Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 12 2021 @ 14:33PM

రూపానీ వారసుడి కోసం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం

అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ స్థానంలో ఎవరు ఎంపిక కానున్నారనే సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. కొత్త నేత ఎంపిక కోసం గాంధీనగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయమైన శ్రీ కమలంలో బీజేపీ లెజిస్లేచర్ల సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పటేల్, కేంద్ర పరిశీలకులుగా ప్రహ్లాద్ జోషి, నరేంద్ర సింగ్ తోమర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఎన్నికైన నేత నేరుగా గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను  కలుసుకుని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారని, ప్రమాణస్వీకారం చేసే తేదీని ఆ తర్వాత ఖరారు చేస్తామని గుజరాత్ బీజేపీ ప్రతినిధి యమల్ వ్యాస్ తెలిపారు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు, మొత్తం ప్రక్రియ సజావుగా సాగేందుకు పార్టీ పరిశీలకులుగా తోమర్, జోషిలను బీజేపీ అధిష్ఠానం గుజరాత్ పంపింది. బీజేపీ చీఫ్ సీఆర్ పటేల్‌ను ఆదివారం ఉదయమే కలుసుకున్న తోమర్..కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయమై రాష్ట్ర నేతలతో చర్చిస్తున్నట్టు చెప్పారు.ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్న వారిలో ప్రఫుల్ ఖోడా పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రులు పర్సోత్తమ్ రూపాల, మన్షుఖ్ మాండవీయ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, వ్యవసాయ శాఖ మంత్రి ఆర్‌సీ ఫల్డు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

Advertisement
Advertisement