నూతన విద్యతో మేలు జరిగేనా?

ABN , First Publish Date - 2021-07-28T06:49:04+05:30 IST

నూతన విద్యావిధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

నూతన విద్యతో మేలు జరిగేనా?

అమలు జరిగితే 160కి పైగా పాఠశాలలు విలీనం

పని భారమే అంటున్న ప్రధానోపాధ్యాయులు 

జిల్లా అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ 

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : నూతన విద్యావిధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా జిల్లా విద్యాశాఖ నుంచి అవసరమైన వివరాలు సేకరిస్తోంది. జిల్లా విద్యాశాఖ రోజుకో సమాచారాన్ని ఉన్నత విద్యాశాఖకు పంపుతోంది.  ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు.. వాటిమధ్య దూరం, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, అక్కడున్న  తరగతి గదులు తదితర అంశాలపై వివరాలు సేకరించింది. ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల ప్రహారీ ఆవల ఉన్న పాఠశాలలు, 100 మీటర్లు, 250 మీటర్లు, కిలోమీటరు, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల వివరాలను సేకరించారు. మంగళ, బుధవారాల్లో13 జిల్లాల విద్యాశాఖాధికారులతో విద్యాశాఖ ఉన్నతాదికారులు నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లోనే నూతన విద్యావిధానం అమలుపై తగు నిర్ణయం తీసుకోనున్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయడం, కోర్టు కేసులు తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. 


ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన 

జాతీయ నూతన విద్యావిధానం అమలు చేస్తే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై భారం పడుతుందనే వాదన వినిపిస్తోంది. గతంలో ఒకే గ్రామంలో  ప్రాథమిక,  ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలలు ఏర్పాటు చేశారు.   ప్రతి పాఠశాలకూ ప్రధానోపాధ్యాయుడు ఉండేవారు. నూతన విద్యావిధానం అమలులో భాగంగా గ్రామంలో ఉన్న పాఠశాలల వివరాలను ఉన్నతపాఠశాలకు మ్యాపింగ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అమలులో భాగంగా అంగన్‌వాడీతో పాటు 1, 2 తరగతులను ఒక పాఠశాలగా,  3, 4, 5 తరగతులను దగ్గరలోని ఉన్నతపాఠశాలలో కలిపేలా కసరత్తు చేస్తున్నారు.  


టీచర్లపై మరో రకమైన భారం 

ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు ఉంటారు. 3, 4, 5 తరగతులను ఈ పాఠశాలల్లో కలిపితే వారికి బోఽధన చేసేందుకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లను ఎంత వరకు అందుబాటులో ఉంచుతారనేది అనుమానమే. ఉన్నతపాఠశాలల్లో ఉన్న సబ్జెక్టు టీచర్లు 3, 4, 5 తరగతులకు బోధించాల్సి వస్తుంది. ఈ తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తే ఈ అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తిచేస్తారనేది అనుమానమేనని ఉపాధ్యాయులు అంటున్నారు. 


తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాలతో  ఇక్కట్లు 

జిల్లాలో ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో 69 పాఠశాలలు, ఉన్నత పాఠశాలల ప్రహరీ పక్కనే 31 పాఠశాలలు, 50 మీటర్లు, 100 మీటర్ల దూరంలో  సుమారు 60 పాఠశాలలు ఉన్నట్టు లెక్క చూపారు. ఉన్నత పాఠశాలలను ఇంగ్లీష్‌, తెలుగు మీడియంగా నడుపుతున్నారు. 3, 4, 5 తరగతులను  ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే మీడియం పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనే  వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. 


మధ్యాహ్న భోజన వేళలతోనూ ఇబ్బందులే

జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయాలు వేర్వేరుగా అమలు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలకు మధ్యాహ్నం 12.15 గంటల తరువాత, ఉన్నత పాఠశాలల్లో ఒంటిగంట తరువాత భోజనం పెడుతున్నారు. రెండు పాఠశాలను విలీనం చేస్తే భోజన సమయంపై కూడా నిర్ణయం తీసుకోవాలి. నూతన విద్యావిధానం అమలుపై ఉన్నతాధికారుల సమావేశంలో తీసుకునే నిర్ణయాలను బట్టి తాము తదుపరి కర్తవ్యం గురించి నిర్ణయం తీసుకుంటామని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. 

Updated Date - 2021-07-28T06:49:04+05:30 IST