ఏపీసీఆర్డీయే... మరో కొత్త సమస్య..!

ABN , First Publish Date - 2020-09-21T13:36:19+05:30 IST

ఏపీసీఆర్డీయే స్థానంలో ఇటీవల ఏర్పాటైన ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) తన పరిధిలో జరుగుతున్న అతిక్రమణలు, నియమ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి తర్జన

ఏపీసీఆర్డీయే... మరో కొత్త సమస్య..!

మానుటయా..? మనుగడ సాగించుటయా..?

అతిక్రమణలపై చర్యలు తీసుకునేదెలా?

సీఆర్డీయే రద్దుపై న్యాయవివాదం నడుస్తున్న తరుణంలో సందిగ్ధం

ఉల్లంఘనులకు నోటీసులిస్తే  ఇబ్బందులేనని సంశయం

ఇదే అదనుగా చెలరేగిపోతున్న అతిక్రమణలు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఏపీసీఆర్డీయే స్థానంలో ఇటీవల ఏర్పాటైన ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) తన పరిధిలో జరుగుతున్న అతిక్రమణలు, నియమ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి తర్జనభర్జన పడుతోంది. తన పరిధిలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి  చుట్టుపక్కల కొందరు రియల్టర్లు, ప్రమోటర్లు, బిల్డర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసినప్పటికీ ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతోంది. ఇందుకు కారణం.. తన ‘అస్థిత్వం’పై సంస్థకు ఉన్న అనుమానాలే.


స్థానిక సంస్థలకే అజమాయిషీ యోచన

కారణాలేమైనా.. నెలల తరబడి అక్రమ వెంచర్లు, ప్లాన్లకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై ఉదాసీనంగా వ్యవహరిస్తే పరిస్థితి చేయి దాటి నియంత్రణ కష్టమవుతుందని ఏఎంఆర్డీయే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, తాము గుర్తించిన అతిక్రమణలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా స్థానిక పంచాయతీలకు అందజేసి, వాటిని నియంత్రించే బాధ్యతను అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 


అంతలోనే ఆందోళన

గతంలో ప్లాన్ల మంజూరుకు సంబంధించిన పరిమిత అధికారాలనే ఆసరాగా తీసుకుని  పలు పంచాయతీల పాలకవర్గాలు, కార్యదర్శులు, వీఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇబ్బడిముబ్బడిగా మంజూరుచేసిన ప్లాన్లు, సాగించిన లోగుట్టు వ్యవహారాలతో వేలాది అక్రమ నిర్మాణాలు, వందలాది అనధికార వెంచర్లు, లెక్కకుమిక్కిలిగా అతిక్రమణలు ఎక్కడికక్కడ పుట్టుకొచ్చాయి. దీనిని గమనించిన సీఆర్డీయే పంచాయతీల నుంచి ఆ అధికారాన్ని తొలగించి, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. ఇది కొంతవరకే సఫలీకృతమైంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరికి చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాలు, ప్రధాన రహదారులకు సమీపంలోని ప్రదేశాల్లో ఇప్పటికీ పంచాయతీల ఉద్యోగులు, నేతలు హవా చలాయిస్తున్నందున ఉల్లంఘనులకు పూర్తిగా అడ్డుకట్ట పడలేదు. ఫలితంగా తన పరిధిలో ప్రణాళికాబద్ధ అభివృద్ధిని సాధించి, ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని అందజేయాలన్న సీఆర్డీయే లక్ష్యం నీరుగారిపోయింది. ఈ అనుభవాల దృష్ట్యా పంచాయతీలకే స్థిరాస్తి వ్యవహారాలపై అజమాయుషీ బాధ్యతలు అప్పగిస్తే కచ్చితంగా పరిస్థితి విషమించి, గతంలో కంటే చాలా ఎక్కువ అక్రమాలు చోటు చేసుకోవడం తఽథ్యమని పలువురు హెచ్చరిస్తున్నారు.


న్యాయస్థానాలు ఏమంటాయో..!?

రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుతో పాటు ఏపీసీఆర్డీయే చట్టం-2014 రద్దుకు ఉద్దేశించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభల్లో ఆమోదింపజేసుకుంది. దీనిని సవాల్‌ చేస్తూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించగా, విచారణ జరుగుతోంది. ఈ అంశంపై కోర్టులు ఇవ్వబోయే తీర్పులపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ న్యాయస్థానాలు ఏపీసీఆర్డీయే చట్టం-2014 రద్దు, ఆ సంస్థ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏఎంఆర్డీయే చెల్లుతాయని తీర్పునిస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అలాకాకుండా ఏపీసీఆర్డీయే రద్దు, దాని స్థానే ఏఎంఆర్డీయే ఏర్పాటు చెల్లబోదంటే సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అదే జరిగితే.. ఈ సంస్థ తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన నోటీసులు అన్నింటిపై సందిగ్ధత నెలకొంటుంది. ఈ అంశమే నిబంధనలను అతిక్రమిస్తున్న రియల్టర్లపై చర్యలు తీసుకోవడంలో ఏఎంఆర్డీయే మీనమేషాలు లెక్కించడానికి కారణం. అక్రమార్కులతో కుమ్మక్కై, అతిక్రమణలకు లోపాయికారీ మద్దతు తెలుపుతున్న కొందరు అధికారులు కూడా వాటిపై చర్యలకు తెరవెనుక మోకాలడ్డుతున్నా.. తన మనుగడపై నెలకొన్న అనుమానాల వల్లే ఏఎంఆర్డీయే చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. 

Updated Date - 2020-09-21T13:36:19+05:30 IST