మద్యం దుకాణాలకు పర్యాటక సోకు

ABN , First Publish Date - 2021-10-13T05:11:46+05:30 IST

మద్యం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటోంది. దశల వారీ మద్యపాన నిషేధం మాటెలా ఉన్నా ప్రస్తుతం ఆదాయం పెంపుపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో మద్యం దుకాణాలను తగ్గించింది.

మద్యం దుకాణాలకు పర్యాటక సోకు

పేరుకు పర్యాటక సౌకర్య కేంద్రం..అమ్మేది మద్యం 

ప్రభుత్వ ఆదాయం పెంపే లక్ష్యం 

జిల్లాకు 30 మద్యం షాపులు కేటాయింపు

పట్టణాలు, ప్రధాన మండల కేంద్రాల్లో ఏర్పాటు 

ఒక్కో షాపులో కనిష్టంగా రూ. 2 లక్షల అమ్మకాలు 


(తాడేపల్లిగూడెం–ఆంధ్ర జ్యోతి)  : మద్యం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటోంది. దశల వారీ మద్యపాన నిషేధం మాటెలా ఉన్నా ప్రస్తుతం ఆదాయం పెంపుపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో మద్యం దుకాణాలను తగ్గించింది. ధరలు పెంచింది. తాజాగా దుకాణాలను కూడా ఏదో ఒక రూపంలో పెంచుకునే పనిలోపడింది. అందులో భాగంగానే మద్యం షాపులకు పర్యాటక సౌకర్య కేంద్రాలంటూ ముద్దుపేరు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 360 షాపులను పర్యాటక కోటాలో కేటాయించింది. జిల్లాకు 30 కేంద్రాలు మంజూ రయ్యాయి. ప్రభుత్వ మద్యం షాపుల్లో దొరకని బ్రాండ్‌ లను సైతం పర్యాటక సౌకర్య కేంద్రాల్లో అమ్మకాలు సాగిస్తు న్నారు. ప్రభుత్వ ఆధ్వర్యం లోనే వాటిని కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాకు కేటాయించిన కేంద్రాల్లో ఇప్పటికే 28 వరకు ఏర్పాటు చేశారు. మంచి బ్రాండ్‌లు లభ్యం కావడంతో మద్యం ప్రియులు ఎగబడు తున్నారు. ప్రతిరోజు ఒక్కో కేంద్రంలో సగటున రూ. 2లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. పర్యాటక సౌకర్య కేంద్రాల్లో ప్రభుత్వమే సిబ్బందిని నియమించింది. సూపర్‌ వైజర్‌కు రూ. 18 వేలు, సేల్స్‌ మ్యాన్‌ లకు రూ.15వేలు వంతున వేతనం ఇస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో పర్యాటక కేంద్రాలంటే పెద్దగా లేవు.పాపికొండలు, కొల్లేరు పర్యాటక కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. అయినా సరే ప్రభుత్వం పర్యాటకం పేరుతో కొత్త మద్యం షాపులను తెరపైకి తెచ్చింది. ఇది వరకే లిక్కర్‌ మాల్స్‌ నెలకొల్పారు. అక్కడ కూడా మంచి రకాలు లభ్యమవుతున్నాయి. ఏలూరు., భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు వంటి పట్టణాల్లో లిక్కర్‌ మాల్స్‌ ఏర్పాటయ్యాయి. ఇప్పుడు పర్యాటక సౌకర్య కేంద్రాల పేరుతో ఇంకొన్ని మద్యం షాపులను తెరిచారు. మొత్తంపైన మద్య నిషేధం వైపు కాకుండా ఆదాయం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బ్రాండెడ్‌ రకాల విక్రయానికి మొగ్గు చూపుతోంది. 


Updated Date - 2021-10-13T05:11:46+05:30 IST