నూతన విద్యావిధానం అమలులో తొందరపాటు వద్దు

ABN , First Publish Date - 2021-06-22T05:48:53+05:30 IST

నూతన విద్యావిధానం అమలులో తొందరపాటు వద్దని జమాతే ఇస్లాం హింద్‌ రాష్ట్ర కార్యదర్శి షరీఫ్‌ అన్నారు.

నూతన విద్యావిధానం అమలులో తొందరపాటు వద్దు

  • జమాతే ఇస్లాం హింద్‌ రాష్ట్ర కార్యదర్శి షరీఫ్‌

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 21: నూతన విద్యావిధానం అమలులో తొందరపాటు వద్దని జమాతే ఇస్లాం హింద్‌ రాష్ట్ర కార్యదర్శి షరీఫ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్ళుగా ఓ విద్యవిధానం రాష్ట్రంలో అమల్లో ఉందని, అయితే ఏ విధమైన చర్చకు అవకాశం లేకుండా కొత్త విధానం వైపు మరలడం సరికాదన్నారు. జాతీయ విద్యావిధానం ప్రవేశపెట్టే సందర్భంలో దేశ ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతాయని, కానీ విద్యారంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చే సమయంలో ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఏ విధమైన చర్చలు జరపకుండా ఇంత పెద్ద మార్పును ఒక సర్క్యూలర్‌తో తీసుకురావాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని షరీఫ్‌ అన్నారు. ప్రభుత్వం ప్రాథమిక విద్యలో ఏ సంస్కరణలు అయితే తీసుకురావాలంటుందో అవి ప్రైవేట్‌ విద్యారంగానికి వర్తించవు కనుక ఈ ప్రయోగాలు ప్రైవేట్‌ విద్యాసంస్థల బలోపేతానికే దోహదపడతాయని చెప్పారు. అంగన్‌వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు వాటి ప్రత్యేక పంథాల్లో పని చేస్తున్నాయని, వాటిని విడివిడిగానే అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నాయని షరీఫ్‌ చెప్పారు. నూతన విద్యా విధానాన్ని అమలు పరిచే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా అందరితోను చర్చలు జరిపి మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జమాతే ఇస్లాం హింద్‌ నాయకుడు అహ్మద్‌ అన్సర్‌, నగర అధ్యక్షుడు జమీర్‌, ఎస్‌ఎస్‌వో నగర అధ్యక్షుడు నయీం, జాఫర్‌, యీసఫ్‌, కరీముల్లా ఖాన్‌, చాన్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:48:53+05:30 IST