ఇబ్బందులు వాస్తవమే

ABN , First Publish Date - 2020-02-23T06:53:04+05:30 IST

ఇసుక తక్కువ ధర, డోర్‌ డెలివరీ ద్వారా వినియోగదారులకు సరఫరా చేయడానికి ప్రభుత్వం సరళమైన, పారదర్శకమైన విధానాన్ని చేపట్టిందని అయితే ఇసుక

ఇబ్బందులు వాస్తవమే

కొత్త రీచ్‌లను వెంటనే తెరవాలి

ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌


కాకినాడ(ఆంధ్రజ్యోతి): ఇసుక తక్కువ ధర, డోర్‌ డెలివరీ ద్వారా వినియోగదారులకు సరఫరా చేయడానికి ప్రభుత్వం సరళమైన, పారదర్శకమైన విధానాన్ని చేపట్టిందని అయితే ఇసుక కొరత, ఇతర కారణాల వల్ల ఆచరణలో సరఫరాలో జాప్యం, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. జిల్లాలో ఇసుక సరఫరా స్థాయి మరింత పెంచడానికి కొత్త రీచ్‌లను వెంటనే తెరవాలని, సంబంధిత అధికారులను ఆయన కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇసుక కొరత నివారణ, ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, రెండో పంటకు సాగునీరు సరఫరా, అనధికారిక మద్యం విక్రయాల నియంత్రణ అంశాల వారీ సమీక్షించారు. ఇసుక సరఫరాలో జాప్యం, ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల వినియోగదారులకు ఇసుక పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేకపోతున్న విషయం వాస్తవమేనని ఆయన ఒప్పకున్నారు.


దీన్ని అధిగమించి వినియోగదారులను సంతృప్తి పరచడానికి వెంటనే కొత్త రీచ్‌లను ప్రారంభించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరత కారణాలను రాష్ట్ర మైనింగ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎండీసీ) ఎండీ మధుసూదనరావు, కలెక్టర్‌, జిల్లా అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ఈసందర్భంగా ఎండీసీ ఎండీ మధుసూదనరావు మాట్లాడుతూ గత సెప్టెంబరు 5 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. అయితే వరదల కారణంగా నవంబరు 15 వరకు మైనింగ్‌ సాధ్యపడలేదన్నారు. వరదలు తగ్గినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 11.56 లక్షల టన్నుల ఇసుక వెలికితీశామన్నారు. ఇందులో 11లక్షల టన్నుల ఇసుక వినియోగదారుల ఆన్‌లైన్‌ ఆర్డర్‌ మేరకు సరఫరా చేశామన్నారు. మరో 90 వేల టన్నులను బల్క్‌ ఆర్డర్లపై సరఫరా చేశామన్నారు. ఉపాధి హామీ పనులకు 1.78 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి తెచ్చి రోజుకు 10 వేల టన్నులు సరఫరా చేస్తున్నామన్నారు.


కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రీచ్‌లకు అదనంగా మరో 16 రీచ్‌లను గుర్తించి వాటి పర్యావరణ అనుమతులకు పంపామన్నారు. ఈవారంలో 13 రీచుల్లో మైనింగ్‌ ప్రారంభిస్తామన్నారు. తదనంతరం ఇసుక కొరత తగ్గుముఖం పడుతుందని ఇందులో భాగంగా పొరుగు జిల్లాలకు తాత్కాలికంగా సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. పొలాల్లో మెరక తొలగించి తరలించే మట్టి ట్రాక్టర్లను ఇటుక బట్టీలకు మట్టి రవాణా చేసే వాహనాలను నిరోధిస్తున్నామన్నారు. ఈ నిరోధం తప్పనిసరిగా అమల్లో ఉండాలని మంత్రి పినిపే విశ్వరూప్‌ సూచించారు. సమీక్షలో అమలాపురం ఎంపీ చింతా అనూరాధ జోక్యంచేసుకుని వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామన్నారు. ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, సీహెచ్‌ వేణుగోపాల కృష్ణ, కొండేటి చిట్టిబాబు, జక్కంపూడి రాజా ఎంపీ వ్యాఖ్యలను సమర్ధించారు.

 

ప్రస్తుతం జిల్లాలో సాగులో ఉన్న రెండో పంట కీలక దశలో ఉన్న దృష్ట్యా శివారు భూములతో సహా మొత్తం సాగు విస్తీర్ణానికి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి బోస్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ ని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కాపర్‌ డ్యామ్‌లో పైపులు ఎత్తులో ఏర్పాటుచేయడం వల్ల నీటి సరఫరా తగ్గిందని ఇరిగేషన్‌ ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. ఈ అంశంపై కలెక్టర్‌ పోలవరం ఇంజనీర్లు, ఇరిగేషన్‌ ఇంజనీర్‌ అండ్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ)తో అప్పటికప్పుడు మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఏలేరులో తగిన నీటి నిల్వలు ఉన్నందున ఏలేరు, పీబీసీ ఆయకట్టులో శివారు భూములకు నీరు అందేలా ఎక్కువ డ్యూటీలో విడుదల చేయాలని కాకినాడ ఎంపీ వంగా గీత, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గంపేట ఎమ్మె ల్యే జ్యోతుల చంటిబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అధికారులను కోరారు.


12.92 లక్షల టన్నుల ధాన్యం సేకరణ 

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు చెల్లింపులో జాప్యంపై జరిగిన సమీక్షలో జేసీ జి.లక్ష్మీశ మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 12.92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇందులో రూ.1,802 కోట్ల మేరకు చెల్లింపులు పూర్తయ్యాయన్నారు. మరో రూ. 477 కోట్లు రానున్న నాలుగు రోజుల్లో చెల్లిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మద్యం విధానానికి అనుగుణంగా జిల్లాలో మద్యం షాపుల సంఖ్య 20 శాతం తగ్గిందన్నారు. దీంతో 542 షాపులు గతంలో ఉండగా ఇప్పుడు 432 షాపులు ఉన్నాయన్నా రు. అనధికారిక మద్యం రవాణా, బెల్టుషాపుల నిరోధానికి పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్‌, అటవీ శాఖల సంయుక్త సమన్వయంగా పనిచేస్తూ ఇప్పటివరకు 109 బైండోవర్‌ కేసులు నమోదు చేశామన్నారు. సమీక్షలో ఎస్పీ అద్నన్‌నయీం అస్మీ, జేసీ-2 రాజకుమారి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-23T06:53:04+05:30 IST