రైతు ఆందోళన నుంచి కొత్త పార్టీ.. ఈ ఎన్నికల్లో పోటీ

ABN , First Publish Date - 2021-12-25T23:13:22+05:30 IST

400 భిన్న ఆలోచనా విధానాలున్న సంఘాలు అన్నీ కలిసి ‘సంయుక్త సమాజ్ మోర్చా’ అనే పార్టీని ఏర్పాటు చేశాయి. రైతుల సమస్యలే ప్రధానంగా ఈ పార్టీ ఏర్పడింది. ఎన్నికలను బహిష్కరించాలనే పిలుపు మా నుంచి ఎప్పుడూ లేదు..

రైతు ఆందోళన నుంచి కొత్త పార్టీ.. ఈ ఎన్నికల్లో పోటీ

న్యూఢిల్లీ: సాగు చట్టాలపై నిర్విరామ కొనసాగిన ఆందోళన నుంచి రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. ఆందోళన సమయంలో రాజకీయ పార్టీ ఊసెత్తని రైతు సంఘాల నేతలు.. సాగు చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అనంతరం రాజకీయ పార్టీ ప్రకటన చేయడం గమనార్హం. అంతే కాదు, రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలో పోటీలో ఉంటుందని ఈ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. 22 రైతు సంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన ఈ పార్టీ పంజాబ్‌లోని 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారట.


పార్టీ ప్రకటన గురించి శనివారం చండీగఢ్‌లో రైతు సంఘం సీనియర్ నేత బల్బిర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ ‘‘400 భిన్న ఆలోచనా విధానాలున్న సంఘాలు అన్నీ కలిసి ‘సంయుక్త  సమాజ్ మోర్చా’ అనే పార్టీని ఏర్పాటు చేశాయి. రైతుల సమస్యలే ప్రధానంగా ఈ పార్టీ ఏర్పడింది. ఎన్నికలను బహిష్కరించాలనే పిలుపు మా నుంచి ఎప్పుడూ లేదు. అలాగే రాబోయే ఎన్నికల్లో పోటీ గురించి ఇంకా పూర్తి అవగాహనకు రాలేదు. కానీ వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీ చేస్తాం’’ అని అన్నారు.


సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిన ఆందోళనలో 32 రైతు సంఘాలు కలిసి సంయుక్త కిసాన్ మోర్చగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాయి. ఏడాదికిపైగా కొనసాగిన నిర్విరామ ఆందోళన కారణంగా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గి నవంబర్ 29న సాగు చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ఉభయ సభల్లోనూ సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును ఆమోదింపజేశారు. అయితే కనీస మద్దతు ధర గురించిన రైతుల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీనిపై కూడా ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు పలుమార్లు ప్రకటించాయి.

Updated Date - 2021-12-25T23:13:22+05:30 IST