కొత్త ఆంక్షలు రాబోతున్నాయా? మోదీ ఏం చెప్పబోతున్నారు?

ABN , First Publish Date - 2021-04-04T17:57:54+05:30 IST

కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపైనా, వ్యాక్సినేషన్ జరుగుతున్న

కొత్త ఆంక్షలు రాబోతున్నాయా? మోదీ ఏం చెప్పబోతున్నారు?

న్యూఢిల్లీ : కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపైనా, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుపైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయన అధ్యక్షతన ప్రారంభమైన అత్యున్నత స్థాయి సమావేశంలో కేబినెట్ కార్యదర్శి, ప్రధాన మంత్రి వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ సహా అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, నీతీ ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మోదీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 నిరోధం కోసం ప్రజలు పాటించవలసిన కొత్త నిబంధనలను, మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో కొత్తగా 93,249 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,24,85,509కు చేరింది. గత ఏడాది సెప్టెంబరు 19న ఒకే రోజులో 93,337 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఒక రోజులో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆదివారం నమోదైన కోవిడ్ మృతుల సంఖ్య 513. దీంతో మొత్తం ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1,64,623కు చేరింది. కోవిడ్ నుంచి రికవరీ రేటు 93.14 శాతానికి తగ్గింది.



Updated Date - 2021-04-04T17:57:54+05:30 IST