వరంగల్ హత్యల వెనుక మళ్లీ కొత్త అనుమానాలు..!?

ABN , First Publish Date - 2020-05-27T12:57:49+05:30 IST

గొర్రెకుంటలోని గన్నీ బ్యాగుల గోదాంలో 9 మందిని బలిగొన్న నిందితుడు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌పై ఐపీసీ

వరంగల్ హత్యల వెనుక మళ్లీ కొత్త అనుమానాలు..!?

  • హత్యల వెనుక ఇంకెవరో ఉన్నారా..!?
  • ఒక్కడే 9 మందిని చంపగలడా?
  • మక్సూద్‌ బంధువుల అనుమానం
  • నిందితుడు సంజయ్‌ని సెంట్రల్‌ జైలుకు తరలింపు


వరంగల్‌ అర్బన్‌ : గొర్రెకుంటలోని గన్నీ బ్యాగుల గోదాంలో 9 మందిని బలిగొన్న  నిందితుడు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌పై ఐపీసీ 449, 328, 364, 380, 404, 302, 201 సెక్షన్ల కింద  పోలీసులు కేసులు నమోదు చేశారు. కట్టుదిట్టమైన రక్షణ మధ్య గీసుకొండ పోలీసులు  మంగళవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో సంజయ్‌ను వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా తదుపరి విచారణ నిమిత్తం త్వరలోనే పోలీస్‌ కస్టడీకి తీసుకునేందుకు  ప్రయత్నం చేస్తామని  గీసుగొండ సీఐ శివరామయ్య తెలిపారు. సంజయ్‌ కుమార్‌ పై హత్యా నేరం, కిడ్నాప్‌, దొంగతనం తదితర ఏడు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.


నమ్మలేక పోతున్నాం..

మక్సూద్‌ ఆలం కుటుంబమంతా దారుణ హత్యకు గురయ్యారని తెలిసి బెంగాల్‌ నుంచి వారి బంధువులు ఎంజీఎంకు చేరుకున్నారు. మృతదేహాలను  చూసి ఒక్కసారిగా భోరుమని ఏడ్చారు. 9 మందిని సంజయ్‌ ఒక్కడే హత్య చేశాడంటే నమ్మశక్యం కావడం లేదని అన్నారు. బంగ్లా మీద ఉన్న వారిని కూడా ఒక్కడే బావి వద్దకు తేగలడా..? అని ప్రశ్నించారు. ఈ హత్యల వెనుక ఇంకా ఎవరో దాగి ఉన్నారని మక్సూద్‌ బంధువులు ఫిరోజ్‌ అహ్మద్‌, ఇస్సాక్‌ అహ్మద్‌, ఇక్బాల్‌, ఫయాజ్‌ అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అన్ని  కోణాల్లో సమగ్ర విచారణ జరపాలన్నారు. ఇదే విషయమై మార్చురీ వద్ద  కొద్ది సేపు ఆందోళన చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు నచ్చ జెప్పడంతో శాంతించారు. మృత దేహాలను స్వాధీనం చేసుకుని స్థానిక ముస్లిం మత పెద్దలు, నాయకుల సహకారంతో ఖబర్‌స్థాన్‌లో వారి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.


భద్రతా ఏర్పాట్ల మధ్య..

పటిష్టమైన రక్షణ ఏర్పాట్ల మధ్య సంజయ్‌ని న్యాయస్థానం ముందు పోలీసులు హాజరుపరిచారు.  కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా పూర్తి స్థాయి శానిటైజేషన్‌ తర్వాతనే జైలు అధికారులు సంజయ్‌ను లోనికి అనుమంతించారు.  జైలు ముందు ఆవరణలోనే పోలీసులు, జైలు సిబ్బంది పర్యవేక్షణలో వేడినీళ్లు, శానిటైజర్‌తో స్నానం  చేయించారు. దుస్తులను మార్చి థర్మల్‌ స్ర్కీనింగ్‌ తర్వాత లోపలికి అనుమతించారు. కరడుగట్టిన నేరస్థులను ఉంచే  హైసెక్యూరిటీ బ్యారక్‌లో సంజయ్‌ని ఉంచినట్టు జైలు అధికారులు తెలిపారు. 


ముస్లిం సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు

ముస్లిం ఆచారం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశాం. బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబం మొత్తం హత్యకు గురికావడం విస్మయం కలిగించింది. వారి కుటుంబానికి అండగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. నిబంధనలు అతిక్రమించి నిద్రమాత్రలు విక్రయించిన షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతధికారులను కోరుతున్నాం. - మసూద్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు


క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి

ఒకే ఒక వ్యక్తి తొమ్మిది మందిని హత్య చేయడం సాధ్యం కాదు. ఈ హత్యల వెనుక మాకు పలు సందేహాలు ఉన్నాయి. పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన విధంగా విచారణ జరపాలని కోరుతున్నాం. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా పోలీసులు విచారణ చేపడతారనే నమ్మకంతో ఉన్నాం. - ఎమ్డీ ఫిరోజ్‌ అహ్మద్‌, మక్సూద్‌ బావమరిది 


మూడు రోజుల ముందే మాట్లాడాడు..

హత్య జరగడానికి మూడు రోజుల ముందు నాతో మాట్లాడి క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు. అంతలోనే అందరు హత్యకు గురయ్యారని తెలిసి షాక్‌కు గురయ్యాము. పోలీసులు మూడు రోజుల్లోనే కేసును ఛేదించినందుకు ధన్యవాదాలు. మరింత లోతుగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ హత్యల వెనుక మరికొంత మంది ఉన్నట్లు అనుమానంగా ఉంది. ఈ కోణంలో పోలీసు దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - ఎమ్డీ ఇషాక్‌ అహ్మద్‌, మక్సూద్‌ మేనల్లుడు.

Updated Date - 2020-05-27T12:57:49+05:30 IST