ఏడోసారి స్పెసిఫైడ్‌ అథారిటీ

ABN , First Publish Date - 2021-06-24T06:30:14+05:30 IST

వారం పదిరోజుల్లో టీటీడీకి కొత్త పాలకవర్గం ఏర్పడే అవకాశం

ఏడోసారి స్పెసిఫైడ్‌ అథారిటీ

తిరుపతి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): స్పెసిఫైడ్‌ అథారిటీ పాలనలోకి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏడోసారి అడుగుపెట్టాయి. ఈ నెల 21తో పాలకమండలి గడువు పూర్తవడంతో కొత్త పాలకమండలిని నియమించే వరకూ తాత్కాలికంగా స్పెసిఫైడ్‌ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అథారిటీ ఛైర్మన్‌గా టీటీడీ ఈవోను, కన్వీనర్‌గా అదనపు ఈవోను నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.


వారం పదిరోజుల్లో నూతన పాలకవర్గం

కాగా కొత్త పాలకమండలి ఛైర్మన్‌ ఎంపిక విషయంలో కొంతమేరకు స్పష్టత వచ్చినట్టు సమాచారం. అయితే సభ్యుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహరాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచీ సభ్యులను, ప్రత్యేకాహ్వానితులను ఎంపిక చేయాల్సివున్నందున ఆ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. వారం పది రోజుల్లోపే సభ్యుల ఎంపికపై స్పష్టత రానుందని అంటున్నారు. దీంతో స్వల్ప వ్యవధి కోసమే స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేసినట్టు భావించాల్సి వస్తోంది. ఎందుకంటే గతంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారిని అథారిటీకి ఛైర్మన్‌గా నియమించేవారు. ఆ శాఖ కమిషనర్‌ కన్వీనర్‌గా, టీటీడీ ఈవో మెంబరుగా నియమితులయ్యేవారు. తాత్కాలికం కాబట్టే ఈవోను ఛైర్మన్‌గా, అదనపు ఈవోను కన్వీనర్‌గా నియమించారని చెబుతున్నారు.


స్పెసిఫైడ్‌ అథారిటీ ఎందుకంటే.....

ట్రస్టు బోర్డు పాలకవర్గం గడువు ముగిసినపుడు, లేదా ప్రభుత్వం అర్ధాంతరంగా పాలకవర్గాన్ని రద్దు చేసినపుడు పాలకవర్గం నిర్వహించే విధులను నిర్వర్తించడం కోసం స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటవుతుంది. గరిష్ట కాలపరిమితి ఏడాది. ఆ తర్వాత కూడా పాలకమండలి ఏర్పాటు కాని పక్షంలో స్పెసిఫైడ్‌ అథారిటీని మళ్ళీ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి వుంటుంది. పాలకవర్గం చేపట్టే పనులు దేవాదాయ శాఖ కమిషనర్‌, ఈవోలు అథారిటీ సభ్యుల హోదాలో నిర్వర్తిస్తారు. అలాగని పాలకమండలి లేని సమయంలో తప్పనిసరిగా స్పెసిఫైడ్‌ అథారిటీ వుండాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. ఆ విధంగా అటు పాలకమండలి, ఇటు అథారిటీ కూడా లేకుండానే టీటీడీ పాలన కొనసాగిన సందర్భాలూ వున్నాయి. పలు సందర్భాల్లో స్పెసిఫైడ్‌ అథారిటీతో నిమిత్తం లేకుండా ఐఏఎస్‌ అధికారులు ఛైర్మన్లుగా వ్యవహరించిన ఉదంతాలు కూడా వున్నాయి. ఇప్పటిదాకా ఆరుసార్లు  స్పెసిఫైడ్‌ అథారిటీల నియామకం జరిగింది. ఇది ఏడవది. 1995లో, 1999-2002 మధ్య కాలంలో, 2006లో, 2010-11 నడుమ, 2014-15 మధ్య గతంలో స్పెసిఫైడ్‌ అధారిటీల పాలనలో టీటీడీ నడిచింది. 


చైర్మన్లుగా ఐఏఎస్‌లు

టీటీడీ చైర్మన్లుగా ఐఏఎస్‌ అధికారులు ఆరుసార్లు వ్యవహరించారు. 1973-74లో ఎ.వల్లియప్పన్‌, 1978-79 మధ్య డాక్టర్‌ ఎన్‌.రమేష్‌, 1980లో శ్రవణ్‌కుమార్‌, 1983లో ఎల్‌.సుబ్బయ్య, 1992-93 నడుమ డాక్టర్‌ ఎం.ఎస్‌.రాజాజీ, 2004లో జేపీ మూర్తి టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించారు.

Updated Date - 2021-06-24T06:30:14+05:30 IST