కరోనాతో కొత్త అవకాశాలు

ABN , First Publish Date - 2021-01-16T07:08:24+05:30 IST

కరోనా మహమ్మారి కాలంలో భారత ఫార్మా పరిశ్రమ పరిస్థితికి దీటుగా స్పందించి అవసరమైన ఔషధాలు, వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి అన్నారు

కరోనాతో కొత్త అవకాశాలు

వినూత్నంగా ఆలోచించేలా చేసింది డాక్టర్‌ రెడ్డీస్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో భారత ఫార్మా పరిశ్రమ పరిస్థితికి దీటుగా స్పందించి అవసరమైన ఔషధాలు, వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి అన్నారు. 25వ వార్టన్‌ ఇండియా ఎకనామిక్‌ ఫోరం సమావేశంలో మాట్లాడుతూ.. ఔషధ సరఫరాలు నిరంతరాయంగా ఉండడంలో ఫార్మా పరిశ్రమ పాత్ర కీలకమని చెప్పారు. ఈ సంక్షోభం పరిశ్రమకు పలు అవకాశాలు కల్పించడమే కాకుండా కొత్తగా, వినూత్నంగా ఆలోచించేలా చేసిందన్నారు. రోగులు సరసమైన ధరల్లో ఔషధాల కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారని, వారి ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోవడం తప్పనిసరి అనే సందేశం ఆ సంక్షోభం తమకు ఇచ్చిందని ఆయన చెప్పారు. కొన్ని ఔషధాలు ఇతర అవసరాలకు కూడా ఎలా వాడవచ్చనేది కూడా ఆలోచించే అవకాశం తమకు లభించిందని ఆయన అన్నారు.


ఫార్మా కంపెనీలన్నీ భద్రతతో రాజీ పడకుండానే నియంత్రణా సంస్థలతో  సమన్వయపూర్వకంగా పని చేస్తూ వేగంగా ఔషధాలు మార్కెట్‌కు చేరేలా చూశాయని చెప్పారు. ఈ మహమ్మారి కన్నా ముందుగానే వ్యాక్సిన్ల విభాగంలో భారత్‌ ముందువరుసలో ఉన్నదని, వాటి ప్రపంచ ఉత్పత్తిలో 60 శాతం వాటా భారతదేశమే అందిస్తున్నదని రెడ్డి అన్నారు. అదే విధంగా కొవిడ్‌-19 సమయంలో కూడా సొంత వ్యాక్సిన్ల అభివృద్ధికి జైడస్‌, భారత్‌ బయోటెక్‌ వంటి కంపెనీలు బరిలోకి దిగగా మరికొన్ని కంపెనీలు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యాకు చెందిన గమలేయ ఇన్‌స్టిట్యూట్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ అలాంటి భాగస్వామ్యాలే కుదుర్చుకున్నాయన్నారు. ప్రస్తుతం భారత ఫార్మా పరిశ్రమ పరిమాణం 4,000కోట్ల డాలర్లు కాగా వచ్చే పదేళ్లలో 12 వేల నుంచి 13 వేల కోట్ల డాలర్లకు చేరగల సామర్థ్యం కలిగి ఉన్నదని అంచనా. ప్రస్తుత బలాలను పెంచుకుంటూ కొత్త బలాలు పుంజుకోవడం ద్వారా ఇది సాధించవచ్చని రెడ్డి అన్నారు. ఏపీఐలు, జెనరిక్స్‌ విభాగాల్లో కూడా మంచి అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. 


స్పుత్నిక్‌ మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌.. స్పుత్నిక్‌ వీ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి అందుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. మూడో దశ పరీక్షల్లో భాగంగా రాండమ్‌గా 1,500 సబ్జెక్టులపై వ్యాక్సిన్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను డేటా అండ్‌ సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డ్‌ (డీఎ్‌సఎంబీ) సమీక్షించి, మూడో దశ పరీక్షలకు సిఫారసు చేసింది.  కాగా ఈ నెలలోనే మూడో దశ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉందని డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-16T07:08:24+05:30 IST