కరోనా నీడలో కొత్త భవిష్యత్తు

ABN , First Publish Date - 2020-07-09T06:11:49+05:30 IST

నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్, అనుత్పాదకత దేశ ఆర్థిక సామాజిక మూలాల మీద వచ్చే ఒకటి రెండు దశాబ్దాలపాటు ప్రభావం చూపనుంది. బళ్ళు ఓడలుగా ఓడలు బళ్ళుగా మారనున్నాయి...

కరోనా నీడలో కొత్త భవిష్యత్తు

ప్రస్తుత పరిస్థితులను గమనించినట్లయితే కొవిడ్-19 ప్రభావం మరో సంవత్సరం వరకూ ఉండబోతోంది. కరోనా నేపథ్యంలో– జీతం ఎంత తక్కువ ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భద్రతను గమనించిన నేటి తరం మళ్ళీ సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయనుంది. ఈ పరిస్థితుల్లో ప్రాధాన్యతను సంతరించుకున్న మరో రంగం వైద్య విద్య. ఇంజనీర్లు ఇతర రంగాలవారు ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉండగా జాతి యావత్తును రక్షించే పనిని డాక్టర్లు భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. కరోనా వలన పారిశ్రామిక రంగమూ విపరీతంగా బలపడబోతోంది. వైద్య ఉత్పత్తుల రంగానికి డిమాండ్ పెరుగుతుంది. రసాయన, ఫార్మసీ, బయో టెక్నాలజీ రంగాల్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడనున్నది. 


నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్, అనుత్పాదకత దేశ ఆర్థిక సామాజిక మూలాల మీద వచ్చే ఒకటి రెండు దశాబ్దాలపాటు ప్రభావం చూపనుంది. బళ్ళు ఓడలుగా ఓడలు బళ్ళుగా మారనున్నాయి. ఇప్పటివరకు అధిక ప్రాధాన్యత సంతరించుకున్న వివిధ రంగాలు, ఉద్యోగాలు, ప్రాధామ్యాలు తమ ఉనికి లేదా ప్రాధాన్యతను కోల్పోనున్నాయి. గత దశాబ్దాల కాలంగా ప్రాధాన్యతను కోల్పోయిన వివిధ రంగాలు, వృత్తులు, గణనీయ ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. 


అలాంటి రంగాలలో సివిల్ సర్వీసెస్ (ఇండియన్ బ్యురోక్రసీలో ఉన్నత తరగతికి చెందిన ఉద్యోగాలు)ను ప్రథమంగా పేర్కొనవచ్చు. 1990 ఆరంభ దశకంలో ప్రారంభమైన లిబరలైజేషన్, ప్రవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG) కారణంగా ప్రవేటు రంగంలో అవకాశాలు జీతభత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. విదేశీయానం, విదేశాలలో ఉండి ఉద్యోగం చేసే అవకాశం కూడా ఈ LPG విధానం కల్పించింది. ముఖ్యంగా సాఫ్టువేర్, బీపీఓ రంగాలు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. పర్యవసానంగా 1990 దశకం నుంచి నిన్న కరోనా లాక్‌డౌన్ వరకూ ఐఐటి/ ఎన్‌ఐటి/ ఐఐఎం/ యూనివర్శిటీ విద్యార్థులకూ, ఆయా ప్రొఫెషనల్సుకూ అత్యధిక జీతభత్యాలతోపాటు విదేశీ అవకాశం కల్పించే ఆయా ప్రవేటు కంపెనీలే గమ్యస్థానాలుగా మారాయి. సుదీర్ఘ కాల పరీక్షలు, మూడు నాలుగు సంవత్సరాల అకుంఠిత దీక్ష సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కావాల్సిన ప్రాథమిక అర్హతలు. ఇంతా చేసి ప్రయత్నాలు సఫలీకృతం అయి సర్వీసుల్లో చేరిన తర్వాత వచ్చే జీతాలు అరకొర మాత్రమే. కేవలం ప్రజాసేవ చేయగలుగుతామన్న ఆశావహ సేవాదృక్పథంతోనే చాలామంది పేద, మధ్యతరగతి విద్యార్థులు సివిల్ సర్వీసుల వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. కానీ ఏనాడైతే నేరుగా కాంపస్ నుంచి లక్షలు, కోట్లు జీతాలు వచ్చే ఉద్యోగ అవకాశాలు కలిగాయో చాలామంది వందేళ్ళకు పైగా వస్తోన్న సివిల్ సర్వీసుల ఆకర్షణ వదిలేసి ఆ వైపుగా పరుగెట్టారు. మరీ ముఖ్యంగా గత దశాబ్దంలో ఉన్నత వర్గాల నుంచి ఐయ్యేఎస్/ ఐపిఎస్/ ఐఆర్‌ఎస్/ ఐఎఫ్‌ఎస్ అధికారులకు పిల్లనిచ్చే వారు కూడా కరువయ్యారు. లక్షల జీతాన్నిచ్చే సాఫ్టువేరును, అన్ని రకాల వ్యవప్రయాసలతో కూడుకున్న సివిల్ సర్వీసులను త్రాసుకు రెండువైపులా తూచినప్పుడు మెజారిటీ తల్లిదండ్రులు, అత్తమామలు, విద్యార్థులు సాఫ్టువేరువైపు మాత్రమే మొగ్గుచూపుతూ వచ్చారు. 


కానీ కరోనా వైరస్ పరిస్థితిని తల్లక్రిందులు చేసింది. విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ప్రవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం తమ తమ దేశాలకు చేరుకోవడం జరుగుతోంది. క్రింది స్థాయి నుంచి అత్యున్నత స్థానం వరకు ఉన్న ప్రవేటు ఉద్యోగులు ఇండియాలో ఉన్నవారు (చైర్మన్, మెనేజింగ్ డైరక్టర్లతో సహా) ఇళ్ళల్లో ఊరికినే కూర్చున్నారు. మరోపక్క తమ సహాధ్యాయులైన ప్రభుత్వ ఉన్నతోద్యోగులు దేశాన్ని వైరస్ నుంచి రక్షించే పనిలో నిమగ్నం కావడం గమనించారు. కోట్ల రూపాయల కోసం విదేశాలకు వెళ్ళి పని చేస్తున్న వారిని విమానాల్లో, ఓడలలో స్వదేశానికి చేరవేస్తున్నవారు, ఆయా మిషన్స్‌కు నాయకత్వం వహిస్తున్నవారు ఒకప్పటి తమ సహాధ్యాయులైన సివిల్ సర్వెంట్లు మాత్రమే అని గమనించిన వారు ఖిన్నులయ్యారు. తాము కోల్పోయినది ఏదో గ్రహించారు. ఒకప్పుడు తమ నిర్ణయమే సరైనది అని విర్రవీగినవారు చిన్న జీతమైనా దేశ సేవలో మునిగిన సివిల్ సర్వెంట్లను అభినందిస్తున్నారు (ఇది నా స్వానుభవం కూడా). వర్క్ సాటిస్ఫాక్షన్ మాత్రమే కాదు, లాక్‌డౌన్ మొదలయిన నాటి నుంచి తమ జీతాలను అందుకుంటున్నవారు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. ప్రవేటు రంగంలో పని చేస్తున్నవారి పట్ల ముఖ్యంగా సాఫ్టువేర్ ఉద్యోగుల పట్ల చాలా కంపెనీలు ‘నో వర్క్ నో పే’ పద్ధతిని ఆచరిస్తున్నట్లుగా వినికిడి. ఉద్యోగ భద్రత అనే విషయం నేడు మళ్ళీ విద్యార్థి ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీతం ఎంత తక్కువ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భద్రతను గమనించిన నేటి తరం మళ్ళీ సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయనుంది. వివాహ సంబంధ విషయాల్లో, సామాజిక హోదా విషయాల్లో మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు 1990 దశకం ముందునాటి పరిస్థితిని చూడనున్నారు. విద్యా ర్థులు మరో రెండు మూడు దశకాల వరకూ సాఫ్టువేరు ఉద్యోగాలే మా లక్ష్యం అన్న పరిస్థితి లేదు. (పెద్ద పెద్ద ప్రవేటు కంపెనీల చైర్మన్లు సైతం వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ దేశంలో పరిస్థితిని వివరిస్తుంటే నోరు వెళ్ళబెట్టుకొని ఇంట్లో కూర్చుని వినవలసిన పరిస్థితే ఉత్తమ ఉదాహరణ, నా వాదానికి).


కరోనా వైరస్ జాతిపై చూపిన ప్రభావం కారణంగా విపరీతమైన ప్రాధాన్యతను సంతరించుకున్న మరో రంగం వైద్య విద్య. నిన్నటివరకూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంపీసీ సీటు రానివారు, ఇంకా తరతరాలుగా వస్తున్న వైద్య వృత్తిని వదులుకోలేక బైపీసి తీసుకున్నవారు ఈ రెండు రకాలైన విద్యార్థులు మాత్రమే వైద్య విద్యను అభసించేవారు. ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ వైద్య విద్యను అభ్యసించటానికి మూడేళ్ళు వెరసి వైద్య విద్యార్థులు తమ ఆదాయ ఆరంభం నాటికి ముప్పయ్యేళ్ళు వస్తుండేవి. అదేకాలం నాటికి ఇంజనీరింగ్/ సాఫ్టువేర్ ఉద్యోగులు భార్యాపిల్లలు సొంత ఇంటితో కళకళలాడుతుండేవారు. కానీ కరోనా వైరస్ ఈ పరిస్థితి మొత్తాన్ని తలక్రిందులు చేసింది. ఇంజనీర్లు ఇతర రంగాలవారు ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉండగా జాతి యావత్తును కాపాడి రక్షించే పనిని డాక్టర్లు తమ భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని రోగులకు సేవ చేస్తున్నారు. దీనితో డాక్టర్ వృత్తిపై ప్రజల్లో అనుకోకుండానే గౌరవం ఆరాధనా భావం పెరిగాయి. నిన్నటివరకు డాక్టర్లదేముందిలే అనుకున్న ప్రజలు సైతం వారే లేకపోతే తమ గతి ఏమై ఉండేదేమోనన్న కృతజ్ఞతాభావంతో మెలుగుతున్నారు. ఒక్కో నివాస సొసైటీలలో వారి మీద పూలు కురిపించడం, ప్రణామం చేయడం లాంటి చర్యలు వారిలోనూ, ఇవి గమనిస్తున్న నేటి వైద్య విద్యార్థుల్లోనూ వృత్తిపట్ల అంకితభావాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు వైద్యుల జీతభత్యాలను విపరీతంగా పెంచేశాయి. ఇప్పుడు డాక్టర్లకు చేతినిండా పనే. ఇప్పుడు మనం చర్చించిన అన్ని విషయాలు పారామెడికల్ సిబ్బంది, ఆయుష్ డాక్టర్లు, ఫార్మసీ రంగంలో పని చేసేవారికి కూడా అన్ని విధాలా వర్తిస్తాయి.


కరోనా వైరస్ నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి ఇటీవల ప్రకటించిన ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల విధానం - నినాదం ఇప్పటి వరకు పరిమిత సీట్ల విషయమై మెడిసిన్‍ను ఎంచుకుంటున్న విద్యార్థులు, తల్లిదండ్రుల హృదయాల్లో ఉన్న భయాందోళనను కూడా పటాపంచలు చేశాయి. దీని పర్యవసానంగా రాబోయే రెండు దశాబ్దాల్లో ఎంపీసీకి బదులుగా బైపీసీ, ఇంజనీరింగుకు బదులుగా మెడిసిన్ కోర్సులకు సహజంగానే డిమాండ్ ఏర్పడబోయే పరిస్థితిని మనం చూడబోతున్నాం. 


కరోనా వైరస్ వలన పారిశ్రామిక రంగమూ విపరీతంగా బలపడబోతోంది. మెడికల్ పరికరాలు, శానిటైజర్లు, ముఖానికి మాస్కులు తయారు చేసే వైద్య ఉత్పత్తుల రంగానికి డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులను గమనించినట్లయితే కొవిడ్-19కు సంబంధించిన భయం దాని ప్రభావం మరో సంవత్సరం వరకూ ఉండబోతోంది. అనగా మార్చి 31,2021 వరకు జాతీయ అంతర్జాతీయ సమాజం మొత్తం కరోనా వైరస్‌ను మాత్రమే కేంద్రంగా చేసుకొని తమ కార్యకలాపాలను నిర్వహించబోతోంది. కాబట్టి కరోనాకు సంబంధించిన మెడిసిన్, ఫార్మసి, ఎక్విప్మెంట్ సహజంగానే పారిశ్రామిక రంగంలో అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ప్రాధాన్యతను కొనసాగించనున్నాయి.


ఇక విద్యారంగాన్ని గమనించినట్లయితే గతంలో మాదిరి గుంపులు గుంపులుగా విద్యార్థులు ఒకేచోట చదివే పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రవేటు సంస్థలు తమ స్కూలు, కాలేజీ విద్యార్థులకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తరగతులు ఆరంభించాయి. ప్రభుత్వం కూడా ఆ దిశలోనే అడుగులు ముందుకు వెయ్యబోతోంది. ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన విషయం పాఠశాల/ కళాశాల/ విశ్వవిద్యాలయ స్థాయి అన్ని తరగతులకు క్రమేణా గతంలో మాదిరిగా గదిలో కూర్చోబెట్టి కాకుండా విడివిడిగా లాప్‍టాప్/ మొబైల్ ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాఠాలను అందించడానికి మన దేశంలో తగినంత ఇంటర్నెట్ నెట్వర్క్ ఉన్నదా? ఇప్పుడు ఉన్న 4G/ 5G సామర్థ్యం ఒక్కసారిగా విపరీతంగా పెరగనున్న డిమాండ్లకు సరితూగగలదా? అలాగే అన్ని రకాల విద్యార్థులు ఉండే ఈ సమాజంలో పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులు ఈ -తరగతులకు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా తయారుగా ఉన్నారా? అన్నదే మన ముందున్న సవాలు.


సాఫ్టువేర్, బీపీఓ, LPGల ఆవిర్భావంతో ప్రాభవం కోల్పోయి కొట్టుకుపోయిన రంగం ఆర్&డి - రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కరోనా వైరస్ నేపథ్యంలో రసాయన, ఫార్మసీ, బయో టెక్నాలజీ రంగాల్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడనున్నది. కేవలం మొబైల్ ఫోన్లలో/లాపుటాప్‌లలో కొత్త ఫీచర్లను కనుక్కోవడమే ఆర్&డిగా మసలిన కృత్రిమతకు కాలంచెల్లి వివిధ రకాలైన జబ్బులకు వాక్సీన్లు, దివ్యౌషధాలు కనుక్కోవడమే జీవన ఆర్&డి పరమావధిగా రాబోయే రోజుల్లో నూతన శకానికి నాంది వాచకం కానుంది. ఔషధ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేయనున్నారు. ఈ రంగంలో విద్యార్థులకు విపరీతమైన అవకాశాలు ఏర్పడనున్నాయి.


ప్రస్తుతం కొనసాగుతోన్న పర్యావరణ పరిస్థితుల్లో ఆఫీసుకు ఉన్న ప్రాధాన్యత క్రమేణా తగ్గిపోయి ఎక్కడెక్కడయితే సిబ్బంది ఖచ్చితంగా ఆఫీసుకు (పని పూర్తవడానికి) రానవసరం లేదో అక్కడంతా వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ ఆరంభమవనున్నది. ముఖ్యంగా ప్రవేట్ రంగంలోని ఉద్యోగాలు, విద్యకు సంబంధించిన ఉద్యోగాలు ఈ మార్గం పట్టనున్నాయి. కాబట్టి ఇల్లు అంటే గతంలో మాదిరిగా కేవలం రిలాక్సింగ్ ప్లేస్ గానే కాకుండా ఒకేసారి తల్లి/ తండ్రి వర్క్ ఫ్రంహోమ్, పిల్లలు క్లాసెస్ విని చదువు నేర్చుకునే ఒక serious sanctified స్థలంగా కూడా మన ఇళ్ళనూ, పని చేసే సంస్కృతినీ మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.

నేలపట్ల అశోక్ బాబు

ఇన్‌కమ్‌ టాక్స్ జాయింట్ కమిషనర్, పూణే

Updated Date - 2020-07-09T06:11:49+05:30 IST