దక్షిణ అమెరికాలో వుడుముల సంచారంపై కొత్త విషయాలు

ABN , First Publish Date - 2021-04-10T23:24:33+05:30 IST

పాలు ఇచ్చే జంతువులు దక్షిణ అమెరికాలో సంచరించడం గురించి కొత్త విషయాలు

దక్షిణ అమెరికాలో వుడుముల సంచారంపై కొత్త విషయాలు

న్యూఢిల్లీ : పాలు ఇచ్చే జంతువులు దక్షిణ అమెరికాలో సంచరించడం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిలియన్ పటగోనియాలో వుడుము వంటి క్షీరదానికి సంబంధించిన అవశేషాలు లభించడంతో ఈ ప్రాంతంలో ఇటువంటి జంతువులు అంతకు ముందు ఊహించినదానికి పూర్వమే సంచరించినట్లు రుజువైంది. డైనోసార్లు మనుగడలో ఉన్న కాలంలోనే ఈ క్షీరదాలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. 


సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో ఈ డిస్కవరీ గురించి ప్రచురితమైంది. అర్జెంటైనాకు చెందిన నేచురల్ హిస్టరీ, లా ప్లాటా మ్యూజియం, చిలియన్ అంటార్కిటిక్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు, చిలీ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు ఈ అధ్యయనాలను నిర్వహించారు. 


సుప్రసిద్ధ టొరెస్ డెల్ పైనే నేషనల్ పార్క్‌ సమీపంలో ఐదు పళ్ళుగల దవడ ఎముక భాగానికి చెందిన అవశేషం దొరికింది. దీనిని ‘ఐదు పళ్ళ జంతువు’గా పిలుస్తున్నారు. స్థానిక భాషలో దీనిని ‘ఒరెతెరియమ్ ట్జెన్ అంటున్నారు. ఈ జంతువులు దాదాపు 72 మిలియన్ల నుంచి 74 మిలియన్ల సంవత్సరాల క్రిందట జీవించినట్లు భావిస్తున్నారు. ఇవి శాకాహారులని గుర్తించారు. 


చిలీ విశ్వవిద్యాలయానికి చెందిన పలియాంటోలజిస్ట్ సెర్గియో సోటో మాట్లాడుతూ, డైనోసార్లతో కలిసి జీవించిన క్షీరదాలు చాలా కాలం క్రితం అంతరించిపోయాయని, వీటిని గొండ్వానాథెరియా అంటారని చెప్పారు. ఈ గొండ్వానాథెరియా పరిణామ క్రమానికి సంబంధించిన పజిల్‌ను పూర్తి చేయడానికి ఈ అవశేషాలు చాలా ముఖ్యమైనవని చెప్పారు. 


మొక్కలు, జంతువులు, ఫంగీ, బ్యాక్టీరియా అవశేషాల ఆధారంగా భూమిపై జీవుల చరిత్రను అధ్యయనం చేసే శాస్త్రం పలియాంటాలజీ. ఈ అధ్యయనాలకు చిలీ దక్షిణ భాగంలో విపరీతమైన అవకాశాలు ఉన్నాయని తమ అధ్యయనాల్లో వెల్లడైందని సోటో చెప్పారు. డైనోసార్లు, క్షీరదాలు, ఇతర జంతువుల గురించి చాలా కాలం నుంచి తమకు  అనేక ప్రశ్నలు ఉన్నాయన్నారు. వీటికి సమాధానాలు రాబట్టడానికి దోహదపడే అవశేషాలు ఇక్కడ దొరుకుతున్నాయన్నారు. ఇవి దొరుకుతాయని తాము అసలు ఊహించలేదని తెలిపారు. 


Updated Date - 2021-04-10T23:24:33+05:30 IST