హెచ్-1బీ వీసాపై యూఎస్ కాంగ్రెస్‌లో కొత్త బిల్లు

ABN , First Publish Date - 2021-03-04T20:58:08+05:30 IST

విదేశీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగావకాశాలు కల్పించే హెచ్-1బీ వీసాల జారీ విషయమై యూఎస్ కాంగ్రెస్‌లో ముగ్గురు అమెరికన్ చట్ట సభ్యులు కొత్త బిల్లును ప్రతిపాదించారు.

హెచ్-1బీ వీసాపై యూఎస్ కాంగ్రెస్‌లో కొత్త బిల్లు

వాషింగ్టన్: విదేశీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగావకాశాలు కల్పించే హెచ్-1బీ వీసాల జారీ విషయమై యూఎస్ కాంగ్రెస్‌లో ముగ్గురు అమెరికన్ చట్ట సభ్యులు కొత్త బిల్లును ప్రతిపాదించారు. హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో సమూలమార్పును కోరుతూ రిపబ్లికన్​ సభ్యులు అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికన్ సంస్థలు విదేశీ ఉద్యోగులను చేర్చుకోకుండా, స్థానికులకు భారీ మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించటమే ఈ బిల్లు లక్ష్యం. హెచ్-1బీ వీసాపై ఇటీవల చేపట్టిన నియమకాలు సహా, భవిష్యత్తు నియామకాలను కూడా అడ్డుకునేందుకు రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ్యులు మో బ్రూక్స్, మాట్ గేట్జ్, లాన్స్ గూడెన్ ఈ బిల్లును బుధవారం కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు.


'జాబ్స్ ఫస్ట్ యాక్ట్' పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా వలస విధానంతో పాటు అమెరికన్ జాతీయత చట్టంలో కావాల్సిన మార్పులు చేయడం ద్వారా హెచ్-1బీ వీసా ప్రక్రియను సరిచేయాలని ఈ ముగ్గురు సభ్యుల బృందం ప్రతిపాదించింది. అయితే, అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ సభ్యులు అధికంగా ఉన్నందున ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు.


ఈ సందర్భంగా రిపబ్లికన్​ కాంగ్రెస్​ ప్రతినిధి మో బ్రూక్స్ మాట్లాడుతూ.. "అమెరికా నిపుణులను కనీసం రెండేళ్లపాటు ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించకూడదు. అలాగే విదేశీయుడిని గడువు తేదీకన్నా ముందే ఉద్యోగం నుంచి తొలగిస్తే సదరు యాజమాన్యం ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. మై అమెరికన్ జాబ్ ఫస్ట్ యాక్ట్ అనేది తప్పకుండా అమలు కావాలి. అప్పుడే హెచ్-1బీ వీసా కార్యక్రమంలో సమూలమార్పు జరుగుతోంది. దాంతో స్వదేశంలో ఉపాధి కోసం అమెరికన్లు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు." అని బ్రూక్స్ అన్నారు.


ఒకవేళ తాము ప్రతిపాదించిన ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే లాటరీ పద్దతిలో వీసా జారీ కార్యక్రమానికి తెర పడుతుందని బ్రూక్స్ తెలిపారు. అలాగే గతంలో అర్హతలతో సంబంధం లేకుండా 50వేలకు పైగా గ్రీన్ కార్డులను జారీ చేయడం వల్ల అమెరికా ప్రయోజనాలను దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు. కాగా, అమెరికన్​ సంస్థలు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు యూఎస్.. హెచ్​-1బీ వీసాలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా భారత్, చైనాల నుంచి ప్రతియేటా వేలాది మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు నియమించుకోవడం జరుగుతోంది.

Updated Date - 2021-03-04T20:58:08+05:30 IST