కొత్త రూపు.. తెచ్చేనా లక్కు ?

ABN , First Publish Date - 2020-09-18T09:16:15+05:30 IST

రెండుసార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిలకడలేని ఆటతో గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసింది.

కొత్త రూపు..  తెచ్చేనా లక్కు ?

ఐపీఎల్‌ రేపటి నుంచే

 గత ప్రదర్శన

 2012, 2014: విజేత

 2017, 2018: మూడోస్థానం


రెండుసార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిలకడలేని ఆటతో గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసింది. జట్టు కూర్పులో ప్రయోగాలతో విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఈసారి జట్టులో సమూల మార్పులు చేసింది. ప్రతిభ కలిగిన స్వదేశీ ఆటగాళ్లు, విదేశీ స్టార్ల మేళవింపుతో కేకేఆర్‌ కొత్తరూపు సంతరించుకుంది. మరి ఇవన్నీ ఆ జట్టుకు ఈసారి లక్కు తెచ్చిపెడతాయేమో చూడాలి.


బలం: దినేశ్‌ కార్తీక్‌ నాయకత్వం, తన కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ను పరిమిత ఓవర్లలో తిరుగులేని జట్టుగా తీర్చిదిద్దిన ఇయాన్‌ మోర్గాన్‌ తోడవడం, న్యూజిలాండ్‌ గొప్ప సారథిగా మన్ననలు అందుకున్న బ్రెండన్‌ మెకల్లమ్‌ కోచింగ్‌.. వెరసి కోల్‌కతా తిరుగులేని జట్టుగా మారింది. మెరుపు బ్యాటింగ్‌కు మారుపేరైన సునీల్‌ నరైన్‌, ధనాధన్‌ ఆటతో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే ఆండ్రీ రస్సెల్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి, సిద్దేశ్‌ లాడ్‌తో జట్టు బ్యాటింగ్‌ పదునుగా ఉంది. ఈ ఐపీఎల్‌లో రూ. 15.50 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పాట్‌ కమిన్స్‌ ఆధ్వర్యంలో ప్రసిధ్‌ కృష్ణ, ఫెర్గూసన్‌తో పేస్‌ బౌలింగ్‌ పటిష్టంగా ఉంది. ఇక యువ పేసర్లు శివం మావి, కమలేష్‌ నాగర్‌ కోటి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. స్పిన్నర్లకు సహకరించే యూఏఈ పిచ్‌లపై సీనియర్‌ కుల్దీప్‌ యాదవ్‌, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కీలకం కానున్నారు. 


బలహీనత: నిలకడగా రాణించకపోవడం కేకేఆర్‌ ప్రధాన సమస్య. దానికితోడు బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో కెప్టెన్‌ కార్తీక్‌పై రస్సెల్‌ నిరుడు బహిరంగంగా విమర్శలు చేయడం కలకలం రేపింది. దాంతో జట్టులో పరిస్థితులు సవ్యంగా లేవని అర్థమైంది. అయితే వారిమధ్య సమస్యలు పరిష్కారమయ్యాయని యాజమాన్యం చెబుతోంది. సమష్టిగా రాణించలేకపోవడం కేకేఆర్‌ ప్రధాన లోపం. 


స్వదేశీ ఆటగాళ్లు: దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), కుల్దీప్‌ యాదవ్‌, రింకూసింగ్‌, శుభ్‌మన్‌ గిల్‌, కమలేష్‌ నాగర్‌కోటి, శివం మావి, నిఖిల్‌ నాయక్‌, ప్రసిధ్‌ కృష్ణ, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి, సిద్ధార్థ్‌, సందీప్‌ వారియర్‌, వరుణ్‌ చక్రవర్తి, సిద్దేష్‌ లాడ్‌.


విదేశీ ఆటగాళ్లు: మోర్గాన్‌, రస్సెల్‌, నరైన్‌, టామ్‌ బాంటన్‌, పాట్‌ కమిన్స్‌, క్రిస్‌ గ్రీన్‌, అలీ ఖాన్‌, లూకీ ఫెర్గూసన్‌.

Updated Date - 2020-09-18T09:16:15+05:30 IST