాజు ప్రకటించారు.  కాగా.. ఆదోని డివిజన్‌ను జిల్లాగా ప్రకటించాలని లేకుంటే కర్ణాటక లేదా తెలంగాణలో కలపాలని కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-01-29T08:18:04+05:30 IST