నవ భారత విద్యా దార్శనికుడు

ABN , First Publish Date - 2021-09-05T05:34:38+05:30 IST

స్వాతంత్ర్యానంతరం భారతావనిలో విద్యాచైతన్యాన్ని, జ్ఞానజ్వాలలను ప్రసరింపజేసిన చింతనాపరుడు, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఆధునిక విద్యా దార్శనికుడు భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్. జీవిత పర్యంతం విసుగులేని జ్ఞానతృష్ణతో...

నవ భారత విద్యా దార్శనికుడు

స్వాతంత్ర్యానంతరం భారతావనిలో విద్యాచైతన్యాన్ని, జ్ఞానజ్వాలలను ప్రసరింపజేసిన చింతనాపరుడు, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఆధునిక విద్యా దార్శనికుడు భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్. జీవిత పర్యంతం విసుగులేని జ్ఞానతృష్ణతో భారతీయతలోని ప్రజాహిత అంశాలను అన్వేషించి, వెలికితీసి ప్రపంచానికి చాటారు. ప్రజాతంత్ర విద్యతో సంభవించే మానవీయ సమాజ నిర్మాణంలో అనుపమేయమైన కృషి చేసిన ఉదాత్తుడు రాధాకృష్ణన్.


ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న తిరుత్తని గ్రామంలో ఒక రెవెన్యూ ఉద్యోగి కుటుంబంలో 1888 సెప్టెంబర్ 5న రాధాకృష్ణన్ జన్మించారు. విద్యార్థి దశ నుంచే భారతీయ చింతన, సాహిత్యం, సంస్కృతి, కళలపై మమకారం, శ్రద్ధాసక్తులు ఏర్పర్చుకుని భారత విద్యావికాసానికి పాటుపడిన గొప్ప స్వాప్నికుడు మన సర్వేపల్లి.


సర్వేపల్లి తన పాఠశాల విద్యను తిరుత్తని, తిరుపతిలో పూర్తిచేశారు. తత్త్వశాస్త్రంలో ఉన్నతవిద్యను మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో పూర్తిచేశారు. భారతీయ ఇతిహాసాలు, ఉపనిషత్తులు, బౌద్ధ వాఙ్మయాలపై అవగాహన లేని పాశ్చాత్య పండితుల సంకుచిత అపహాస్యపు విమర్శలకు సమాధానంగా విద్యార్థి దశలోనే ‘The Ethics Of Vedanta And Its Material Presupposition’ అనే పరిశోధనాపత్రాన్ని సమర్పించి భారతీయ చింతనపై తన లోతైన అవగాహనను ప్రపంచానికి తెలియజేశారు.


సర్వేపల్లి తన బోధనావృత్తిని 1909లో ప్రారంభించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా కళాశాల, మైసూర్ కళాశాలల్లో ఆయన పనిచేశారు. 1948లో కాశీ హిందూ విశ్వ విద్యాయాలనికి ఉపకులపతిగా సేవలందించి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు. 1948–1952 మధ్య ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో)లో భారత ప్రతినిధిగా, రష్యాలో రాయబారిగా పనిచేశారు. స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి (1952–62)గా, రెండో రాష్ట్రపతి (1962–67)గా రాధాకృష్ణన్ విశిష్ట రాజనీతిజ్ఞుడిగా దేశ ప్రజలు, అంతర్జాతీయ సమాజం గౌరవ మన్ననలను పొందారు.


రాధాకృష్ణన్ మహోన్నత విద్యా దార్శనికుడు. ‘ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగించడం, వ్యక్తుల వికాసానికి, జీవితోన్నతికి తోడ్పడే సృజనాత్మక సమాజ నిర్మాణమే విద్య లక్ష్యం’ అని ఆయన ఎలుగెత్తి చాటారు. విద్య వ్యక్తులలో వివేచనను, సమతుల్యతను, మంచి చెడుల విచక్షణను కలిగిస్తుందని చెబుతూ ఒక దేశం ఆ దేశ విద్యాసంస్థల్లో నిర్మాణమవుతుందని ఆయన అన్నారు. ‘భయమంటే తెలియని, అన్యాయాన్ని సహించని నైపుణ్యం, సామర్థ్యం, దృక్పథం, సాహసం, విలువలతో కూడిన విద్యార్థులను తయారుచేయడమే’ విద్యాసంస్థల విధ్యుక్త ధర్మమని ఆయన ఉద్బోధించారు. ఆ దిశగా పలు విద్యాసంస్థలను ఆయన తీర్చిదిద్దారు. సంపదను పెంపొందించే, అసమానతలు తగ్గించే, సామాజిక, ఆర్థిక అభ్యున్నతిని సాధించే, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉజ్వల భారతదేశాన్ని నిర్మిం చేందుకు విద్యను ఒక ముఖ్యసాధనంగా చేసుకోవాలని రాధాకృష్ణన్ పదే పదే చెబుతుండేవారు. విద్యాసంస్థల్లో వాణిజ్య దృక్పథం అసమానతల సమాజానికి, ఇంకా అనేక దుష్ఫలితాలకు దారితీస్తుందని ఆయన ఆనాడే హెచ్చరించారు. సత్వాన్వేషణ, సహనం, శ్రద్ధాసక్తులు పక్షపాతం లేకుండా ఉండడం, శ్రమపై గౌరవం వంటి విలువలను విద్య పెంపొందించాలి. విజ్ఞానశాస్త్ర ఫలాలు ముందెన్నడూ లేని భౌతిక సౌఖ్యాన్ని, విశ్రాంతి సమయాన్ని ప్రజలకు సమకూరుస్తున్నాయి. అదే సమయంలో మారణాయుధాలు, ప్రపంచ యుద్ధాలు మానవ ప్రగతిని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఈ అపశృతులను తొలగించడానికి విద్యాసంస్థల్లో సామాజిక, నీతిశాస్త్రాల బోధన తప్పని సరి చేయాలని రాధాకృష్ణన్ సూచించారు.


రాధాకృష్ణన్‌కు సాహిత్యం, కళలపై ప్రత్యేక అభినివేశం ఉండేది. స్వేచ్ఛా మానవుడి క్రమశిక్షణాయుత ఉన్నత అభిరుచులు, సృజనాత్మక వ్యక్తీకరణే కళ అని ఆయన భావించారు. 1952లో ఆలంపూర్‌లో దేవులపల్లి రామానుజరావు అధ్యక్షతన జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ సాహిత్య సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం తెలుగు సంస్కృతి, తెలుగు ప్రజల పట్ల ఆయనకు ఉన్న గౌరవాభిమానాలను తెలియజేసింది.


భారతీయ చింతనా సారస్వతంతో పాటు ప్రపంచదేశాల మహాకావ్యాలు, కళలు, దర్శనాలను రాధాకృష్ణన్ విస్తృతంగా అధ్యయనం చేశారు. ప్రాక్-పశ్చిమ తత్వశాస్త్రాలకు వారధిగా పనిచేసి వాటిని సమకాలీన, సామాజిక స్థితిగతులకు అనుగుణంగా ఆయన వ్యాఖ్యానించారు. తత్వశాస్త్ర ప్రధాన శాఖలైన మెటాఫిజిక్స్, లాజిక్, ఎపిస్టమాలజీ, ఎథిక్స్, సైకాలజీ అధ్యయనాలతో ప్రపంచ మానవాళిలో సామాజిక స్ఫూర్తిని ఆయన రగిలించారు. తన అధ్యయనాలు, అనుభవాలను, పరిశీలనల ఆధారంగా ఆయన పలు గ్రంథాలు రాశారు. వాటిలో ‘ఇండియన్ ఫిలాసఫీ’, ‘ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’ ‘రెలిజియన్ అండ్ సైన్స్’ ‘రికవరీ ఆఫ్ ఫెయిత్’ విస్తృత ప్రాచుర్యం పొందాయి. ఉపనిషత్తులు, భగవద్గీత, దమ్మపదలను ఆయన ఆంగ్లంలోకి అనితరసాధ్యమైన రీతిలో అనువదించారు.


దేశప్రగతిలో కీలకమైన విద్యాభివృద్ధికి సూచనలు చేయ వల్సిందిగా కోరుతూ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం 1948లో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన మొదటి విశ్వవిద్యాలయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సూచనలకు స్వతంత్ర భారతదేశ విద్యాచరిత్రలో చాలా ప్రాధాన్యం ఉన్నది. విశ్వవిద్యాలయాలు జ్ఞాననిలయాలుగా భాసిల్లాలని, నూతన ఆవిష్కరణలు చేయాలని, దేశం స్వావలంబన దిశగా, సార్వభౌమ స్వతంత్ర దేశంగా రూపొందాలని రాధాకృష్ణన్ కమిషన్ సూచించింది. ఆ లక్ష్యసాధనకు అనుసరించాల్సిన విద్యావిధానాన్ని సిఫార్సు చేసింది. కళాశాలల సంఖ్య పెరగాలని, విద్యా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, విద్యపై వ్యయాన్ని ప్రజల భవిష్యత్ కోసం పెట్టుబడిగా భావించాలని రాధాకృష్ణన్ సూచించారు.


ఉపాధ్యాయులు సమాజంలో అత్యున్నత మేధోజీవులు. చరిత్రను మలచడంలో, సామాజిక పునర్నిర్మాణంలో దారిచూపే దార్శనికులు. ఉపాధ్యాయులకు బోధనాంశాల పట్ల ప్రేమ, తమ శిక్షణలో విద్యార్థులు ఎదగాలనే ఆకాంక్ష ఉండాలని ఆయన అనేవారు. ఈ ఆదర్శాన్ని తాను ఆచరించి తోటి ఉపాధ్యాయులకు మార్గదర్శి అయిన మహోదాత్తుడు రాధాకృష్ణన్. ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడే విద్యార్థులు తమలోని స్వేచ్ఛను, మార్మికతను, మేధోపరమైన భావావేశాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


ప్రస్తుతం దేశ విద్యావ్యవస్థ తీరుతెన్నులను పరిశీలిస్తే సర్వేపల్లి దార్శనిక స్ఫూర్తికి భిన్నమైన ఆందోళనకరమైన స్థితి నెలకొని ఉంది. దేశంలో ఉన్న 15 లక్షల పాఠశాలల్లో 26 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 1000 పైగా ఉన్న విశ్వవిద్యాలయాలు, 34,852 కళాశాలల్లో 3 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 80 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యాసంస్థలు 70 శాతం ప్రైవేట్‌రంగంలో ఉన్నాయి. వీటిలో 80 శాతం విద్యాసంస్థలు నేలబారు ప్రమాణాలతో కునారిల్లుతున్నాయి. మానవసమాజ సమష్టి సంపద జ్ఞానాన్ని వ్యాపారం చేయడంతో మానవవిలువలు ధ్వంసం అవుతున్నాయి. జీడీపీలో విద్యపై వ్యయం 3 శాతం కూడా మించడం లేదు. అందరికీ గుణాత్మక విద్యను అందించినప్పుడే మానవాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి విద్యాదృక్పథానికి ప్రాసంగికత ఉన్నది. ఆ మహనీయుడి బాటలో ప్రభుత్వ విద్య పెరగాలి. వ్యాపారమయ విద్య తరగాలి. అప్పుడే వైజ్ఞానిక భారతావని రూపొందుతుంది.

అస్నాల శ్రీనివాస్

(నేడు ఉపాధ్యాయ దినోత్సవం, రాధాకృష్ణన్ 133వ జయంతి)

Updated Date - 2021-09-05T05:34:38+05:30 IST