ముంచుకొస్తున్న కొత్త ముప్పు!

ABN , First Publish Date - 2021-11-30T05:26:44+05:30 IST

కరోనా కొత్త వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమైక్రాన్‌ వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ముంచుకొస్తున్న కొత్త ముప్పు!

పొంచి ఉన్న ఒమైక్రాన్‌ వేరియంట్‌

అప్రమత్తంగా లేకుంటే ముప్పు తప్పదంటున్న వైద్యులు

మాస్కులు, భౌతికదూరం మరిచిన జిల్లా ప్రజలు

జిల్లాలో ఏదో ఒకచోట నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

ఇప్పటి వరకు 31వేలకు పైగా కరోనా కేసులు నమోదు

జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

ఇప్పటి వరకు 8 లక్షల మందికి వ్యాక్సినేషన్‌

కామారెడ్డి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కరోనా కొత్త వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమైక్రాన్‌ వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. సెకండ్‌వేవ్‌లో జిల్లాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. దాదా పు 150మందికి పైగానే జనాలు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ కొత్త వేరియంట్‌ జిల్లా సరిహద్దులోని కర్ణాటక, మహారాష్ట్రలో ఒకరిద్దరికి సోకినట్లు చర్చ సాగుతోంది. దీంతో జిల్లా ప్రజల్లో ఆందోళన మొదలయింది. జిల్లా నుం చి కర్ణాటక, మహారాష్ట్రకు నిత్యం రాకపోకలు సాగుతుంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్‌ జిల్లాను చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందనే ఆలోచనతో జిల్లా ప్రజలు కనీసం కరోనా నిబంధనలు పాటించడం లేదు. కనీసం మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా జనాలు వ్యవహరిస్తున్నారు. ఇలా ఉంటే కొత్త వేరియంట్‌ వేగంగా విస్తరించే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

సరిహద్దు రాష్ట్రాలో ఒమైక్రాన్‌ కేసులు

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమైక్రాన్‌ వైరస్‌ వేగం గా విస్తరిస్తోందని ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాల ని డబ్ల్యుహెచ్‌వో సూచిస్తోంది. ఇందులో భాగంగానే కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టారు. అప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. కామారెడ్డి జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఈ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్‌లో ఒమైక్రాన్‌ వైరస్‌ విస్తరిస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలోనూ కేసులు నమోదయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కామారెడ్డి ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు కామారెడ్డి జిల్లా ప్రాంతాలైన పిట్లం, జుక్కల్‌, నిజాంసాగర్‌, మద్నూర్‌, పెద్ద కొడప్‌గల్‌, బిచ్కుంద, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల ప్రజానీకం ఆ రెండు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సెకండ్‌వేవ్‌లోనూ మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఈ మండలాల పరిధిలోనే ఎక్కువగా సోకింది. ఈ కొత్త వేరియంట్‌ ఈ రాష్ట్రాల్లో వెలుగు చూసినందున జిల్లాలోని ఈ మండలాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

31వేలకు పైగా పాజిటివ్‌ కేసులు

కరోనా ఫస్ట్‌, సెకండ్‌వేవ్‌లో జిల్లాలో భారీగానే కేసులు నమోదయ్యాయి. ఫస్ట్‌వేవ్‌లో అంతప్రభావం లేకున్నప్పటికీ సెకండ్‌వేవ్‌ మాత్రం జిల్లాను కుదిపేసింది. జిల్లా మొత్తం చుట్టేయడంతో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వచ్చాయి. ఈ రెండు వేవ్‌లలో జిల్లాలో లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 31,845 మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా 31,790 మంది కరోనా నుంచి కొలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారిన పడి జిల్లాలో ఇప్పటి వరకు 180 మంది మృతి చెందినట్లు, జిల్లాలో జీరో కేసులు నమోదవుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. సెకండ్‌వేవ్‌లోనే అత్యధికంగా కేసులు నమోదవడం, మరణాల సంఖ్య సైతం పెరిగింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రితో పాటు బాన్సువాడ, ఎల్లారె డ్డి ఏరియా ఆసుపత్రిలో, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో కరోనా టెస్టులు చేపడుతున్నారు. గత అనుభావాలను దృష్టిలో ఉంచుకుని కరోనా కొత్త వేరియంట్‌ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

8 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి

జిల్లాలో మొదటి వేవ్‌ తర్వాత ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టారు. మొదట్లో చాలా మంది కరోనా టీకాలు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. సెకండ్‌వేవ్‌లో సృష్టించిన భయానక వాతావరణంతో కరోనా పట్ల మరిం త భయం నెలకొంది. దీంతో వ్యాక్సినేషన్‌ తీసుకునేందుకు ప్రజలు ఆసుపత్రుల ముందు క్యూకట్టారు. ప్రభుత్వాలు సైతం వ్యాక్సినేషన్‌ను ఉచితంగా ఇస్తోంది. జిల్లాలో ఇప్ప టి వరకు 8,38,142 మందికి కరోనా టీకాలు వేశారు. ఇందులో మొదటి డోసు 5,81,757 మంది తీసుకోగా, రెం డో డోసు 2,56,385 మంది తీసుకున్నారు. ఇందులో మహిళలు 4,47,217 మంది ఉండగా పురుషులు 3,90,776 మంది ఉన్నారు. కొవిషీల్డ్‌ తీసుకున్న వారు 8,04,185 మంది ఉండగా, కొవ్యాక్సిన్‌ తీసుకున్న వారు 33,957 మంది ఉన్నారు. 18-44 సంవత్సరాల వరకు ఉన్నవారు 2,57,459 మంది ఉండగా 45-60 సంవత్సరాల మధ్య ఉన్నవారు 4,26,386 ఉన్నారు. 60 సంవత్సరాల పైబడిన వారు 1,54,297 మంది వ్యాక్సినేషన్‌ తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటికీ 29 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-11-30T05:26:44+05:30 IST