రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం: ఆనందయ్య వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-29T08:54:23+05:30 IST

రాష్ట్రంలో 70 లక్షల మంది జనాభా కలిగిన యాదవులకు ఎటువంటి రాజకీయ అవకాశాలు కల్పించడం లేదని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్‌ ఆరోపించారు.

రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం: ఆనందయ్య వ్యాఖ్యలు

  • త్వరలో రాజకీయ పార్టీ
  • మమ్మల్ని జగన్‌ నిర్లక్ష్యం చేస్తున్నారు: యాదవ సంఘం నేత లాకా
  • అన్ని కులాలను కలుపుకొని పార్టీ: నెల్లూరు ఆనందయ్య


రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 28: రాష్ట్రంలో 70 లక్షల మంది జనాభా కలిగిన యాదవులకు ఎటువంటి రాజకీయ అవకాశాలు కల్పించడం లేదని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తమ అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో జాతీయ నాయకుల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని త్వరలో ప్రత్యేక రాజకీయ పార్టీని ప్రారంభించనున్నామని వెల్లడించారు. మంగళవారమిక్కడ వై.జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో అఖిల భారత యాదవ మహాసభ 13 జిల్లాల సమాఖ్య సమావేశయాత్ర సభ నిర్వహించారు. జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రరావు యాదవ్‌, ‘కరోనా మందు’ నెల్లూరు ఆనందయ్య తదితరులు పాల్గొన్నారు.


వెంగళరావు మాట్లాడుతూ.. యాదవులకు ఒక రాజ్యసభ సీటు, రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో జాతీయ స్థాయిలో రథయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఆనందయ్య మాట్లాడుతూ.. కరోనా నివారణ మందు తయారీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని విమర్శించారు. విద్యుత్‌ సరఫరా కోసం నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేస్తే ఇప్పటివరకూ అనుమతివ్వలేదన్నారు. అన్ని కులాలను కలుపుకొని రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

Updated Date - 2021-09-29T08:54:23+05:30 IST