ఇక ఉపాధికి ఊతం!

ABN , First Publish Date - 2021-08-02T07:50:56+05:30 IST

నిరుద్యోగులకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని శివానగర్‌, సుల్తాన్‌పూర్‌లలో ఏర్పాటు చేసిన కొత్త పారిశ్రామికవాడలు సిద్ధమయ్యాయి.

ఇక ఉపాధికి ఊతం!

సంగారెడ్డి జిల్లాలో కొత్త పారిశ్రామికవాడలు

సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైజ్‌, జిన్నారంలో ఎల్‌ఈడీ పార్కులు సిద్ధం 

120కి పైగా కంపెనీలకు అనుమతులు  


సంగారెడ్డి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిరుద్యోగులకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని శివానగర్‌, సుల్తాన్‌పూర్‌లలో ఏర్పాటు చేసిన కొత్త పారిశ్రామికవాడలు సిద్ధమయ్యాయి. మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలతో త్వరలోనే పరిశ్రమలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైజ్‌ పార్కు, జిన్నారం మండలం శివానగర్‌లో ఎల్‌ఈడీ పార్కులను ఏర్పాటు చేసింది. 552 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన సుల్తాన్‌పూర్‌ పారిశ్రామికవాడ నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని ఉండటం వల్ల పారిశ్రామిక ఉత్పత్తులను సులువుగా రవాణా చేసే వీలుంది. మొదటి దశలో 186 ఎకరాలు వైద్య పరికరాల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు, 127 ఎకరాలు ఇతర అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు, మరో 50 ఎకరాలు ప్రత్యేకంగా ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌) మహిళా పారిశ్రామిక వేత్తలకు కేటాయించారు. 


500 కోట్ల పెట్టుబడితో..

సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజ్‌ పార్కులో పరిశ్రమలు నెలకొల్పేందుకు పేరొందిన పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం 10 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ప్రముఖ గుండె కవాటాల (స్టంట్స్‌) తయారీ సంస్థ సహజానంద మెడికల్‌ టెక్నాలజీస్‌ 20ఎకరాల్లో ప్లాంట్‌ను సిద్ధం చేసుకుంది. ఇప్పటివరకు 22 వైద్యపరికరాల తయారీ పరిశ్రమలు, 81 అనుబంధ, 18 మహిళా పారిశ్రామికవేత్తల పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. రూ.500కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు పది పరిశ్రమలు ఉత్పత్తికి సిద్ధం కాగా, మరో 50 పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన స్థలం అందుబాటులో ఉంది.ఈ పారిశ్రామికవాడ ద్వారా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 11వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇక, శివానగర్‌లో 118 ఎకరాల్లో ఏర్పాటైన ఎల్‌ఈడీ పార్కులో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. మరో వైపు జిన్నారం మండలం మంగపేటలోని 22 ఎకరాల్లో హెలికాప్టర్‌ విడిభాగాల తయారీ పరిశ్రమ కోసం టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయి. ఎల్‌ఈడీ, హెలీకాప్టర్‌ విడిభాగాల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఐదు వేల మందికి ఉపాధి లభించనుంది. 


కాలుష్యానికి ఇక చెల్లు

పరిశ్రమల కారణంగానే పటాన్‌చెరు ప్రాంతం కాలుష్యమయంగా మారింది. గతంలో పరిశ్రమలు అంటేనే కాలుష్యం అన్న భయం ఉండేది. తాజాగా ఏర్పాటు చేస్తున్న సుల్తాన్‌పూర్‌ పారిశ్రామికవాడను హరిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. దీనికి అనుగుణంగానే పరిశ్రమలకు అనుమతులు జారీ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కాలుష్య నియంత్రణ చర్యలు సైతం చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-08-02T07:50:56+05:30 IST