Abu Dhabi వెళ్తున్నారా? అయితే కొత్త మార్గదర్శకాలపై ఓ లుక్కేయండి!

ABN , First Publish Date - 2022-01-25T15:51:53+05:30 IST

పర్యాటక రంగానికి తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చే పనిలో పడింది యూఏఈ ప్రభుత్వం. కరోనాతో గత కొంతకాలంగా పర్యాటక రంగం బాగా వెనకపడిపోయింది. దీంతో ఈ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది ఆ దేశ పర్యాటకశాఖ. దీనికి అనుగుణంగా ప్రస్తుత కరోనా సమయంలోనూ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

Abu Dhabi వెళ్తున్నారా? అయితే కొత్త మార్గదర్శకాలపై ఓ లుక్కేయండి!

అబుధాబి: పర్యాటక రంగానికి తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చే పనిలో పడింది యూఏఈ ప్రభుత్వం. కరోనాతో గత కొంతకాలంగా పర్యాటక రంగం బాగా వెనకపడిపోయింది. దీంతో ఈ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది ఆ దేశ పర్యాటకశాఖ. దీనికి అనుగుణంగా ప్రస్తుత కరోనా సమయంలోనూ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అబుధాబి పర్యాటక, సాంస్కృతిక విభాగం నగరానికి వచ్చే పర్యాటకుల కోసం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎవరైతే రోడ్డు మార్గంలో దుబాయ్ నుంచి అబుధాబి వస్తున్నారో వారి కోసం ఘన్‌టూట్ వద్ద ప్రత్యేక చెక్ పాయింట్‌ను ఏర్పాటు చేసింది.


ఇక్కడ సందర్శకులు వారివారి దేశాల్లో జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను సమర్పించడం తప్పనిసరి. అప్పుడే అబుధాబిలోకి ఎంట్రీ ఉంటుంది. అలాగే పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ కూడా చూపించాల్సి ఉంటుంది. యూఏఈలోని వారు అయితే 14 రోజుల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ చూపించిన సరిపోతుంది. అదే బయటి నుంచి వచ్చిన వారు 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్టు రిపోర్టు చూపించాలి. ఇది కేవలం వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇక టీకా తీసుకోని వారు మాత్రం తప్పనిసరిగా 96 గంటల ముందు పీసీఆర్ టెస్టు చేయించుకున్న నెగెటివ్ ధృవపత్రాన్ని సమర్పించాలి. వీటితో పాటు కొన్ని ఇతర మార్గదర్శకాలను పరిశీలిస్తే...


* మీరు తీసుకున్న వ్యాక్సిన్ యూఏఈ ప్రభుత్వం ఆమోదించినదే ఉండాలి. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ సొసైటీ ఆమోదించిన వ్యాక్సిన్‌లకు కూడా అబుధాబి అనుమతిస్తుంది. 

* గ్రీన్ లిస్ట్ దేశాలకు చెందిన టీకాలు వేసిన, టీకాలు వేయని వ్యక్తులకు అబుధాబిలో తప్పనిసరి క్వారంటైన్ రద్దు చేయబడింది.

* ప్రయాణికులు తప్పనిసరిగా ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఐసీఏ యూఏఈ స్మార్ట్) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేనిపక్షంలో ica.gov.ae వెబ్‌సైట్ ద్వారా ప్రయాణ తేదీకి 48 గంటల ముందు అరైవల్ ఫారమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. 

* 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇందులో నెగెటివ్ వస్తేనే మీరు ప్రయాణానికి అనుమతించబడతారు.

* అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులు మరోసారి పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి(12 ఏళ్లలోపు పిల్లలు, అధికారిక మినహాయింపులు ఉన్న వ్యక్తులకు మాత్రమే దీని నుంచి మినహాయింపు). ఈ పరీక్ష పూర్తి ఉచితం.

* గ్రీన్ లిస్ట్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులు యూఏఈలో దిగిన తర్వాత ఆరో రోజున మళ్లీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. గ్రీన్ లిస్ట్‌లో లేని దేశాలకు చెందిన వారు నాలుగు, ఎనిమిదో రోజుల్లో రెండుసార్లు పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

* అబుధాబిలోని అన్ని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో కేవలం టీకాలు వేసుకున్న ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కనుక వారు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌తో పాటు పీసీఆర్ పరీక్ష నెగెటివ్ రిపోర్టు తీసుకెళ్లాలి.


Updated Date - 2022-01-25T15:51:53+05:30 IST