Abn logo
May 27 2020 @ 00:42AM

కొత్త నినాదాలు-–- పాత జీవితాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో జీవనోపాధి కోల్పోయిన లక్షలాది వలసకార్మికుల జీవితాలు మారతాయని, జీతాలు, ఉద్యోగాల కోతతో క్రుంగిపోయిన మధ్యతరగతి ప్రజల మానసిక వ్యథలు తొలగిపోతాయని, ఆర్థిక వ్యవస్థ భారీ ఎత్తున  ఊపందుకుంటుందనీ ఎవరైనా భావిస్తే వారి భ్రమలతో విభేదించనవసరం లేదు. పేదలు, పేదరికం అన్నది ఇవాళ కొత్తగా వినిపిస్తున్న పదాలు కావు. ఇందిరా గాంధీ ‘గరీబీ హటావో’ అన్నారు, మోదీ ‘గరీబ్ కల్యాణ్’ అంటున్నారు. అంతే తేడా.


దేశంలో  వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, వారి దయనీయ గాథల గురించి మీడియాలో చదివి సుప్రీంకోర్టు ఎట్టకేలకు మంగళవారం తనంతట తాను స్పందించి కేంద్రానికీ రాష్ట్ర ప్రభుత్వాలకూ నోటీసులు జారీ చేసింది. ‘ప్రజలు నడుస్తుంటే వారిని మేము ఎలా ఆపగలం? ఎవరు నడుస్తున్నారో, ఎవరు నడవడం లేదో పర్యవేక్షించడం ఈ కోర్టుకు అసాధ్యం.’ అని ఇదే సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించింది. మైళ్ల కొద్దీ నడిచి తమ గ్రామాలకు వెళుతున్న వలస కార్మికులకు ఆహార, ఆశ్రయం, రవాణా వంటి సౌకర్యాలు అందించవలిసిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. 


ఈ తీర్పుకు ముందు ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది వలస కార్మికులు మరణించారు. 60మందికి పైగా గాయపడ్డారు. ఈ తీర్పు వచ్చిన  తర్వాత మూడు రోజులకు  ఉత్తర ప్రదేశ్‌లో కన్నోజ్ నుంచి హర్దోయి వరకు నడిచి వెళుతూ ఒక 60 ఏళ్ల వృద్ధుడు ఆకలికి తట్టుకోలేక మరణించాడు. దేశమంతటా చాలా చోట్ల వలస కార్మికుల ఆకలి చావుల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. రెండవ సారి అధికారంలో ఏడాది కాలాన్ని త్వరలో పూర్తి చేసుకోబోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంతవరకూ వలస కార్మికుల దుస్థితి గురించి నిర్దిష్టంగా వ్యాఖ్యానించలేదు. ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఎండవేడిమికి, ఆకలి, దాహానికి తట్టుకోలేక కుప్పకూలిపోతున్న వలస కార్మికులను ఎంత మేరకు చేరుకుంటున్నాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఏదో రకంగా శ్రామిక్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన వారిలో కూడా కొందరు ఆకలికి తట్టుకోలేక మరణించిన కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.


దేశంలో ఇంతటి దయార్ద్రమైన పరిస్థితి ఉన్నప్పటికీ దేశ సర్వోన్నత న్యాయస్థానం రెండు నెలలుగా స్పందించలేదు. ఒకసారి పిటిషన్‌ను కూడా కొట్టి వేసింది. చివరకు మీడియాలో వార్తలు రావడంతో స్పందించినట్లు కనపడుతోంది. నేరుగా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసి తనంతట తాను స్పందించడంలో ఆంతర్యమేమిటో దానికే తెలియాలి. సుప్రీం కూడా కాక తగిలితే కాని మేలుకోదన్నమాట. గతంలో సుప్రీం చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకునేది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వద్ద ట్రాఫిక్ జామ్ జరిగినా సుప్రీం స్పందించిన రోజులున్నాయి. గోదాముల్లో ఆహార ధాన్యాలు కుళ్లిపోతుంటే వాటిని ఆకలితో మలమల మాడుతున్న  ప్రజలకు ఉచితంగా సరఫరా చేసేందుకు ఎందుకు వెనుకాడుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించిన సందర్భాలూ లేకపోలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 క్రింద జీవించే హక్కు గురించి సుప్రీంకోర్టు గతంలో అనేకసార్లు వ్యాఖ్యానించింది. ‘జీవించే హక్కు అంటే జంతువులా జీవించడం కాదు, గౌరవ ప్రదంగా, జీవించడం.. సరైన పోషకాహారం, నివాసం పొందే హక్కు ఉండడం..’ అని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాలకు బుద్ధి చెప్పిన ఉదంతాలున్నాయి.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కాలంలో  జరిగిన బృహత్తరమైన మార్పులు ఏవైనా ఉన్నా యా అని అంతర్మథనం చేసుకుంటే సుప్రీంకోర్టులో జరిగిన మానసిక పరివర్తనం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఉన్నత న్యాయస్థానాన్ని ఇంత అద్భుతంగా తమ అభిప్రాయాలతో ఏకీభవించేలా చేయగలగడం ఈ ఆరేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయంగా అభివర్ణించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ పనిచేసినా దానికొక నిర్దిష్ట లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా వ్యవస్థల్నీ, చట్టాల్నీ మార్చుకోవడం, అవి మారడానికి తగిన చర్యలు చేపట్టడం పద్ధతి ప్రకారం జరుగుతుంటుంది. న్యాయవ్యవస్థ ఇందుకు మినహాయింపు కాదు. న్యాయవ్యవస్థతో పాటు ఎన్నికల కమిషన్, సివిసి, సిబిఐ, కాగ్ వంటి సంస్థల్లో స్వతంత్ర క్రియాశీలత గురించి ఇప్పుడు చర్చించడం అనవసరమనే చెప్పాలి.


ఆరేళ్లలో ఎన్ని నినాదాలు వచ్చిపోయాయి? ‘అచ్చేదిన్’ (మంచి రోజులు) వస్తాయని మోదీ ప్రధానమంత్రి అయిన తొలి రోజుల్లో ప్రచారం జరిగేది. ఇవాళ అచ్చేదిన్ గురించి ఎవరూ పెద్దగా చర్చించడంలేదు. ‘ఆత్మ నిర్భర్’ అన్న పదం కొత్తగా మోదీ ప్రకటించిన నినాదాల జాబితాలో చేరింది.  స్వచ్ఛ భారత్, సబ్ కాసాథ్- సబ్ కా విశ్వాస్, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, బేటీ పడావో-బేటీ బచావో వంటి రకరకాల పేర్లను ఖాయం చేసి మార్కెట్‌లో వదిలి వాటిని బహుళ ప్రచారంలో ఉంచడం, జనాన్ని ఆకర్షితులు చేయడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య అయింది. ఇవన్నీ వాస్తవంగా అమలవుతున్నాయా లేదా పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే ప్రతి నినాదాన్ని అద్భుతంగా, కవితాత్మకంగా మార్చడం ఆయనకు అద్భుతమైన కళగా అబ్బింది కనుక ఒక నినాదం కాకపోయినా మరో నినాదానికి జనం ఆకర్షితులవుతున్నారు. కాని లోతుగా పరిశీలిస్తే ఇవాళ ఈ నినాదాలన్నిటిలోనూ మనకు వలస కార్మికులే కనపడుతున్నారు.


స్వచ్ఛ భారత్‌ను తలుచుకున్నప్పడుల్లా నడుస్తూ వెళుతున్న పగిలిన పదాలు, దుమ్మెక్కిపోయిన ముఖాలు, ధూళి దూసరితమైన వారి దుస్తులు మన కళ్లముందు గోచరిస్తున్నాయి. సబ్ కా సాథ్- సబ్ కా విశ్వాస్ నినాదం ఉట్టిదేనని, ఇన్నాళ్లూ ఈ కోట్లాది మందిని ప్రభుత్వాలు విశ్వాసంలోకి తీసుకుని, అభివృద్ధిలో వారిని భగస్వాములను చేయలేదని అర్థమవుతోంది. మేక్ ఇన్ ఇండియాకు గొప్ప ప్రతిబింబం ఈ అభాగ్య జీవులేనని వేరే చెప్పనక్కర్లేదు. స్కిల్ ఇండియా శూన్యమేనని వారి  రెండు చేతులు, శ్రమ మాత్రమే నైపుణ్య భారతానికి నిదర్శనమని స్పష్టమవుతోంది.  స్మార్ట్ సిటీస్ ఏర్పడ్డాయో లేదో ఆచరణలో కనపడడం లేదు కాని పేరుకున్న దారిద్ర్యానికి సంకేతాలుగా నగరాలు అభివృద్ధి చెందాయని తెలుస్తోంది. తల్లిదండ్రుల వెంట మైళ్లకు మైళ్లు ఆడపిల్లలు నడుస్తున్న దృశ్యాలతో ‘బేటీ బచావో–-బేటీ పడావో’ కేవలం నినాదప్రాయమేనని అవగాహన కలుగుతుంది. స్పష్టంగా చెప్పాలంటే వలస కార్మికులు ఈ దేశ నాయకత్వ నిరర్థక నినాదాలను, అసమర్థ పాలనను, అభివృద్ధి బూటకత్వాన్నీ, వ్యవస్థల్లో పేరుకున్న కుళ్లును అవహేళన చేస్తున్నారు.


మొదటి అయిదేళ్లు అందమైన నినాదాలు, అనర్గళ ఉపన్యాసాలతో పాటు దేశ భక్తిని రంగరించిన మోదీ రెండవ సారి అధికారంలోకి రావడం చాలా అవలీలగా జరిగింది. భారత దేశంలోని అన్ని వేదనలకూ తానే పరిష్కారమని తనను చిత్రించుకోవడంలో మోదీ సఫలీకృతుడు కావడంతో ప్రతిపక్షాలు వెలవెలబోయాయి. అదే సమయంలో పార్టీలో కూడా రెండవ నేతగా చెప్పుకోదగ్గ వ్యక్తి లేకుండా చేయగలిగారు. ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలు కాల వాహినిలో కలిసిపోతే, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంతకుమార్ ప్రభృతులు కాలధర్మం చెందారు, మొదటి అయిదేళ్లూ పార్టీ అధ్యక్షుడుగా, ఆ తర్వాత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా తనకు కుడిభుజంగానో తన ఎజెండాను అమలు చేయగలిగిన పరికరంగానో మోదీ భావించినట్లు ఇటీవల పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వంద రోజుల్లోనే కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, త్రిపుల్ తలాఖ్ నిషేధం, పౌరసత్వ చట్టం వంటివి దూకుడుగా ప్రవేశపెట్టిన అమిత్ షా మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడుగా ఎవరైనా భావిస్తే అది పొరపాటేనని ఆయన పార్టీ అధ్యక్షుడుగా గద్దె దిగినప్పటి నుంచీ జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తన ఎజెండాను అమలుచేసే విషయంలో మోదీకి అమిత్ షా ఎంత ముఖ్యమో, నిర్మలా సీతారామన్ అంతే ముఖ్యమని, ఇరువురినీ ప్రధానమంత్రి కార్యాలయమే నిర్దేశిస్తుందని అర్థమవుతోంది. మోదీ హయాంలో వ్యవస్థలే స్వతంత్రంగా పనిచేయలేనప్పుడు మంత్రుల సంగతి  ఎంత? రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆరునెలల్లో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న రోజుల్లో, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, బ్యాంకులు దివాళా తీస్తూ ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతున్న కాలంలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇండియాకు తీసుకువచ్చి నాటకాన్ని రక్తి కట్టించాలని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా వైరస్ విపత్తు దేశాన్ని తాకింది.


దేశమంతటా ఏకం చేయగలిగిన భారాన్ని భుజానికెత్తుకున్న నేతగా కనిపించిన మోదీకి కరోనా సంక్షోభంతో ఇతర సంక్షోభాల గురించి ప్రజల్ని మరిపించే అవకాశం లభించింది. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ నేతి బీరకాయలో నేయి లాంటిదేనని తెలిసినా, ఆ పేరుతో వచ్చే లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకునేందుకు ప్రాతిపదిక లభించింది. ఈ మధ్య కాలంలో జీవనోపాధి కోల్పోయిన లక్షలాది మంది వలసకార్మికుల జీవితాలు మారతాయని, జీతాలు, ఉద్యోగాల కోతతో క్రుంగిపోయిన మధ్యతరగతి మానసిక వ్యధలు తొలగిపోతాయని, ఆర్థిక వ్యవస్థ భారీ ఎత్తున ఊపందుకుంటుందనీ ఎవరైనా భావిస్తే వారి భ్రమలతో విభేదించనవసరం లేదు. పేదలు, పేదరికం అన్నది ఇవాళ కొత్తగా వినిపిస్తున్న పదాలు కావు. ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ అన్నారు, మోదీ ‘గరీబ్‌ కల్యాణ్’ అంటున్నారు. అంతే తేడా.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Advertisement
Advertisement
Advertisement