Abn logo
Mar 26 2020 @ 10:32AM

దుకాణాల వద్ద గుంపులుగా ఎగబడితే.. లాక్‌డౌన్ ఫలితం ఉండదని భావించి..

రద్దీకి బ్రేక్‌

నగరంలో రైతుబజార్ల సంఖ్య పెంపు

ప్రస్తుతం రైతుబజార్లు ఆరు

అదనంగా ఉప రైతుబజార్లు

నగరంలో మొత్తం 27 ఏర్పాటు

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు..

మూడు మీటర్ల కొలతలతో ప్రత్యేకంగా బాక్స్‌లు


(ఆంధ్రజ్యోతి - విజయవాడ): ఒకే దుకాణం వద్ద సుమారు 30 మంది.. 3 మీటర్ల దూరం పాటించని పరిస్థితి.. గుంపులు గుంపులుగా ఎగబడుతున్న జనం.. ఇదీ రైతుబజార్లలో ప్రస్తుత పరిస్థితి. ఇలాగైతే లాక్‌డౌన్‌ ఫలితం ఉండదని భావించిన అధికారులు కొత్త ప్రణాళికలను రూపొందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరుస సమావేశాలు నిర్వహించిన జిల్లా అధికారులు మరిన్ని ఉప రైతుబజార్లను ఏర్పాటు చేయడమే మంచిదని భావించారు. నగరంలో స్వరాజ్‌ మైదాన్‌, పటమట, కేదారేశ్వరిపేట, అజిత్‌సింగ్‌నగర్‌, పాయకాపురం, భవానీపురంలో రైతుబజార్లు ఉన్నాయి. వీటిలో స్వరాజ్‌మైదాన్‌ రైతుబజార్‌ను ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో, అజిత్‌సింగ్‌నగర్‌, పాయకాపురం రైతుబజార్లను మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేశారు.


పటమట రైతుబజార్‌ను ఎదురుగా ఉన్న హైస్కూల్లోకి, భవానీపురం మార్కెట్‌ను పున్నమి ఘాట్‌లోకి మార్పు చేశారు. ఇరుకిరుగ్గా ఉన్న రైతుబజార్లను విశాలంగా ఉన్న ప్రాంగణాల్లోకి మార్చినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. ఒక్కో రైతుబజార్‌కు రోజుకు 20వేల నుంచి 30వేల మంది వినియోగదారులు వస్తున్నారు. నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు ప్రస్తుతం ఉన్న 6 రైతుబజార్ల పరిధిలో కొత్తగా ఉప రైతుబజార్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ రైతు బజార్లన్నీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు రైతుబజార్లు పనిచేస్తాయి.


దీంతో ఆయా ప్రాంతాల్లోని వారంతా సమీపంలో ఉన్న రైతుబజార్లకే వెళ్లడం వల్ల రద్దీ తగ్గుతుందని అధికారులు అంచనా. సమయాన్ని పెంచడం వల్ల అంతా ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నిత్యావసరాల కోసం వచ్చే వారంతా 2కిలోమీటర్లలోపే తిరగాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీని ప్రకారమే అదనంగా తాత్కాలిక రైతుబజార్లను ఏర్పాటు చేశారు.


ఇప్పటికే అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో వ్యాపారులు, వ్యాపారులకు మధ్య 3మీటర్లు, వినియోగదారులు ఒకరి వెనకాల ఒకరు మూడడుగుల దూరంలో ఉండేలా బాక్సులను గీశారు. ఈ తరహా ఏర్పాట్లను నగరంలోని 27 రైతుబజార్లలోనూ అధికారులు చేశారు.


మచిలీపట్నంలో పది రైతుబజార్లు

మచిలీపట్నం టౌన్‌ : మచిలీపట్నంలో ప్రస్తుతం నడుస్తున్న రైతుబజార్‌లో ఇకపై కూరగాయలు అమ్మే ప్రసక్తి లేదని, నగరంలోని పది ప్రాంతాల్లో తాత్కాలిక రైతుబజార్లను ఏర్పాటు చేస్తున్నామని ఆర్డీవో ఖాజావలి పేర్కొన్నారు. ఈ పది రైతు బజార్‌లు గురువారం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. రాజుపేట, కాలేఖాన్‌పేట, నోబుల్‌ కళాశాల, జడ్పీ సెంటర్‌లో స్కౌట్‌ క్యాంపస్‌, హిందూ కళాశాల, నేషనల్‌ కళాశాల, పాండురంగా హైస్కూల్‌, మార్కెట్‌ యార్డు, పంచాయతీ రాజ్‌ కాలనీ, జిల్లా కోర్టుసెంటర్‌లోని పాత పోలీసు క్వార్టర్స్‌ వెనుక ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లలో రైతుబజార్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 


చల్లపల్లి : ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ పెద్దఎత్తున కొనుగోలుదారులు తరలివస్తుండటంతో  రైతుబజార్‌లో రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం రైతుబజార్‌ దుకాణదారులతో సంతమార్కెట్‌ ప్రాంగణంలో దుకాణాలు ఏర్పాటు చేయించారు. అయినా ఆయా రెండు ఆవరణలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి.  


కోడూరు: మూడురోజులుగా కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్‌ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచిఉంటే విధంగా ఆంక్షలు విధించటంతో  మండల వ్యాప్తంగా ప్రజలు సరుకులు కోసం బారులు తీరారు. వారిని అదుపు చేయటానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


నాగాయలంక: కూరగాయల దుకాణాలు, కిరాణాషాపులు, పండ్ల, పూలకొట్లు వినియోగదారులతో కిటకిటలాడాయి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఆయా దుకాణాలను పోలీసులు మూయించివేశారు. లాక్‌డౌన్‌ అమలుతో జనసందడి లేక రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. తిరువూరు రైతు బజార్లు కూడా కోనుగోలుదారులతో కిటకిటలాడాయి. 


జగ్గయ్యపేట: పట్టణంలో ఏఎంసీలో ఏర్పాటు చేసిన రైతుబజార్‌ను గురువారం నుంచి ఉదయం 6-9 గంటల మధ్యనే కూరగాయల విక్రయాలు జరుగుతాయని ఎస్టేట్‌ ఆఫీసర్‌ జాన్‌ విక్టర్‌ తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వస్తే రూ.వెయ్యి జరిమానాతో పాటు వాహనాలు సీజ్‌ చేస్తామని ఎస్సై ధర్మరాజు తెలిపారు. 


తిరువూరు: స్ధానిక రైతుబజార్‌లో ఉదయం 6గంటలకే కూరగాయల కోసం వినియోగాదారులు బారులు తీరారు. పట్టణంలోని మున్సిపల్‌ మార్కెట్‌, పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన షాపుల వద్ద కూడా రద్దీ పెరిగింది. 


కంకిపాడు: రైతు బజారు వికేంద్రీకరణకు చర్యలు చేపడుతున్నట్లు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ మద్దాలి రామచంద్రరావు చెప్పారు. రైతు బజారులో బుధవారం ఆయన పర్యటించారు. గురువారం ఉదయం నుంచి రైతు బజారును మార్కెట్‌ యార్డ్‌లో నిర్వహిస్తామని చెప్పారు. అవసరమైతే మొబైల్‌ రైతుబజార్లు ఏర్పాటుచేస్తామన్నారు. కంకిపాడు మండలంలోని 20 గ్రామాలకు ఒక్కటే రైతు బజారు కావడంతో వేల సంఖ్యలో ఒకేసారి క్యూ కట్టారు. కిక్కిరిసిన జనాన్ని అదుపుచేయడం పోలీసులు, రైతు బజారు సిబ్బందికి సాధ్యం కాలేదు. దూరం పాటించాలని పదే పదే చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.


భవానీపురం ప్రాంతంలో..

బొబ్బూరి గ్రౌండ్స్‌

విద్యాధరపురం ఆర్టీసీ డిపో

లారీ స్టాండ్‌

గొల్లపూడి హైస్కూల్‌ కేదారేశ్వరిపేట

కేబీఎన్‌ కాలేజ్‌

గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్‌

ఘంటసాల సంగీత కళాశాల

జింఖానా గ్రౌండ్స్‌

ఏకేటీపీఎం స్కూల్‌(సత్యనారాయణపురం)

రైల్వే గ్రౌండ్స్‌ (రైల్వేస్టేషన్‌ దగ్గర)


స్వరాజ్య మైదాన్‌..

సిద్ధార్థ డిగ్రీ కళాశాల

లయోలా కళాశాల గ్రౌండ్స్‌

బిషప్‌ అజరయ్య హైస్కూల్‌

పొట్టి శ్రీరాములు జూనియర్‌ కళాశాల

సిద్ధార్థ మహిళా కళాశాల

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం

ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాల

గుణదల (నున్న రోడ్డులోని బధిరుల స్కూల్‌)


పాయకాపురం..

ఎంబీపీ స్టేడియం (అజిత్‌సింగ్‌నగర్‌)

ఎంకే బేగ్‌ స్కూల్‌, పటమట 

ఏపీఐఐసీ కాలనీలోని ఖాళీస్థలం

ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్‌ స్కూల్‌

నిర్మలా కాన్వెంట్‌ హైస్కూల్‌

మారిస్‌ స్టెల్లా కళాశాల

సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల (కానూరు)

యనమలకుదురు పంచాయతీ ఆఫీస్‌

కృష్ణవేణి స్కూల్‌(ఎన్టీఆర్‌ సర్కిల్‌)


నిత్యావసరాల కొరత రానీయొద్దు

ఉయ్యూరు, మార్చి 25 : నిత్యావసరాల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. బుధవారం ఉయ్యూరు రైతుబజార్‌, కూరగాయల మార్కెట్‌, కిరాణా షాపులను పరిశీలించారు. బస్‌స్టాండ్‌ ఆవరణలో స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావును, శుభ్రం చేయించాలని కమిషనర్‌ కె.శివరామిరెడ్డిని ఆదేశించారు. వైసీపీ నేత లు జె.కొండలరావు, వల్లభనేని సత్యనారాయ ణ వెంట ఉన్నారు.  ఎమ్మెల్యే రాకతో పార్టీ నేతలు, కా ర్యకర్తలు గుంపులుగా కనిపించారు. దీనిపై స్థానికులు పార్టీ నేతలే ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోవడమేంటని‘ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
Advertisement