కొత్త ఎత్తుగడ

ABN , First Publish Date - 2021-11-23T07:32:12+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడురాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం వ్యూహాత్మకమేతప్ప, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వేసిన అడుగు...

కొత్త ఎత్తుగడ

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడురాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం వ్యూహాత్మకమేతప్ప, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వేసిన అడుగు కాదని అర్థమవుతూనే ఉంది. న్యాయస్థానంలో వాదనలు ఆరంభం కాగానే, బిల్లు ఉపసంహరణ నిర్ణయాన్ని ముందుగా అక్కడ తెలియచేసి, అనంతరం శాసనసభలో ఆ ప్రక్రియ పూర్తిచేశారు. ఇది జగన్‌ మూడు రాజధానుల విన్యాసానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజాఉద్యమం విజయమని కొందరు వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, ఇంటర్వెల్ మాత్రమేనని ప్రభుత్వ పెద్దలు స్పష్టంచేస్తున్నారు. మరింత మెరుగైన సమగ్రమైన బిల్లుతో మళ్ళీవస్తామన్న ప్రకటనతో జగన్ మరో సరికొత్త రాజకీయానికి తెరదీసినందుకు విపక్షాలు మండిపడుతున్నాయి.


రైతుల పాదయాత్ర చూసి వెనక్కుతగ్గలేదనీ, సాంకేతిక సమస్యలు సరిదిద్దుకొనే వీలుకోసమే ఈ నిర్ణయం చేశామని అధికారపక్ష పెద్దలు స్పష్టంగానే చెబుతున్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పాలనావికేంద్రీకరణ పేరిట ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని, కులం, మతం రంగులద్ది రాజకీయం చేసినవారికి న్యాయస్థానాల్లో తమ వాదనలు నిలబడనంత బలహీనంగా, అసమగ్రంగా తమ చట్టాలున్నాయని ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందో! హైకోర్టులో మూడు రాజధానుల అంశంపై విచారణ ఆరంభమై, వాదనలు జోరుగా సాగుతున్న తరుణంలో తాము చేసిన చట్టాలు సరిగా లేవని ఒప్పు కుంటున్నారు. త్వరలో తీర్పు వెలువడి, రాష్ట్రం ఈ గందరగోళస్థితినుంచి బయటపడుతుందని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో, మరింత మెరుగైన కొత్త బిల్లుతో మళ్ళీ కత్తిదూస్తామంటున్నారు. న్యాయస్థానాలు తమ పక్షాన నిలబడబోవన్నది అర్థమైనందున, ముగింపునకు రాబోతున్న న్యాయవిచారణను ఈ కొత్త ఎత్తుగడతో పక్కదోవపట్టించాలనుకుంటున్నది ప్రభుత్వం. 


ప్రస్తుతానికి ఈ వాదనలకు స్వస్తిచెప్పేట్టు చేయడం వెనుక చాలా లెక్కలున్నాయి.  అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల మద్దతు క్రమేపీ హెచ్చడం, విపక్షాలన్నీ ఏకం కావడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన అనంతరం ఆయన విస్పష్ట ఆదేశాలతో ఇంతకాలం ఊగిసలాటలో ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకులు ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం వంటి పరిణామాలు జగన్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసిన మాట నిజం. అమరావతి ఉద్యమాన్ని నీరసపరచడమే కాక, వివేకాహత్యకేసు, చంద్రబాబు భార్యపై వైసీపీ నేతల దుర్భాషల వంటి అంశాలనుంచి ప్రజల దృష్టిమరల్చడం కూడా ఈ ఎత్తుగడ లక్ష్యం కావచ్చు. ఎన్నికలు దగ్గరపడేనాటికి సరిదిద్దిన కొత్తబిల్లుల వేడిలో రాష్ట్రాన్ని రాజకీయంగా రగిలించి, వివిధ ప్రాంతాల మధ్య వైషమ్యాలు రేపడం, అందులో లబ్ధి పొందడం పాలకుల ఉద్దేశంగా కనిపిస్తున్నది. అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు మిగతా ప్రాంతాల్లో లేని వ్యతిరేకతను రాబోయే రోజుల్లో రగిలించడానికి ఇది ఓ కొత్తడుగు. ఈ జిల్లా ఆ జిల్లాలాగా ఉండాలంటూ మంత్రిగారు అసెంబ్లీలో పోలికల ప్రసంగం చేశారు. అర్థంపర్థంలేని రీతిలో హైదరాబాద్‌ను మధ్యలోకి లాక్కొచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణకూ బహుళ రాజధానులకూ మధ్య అర్థంలేని లంకెపెడుతూ ఆయన చేసిన సుదీర్ఘప్రసంగం ఎంతో కాలంగా వింటున్నదే. 


చంద్రబాబు తీసుకున్న అమరావతి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకించారనీ, అందుకే 2019 ఎన్నికల్లో తమకు భారీగా ఓట్లు వేసి మరీ ఆశీర్వదించారన్న వ్యాఖ్యలు దుర్మార్గమైనవి. జగన్ తాను అమరావతికి వ్యతిరేకమనీ, అధికారంలోకి వస్తే ఆ నిర్ణయాన్ని తిరగదోడతానని ఎన్నికల ముందు చెప్పివుంటే ఈ మాటలకు అర్థం ఉండేది. కానీ, జగన్ నిండుసభలో అమరావతికి మద్దతు ప్రకటించి, ప్రాంతీయ విద్వేషాలు రాకుండా ఉండటమే తనకు కావాలన్నారు, అమరావతిని వాషింగ్టన్ చేస్తానన్నారు.


రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ళుగా రాజధాని ఎక్కడో తెలియని అనిశ్చిత పరిస్థితిలోనే ఉండిపోయింది. అనేక దశలు దాటి కనీసం కొన్ని అడుగులు వేసిన అమరావతి ఆ తరువాత కొత్త పాలకుల వల్ల ముందుకు కదలనిస్థితిలోకి జారిపోయింది. మూడు రాజధానుల వ్యవహారంతో ముడిపడి రాష్ట్ర అభివృద్ధి కూడా నిలిచిపోయింది. పాలకులు ఇప్పటికైనా తమ ఒంటెత్తుపోకడలకు స్వస్తిచెబితే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుంది. లేనప్పుడు ఇది ఇంటర్వెల్ మాత్రమేనని విర్రవీగుతున్నవారి క్లైమాక్‌్సని ప్రజలే తిరగరాస్తారు.

Updated Date - 2021-11-23T07:32:12+05:30 IST