హార్వార్డ్ బిజినెస్ రివ్యూ: మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఈ నాలుగు ప్రశ్నలు వేసుకోండి.. అప్పుడే సక్రమంగా పనిచేయగలుగుతారు!

ABN , First Publish Date - 2021-12-07T14:06:39+05:30 IST

మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు మీ మనసులో కొంత భయం..

హార్వార్డ్ బిజినెస్ రివ్యూ: మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఈ నాలుగు ప్రశ్నలు వేసుకోండి.. అప్పుడే సక్రమంగా పనిచేయగలుగుతారు!

మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు మీ మనసులో కొంత భయం, కొంత ఉత్సుకత, ఆందోళన కలగడం సహజం. కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు మొదటి కొన్ని రోజులు ఎంతో కీలకమైనవి. ఆ సమయంలో మీ పని తీరు లేదా మీరు ప్రవర్తించే విధానం మొదలైనవి మీ విజయాన్ని లేదా అపజయాన్ని నిర్ణయిస్తాయి. ఈ విషయంలో మీకు సరైన మార్గదర్శకత్వం కావాలంటే హార్వార్డ్ వర్శిటీ రూపొందించిన ఈ ప్రశ్నలు మీకు మీరే వేసుకోండి. అప్పుడు మీరు చేరిన ఉద్యోగంలో రాణిస్తూ, అందరితో కలసిపోయి పనిచేయగలుగుతారు.

సంస్థ మీ నుంచి ఏమి ఆశిస్తోంది?

మీరు చేరిన కొత్త సంస్థలోని వాతావరణానికి అనుగుణంగా ఉండేందుకు మీరు నియమితులయ్యారు తప్ప.. మీరు అక్కడి వాతావరణాన్ని మార్చడానికి నియమితులు కాలేదని గ్రహించండి. మీరు పనిచేసే సంస్థలోని వాతావరణానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. అలా కాకుండా ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఉన్నారని మీ తోటి ఉద్యోగులకు అనిపిస్తే వారు మీతో కలవరు. అప్పుడు మీరు ఒంటరిగా మిగులుతారు. సంస్థలో చేస్తున్న పని మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. 

కొత్త సంస్థలో ఎలా మెలగాలి?

కొన్ని రోజులు కొత్త సంస్థలో పనిచేసిన తర్వాత, అక్కడ ఎవరికి ఎక్కువ అధికారం ఉంది? ఎవరు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలుసుకోగలుగుతారు. తోటి సిబ్బందికి ఏమైనా సహాయం చేయగలనా? అనే దానిని కూడా పరిశీలించండి. సంస్థలో లభించే రివార్డుల ఆధారంగానే తోటి ఉద్యోగులతో బలమైన సంబంధాలు ఏర్పడతాయని గ్రహించండి.


నూతన సంస్థలో ప్రభావం చూపడానికి ఏమి చేయాలి?

సంస్థ నిర్వాహకులు.. సంస్థలో పని మెరుగుదల కోసం అవసరమైనప్పుడు మార్పుచేర్పులు చేస్తుంటారు. ఇటువంటి పరిస్థితులు సిబ్బందికి కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.  అటువంటప్పుడు సానుకూల వైఖరితో మెలగండి. సంస్థలో ఇబ్బదికర పరిస్థితులు ఏర్పడినప్పుడు పైవారికి మీకు తోచిన పరిష్కారం సూచించండి. అలాగే పూర్తి అంకితభావంతో పనిచేస్తూ, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా మిమ్మల్నిమీరు మలచుకోండి. ఈ విధంగా ప్రవర్తించినప్పుడు సంస్థ నిర్వాహకులతో పాటు తోటి ఉద్యోగులపై మీరు ప్రభావం చూపగలుగుతారు. 

ఎటువంటి నైపుణ్యాలను పెంచుకోవాలి?

ఇప్పుడు కొత్త ఉద్యోగంలో చేరారు. ఈ ఉద్యోగంలో పూర్తి స్థాయిలో ఇమిడిపోవడం ఎలా? మీరు ఇప్పుడు చేపట్టిన ఈ కొత్త పాత్రలో పూర్తి ప్రభావంతో, సమర్థవంతంగా పని చేయాలనుకుంటే, మీరు కొన్ని వ్యక్తిగత మార్పులు  చేసుకోవాల్సివుంటుంది. ఫలితంగా సంస్థకు, మీ అభివృద్ధికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సంస్థ తీరు తెన్నులకు అనుగుణంగా మీరు ఎలాంటి మార్పులు చేసుకోవాలో గ్రహంచండి. దీనిని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా మీరు సంస్థలో మీ విధులను ఇష్టాపూర్వకంగా చేయగలుగుతారు. 



Updated Date - 2021-12-07T14:06:39+05:30 IST