ఆగస్టు 5 నుంచి ప్రవాసుల ఎంట్రీకి యూఏఈ అనుమతి.. ప్రయాణికులకు కీలక సూచనలివే

ABN , First Publish Date - 2021-08-04T16:53:46+05:30 IST

కరోనా కారణంగా భారత్‌తో పాటు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసులను తిరిగి యూఏఈ వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆగస్టు 5 నుంచి ప్రవాసుల ఎంట్రీకి యూఏఈ అనుమతి.. ప్రయాణికులకు కీలక సూచనలివే

అబుధాబి: కరోనా కారణంగా భారత్‌తో పాటు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసులను తిరిగి యూఏఈ వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేపటి(ఆగస్టు 5, గురువారం) నుంచి ప్రవాసులు యూఏఈ తిరిగి వచ్చేందుకు యూఏఈ యంత్రాంగం మంగళవారం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ) పలు సూచనలు చేసింది. ప్రవాసులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ వీసా కలిగి ఉండడం, యూఏఈ ఆమోదించిన టీకాలను రెండు డోసులు పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే జర్నీకి 14 రోజుల ముందు రెండో డోసు తీసుకున్న ప్రయాణికులు కూడా యూఏఈ వెళ్లొచ్చు. అయితే, వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. అంతేగాక ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు కలిగి ఉండాలి. 


ఇక ఎంట్రీకి అనుమతి పొందిన దేశాల జాబితాలో భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నైజీరియా, ఉగాండా, నేపాల్ ఉన్నాయి. ఇదిలాఉంటే.. ప్రధాన రంగాలకు చెందిన టీకాలు తీసుకున్నవారితో పాటు తీసుకోని ప్రయాణికులకు కూడా యూఏఈలో ప్రవేశానికి ఎన్‌సీఈఎంఏ అనుమతి ఇచ్చింది. యూఏఈలో విధులు నిర్వహిస్తున్న హెల్త్ వర్కర్స్(వైద్యులు, నర్సులు, టెక్నిషీయన్స్), టీచింగ్ స్టాఫ్(యూనివర్శిటీ, కళాశాల, పాఠశాల, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు), చికిత్స పొందుతున్న వారు, విద్యార్థులు, స్థానిక ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నవారు యూఏఈ తిరిగి రావొచ్చని ఎన్‌సీఈఎంఏ స్పష్టం చేసింది.  

Updated Date - 2021-08-04T16:53:46+05:30 IST