ఆర్ఎస్ఎస్‌లో సంస్థాగత మార్పులు.. భయ్యాజీ స్థానంలో మరొకరు..!

ABN , First Publish Date - 2021-01-19T20:48:35+05:30 IST

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో కీలక సంస్థాగత మార్పులు ..

ఆర్ఎస్ఎస్‌లో సంస్థాగత మార్పులు.. భయ్యాజీ స్థానంలో మరొకరు..!

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో కీలక సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. మార్చిలో జరగనున్న ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ 'అఖిల భారతీయ ప్రతినిధి సభ' సమావేశానంతం ఈ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. బెంగళూరులో మార్చి 19-20 తేదీల్లో 'అఖిల భారతీయ ప్రతినిధి సభ' జరుగనుంది. సంస్థాగత ఎన్నికలకు సంబంధించి నాగపూర్ ప్రధాన కార్యాలయానికి వెలుపల సమావేశం జరగనుండటం ఇదే ప్రథమం. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్‌లో నెంబర్-2 పొజిషన్‌కు కొత్త వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉందని, సురేష్ భయ్యాజీ జోషి స్థానంలో మరొకరిని తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవహ్ (ప్రధాన కార్యదర్శి)గా 12 ఏళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న భయ్యాజీ 2018లోనే తన పదవి నుంచి వైదొలగాలని అభిలషించారు. అయితే ఆయనకు ఉన్న సంస్థాగత నైపుణ్యం దృష్ట్యా ఆయనకు పదవీకాలాన్ని ఆర్ఎస్ఎస్ పొడిగించింది. ఆర్ఎస్ఎస్‌లో సర్‌కార్యవహ్‌ను మూడేళ్లకు ఒకసారి ఎన్నుకుంటారు. సంస్థ రోజువారీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత సర్‌కార్వవహ్ పైనే ఉంటుంది. 73 ఏళ్ల భయ్యాజీ జోషి 2009 నుంచి సర్‌కార్యవహ్‌గా ఉంటున్నారు. తన ఆరోగ్య కారణాల దృష్ట్యా 2018లోనే పదవి నుంచి వైదొలగాలని ఆయన కోరుకున్నప్పటికీ కొద్దికాలం కొనసాగాల్సిందిగా సంస్థ కోరింది. అయితే ఈసారి ఆయన పదవి నుంచి వైదొలిగే అవకాశం ఉంది.


సర్‌కార్యవహ్‌ పదవిని ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఎన్నుకుంటుంది. దేశవ్యాప్తంగా 1,400 మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటారు. కాగా, భయ్యాజీకి మరోసారి ఎక్స్‌టెన్సన్ ఇవ్వడం కానీ, కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కానీ ఉండొచ్చనీ, దీనిపై సంస్థ ప్రతినిధులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటారని నాగపూర్ సంఘ్ సిద్ధాంతకర్త ఒకరు తెలిపారు. భయ్యాజీ స్థానంలో దత్తాత్రేయ హోసబలె పేరు ప్రచారంలో ఉంది. 2024లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం, 2025లో సంఘ్ 100 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో సంఘ్‌లో సర్‌కార్యవహ్ పదవికి ఎన్నిక ఈసారి చాలా కీలకం కానుంది.

Updated Date - 2021-01-19T20:48:35+05:30 IST