అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త ప్రయాణ నిబంధనలు.. 55 దేశాల నుంచి వచ్చేవారికి కొవిడ్ టెస్టులు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-12-01T13:22:19+05:30 IST

ఒమైక్రాన్‌ వేరియంట్‌ ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కొత్త నిబంధనలు జారీ చేసింది.

అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త ప్రయాణ నిబంధనలు.. 55 దేశాల నుంచి వచ్చేవారికి కొవిడ్ టెస్టులు తప్పనిసరి

అమల్లోకి కొత్త ప్రయాణ నిబంధనలు

వీటి నుంచి వచ్చేవారికి విమానాశ్రయాల్లో కొవిడ్‌ టెస్టులు

నెగెటివ్‌ అని తేలినా ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌

కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ఒమైక్రాన్‌ను ఆర్టీపీసీఆర్‌, యాంటీజెన్‌ టెస్టుతో గుర్తించొచ్చు

ఇప్పటివరకు కేసులు బయటపడలేదు: పార్లమెంట్‌లో వెల్లడి

డిసెంబరు ఆఖరు వరకు ఇంటింటికీ వ్యాక్సిన్‌, కట్టడి చర్యలు 

డిసెంబరు ఆఖరు వరకు ఇంటింటికీ వ్యాక్సిన్‌ 

న్యూఢిల్లీ, నవంబరు 30: ఒమైక్రాన్‌ వేరియంట్‌ ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కొత్త నిబంధనలు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రాలు, యూటీలతో చర్చించి యూర్‌పలోని 44 దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయిల్‌ను ముప్పు జాబితాలో పేర్కొంది. ఈ దేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయా ల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేస్తారు. ఫలితం వచ్చేవరకు వీరు విమానాశ్రయాల్లోనే ఉండాలి. ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫాంను అప్‌లోడ్‌ చేయాలి. టెస్టులో నెగెటివ్‌గా తేలితే ప్రయాణికులు 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 8వ రోజు మళ్లీ పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే ఐసొలేట్‌తో పాటు నమూనాలను జన్యు విశ్లేషణకు ఇన్సాకాగ్‌ పరిధిలోని ప్రయోగశాలకు పంపుతారు. రాష్ట్రాలు వీరి కాంటాక్టుల ట్రేసింగ్‌ చేసి.. 14 రోజులు పర్యవేక్షించాలి.


విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో నిర్లక్ష్యం వద్దని రాష్ట్రాలకు కేంద్ర ఆరో గ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ను ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులతో గుర్తించవచ్చని, పరీక్షలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. పెద్దఎత్తున కేసులు వస్తున్న ప్రాంతాలపై దృష్టిపెట్టాలని, ఆ నమూనాలను జన్యు విశ్లేషణకు పంపాలని సూచించారు. గ్రామాలపై నిశిత పరిశీలన ఉండాలని, పిల్లలు కరోనా బారినపడ్డారేమో పరిశీలించాలని స్పష్టం చేశారు. అందరికీ తొలి డోసు వేయడంతో పాటు ఇంటింటికీ టీకా కార్యక్రమాన్ని ఈ నెల 31 వరకు కొనసాగించనున్నట్లు నీతీ ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ చెప్పారు. కట్టడి మార్గదర్శకాలనూ నెలాఖరు వరకు పొడిగించారు. 


ఢిల్లీలో ఆరు గంటల నిరీక్షణ

కేంద్రం ఆదేశాల నేపథ్యంలో విమానాశ్రయ వర్గాలు, విమానయాన సంస్థలకు డీజీసీఏ ఉత్తర్వులు జారీచేసింది. 1500 మంది ప్రయాణికులను ఒకేసారి పరీక్షించే లా ఢిల్లీ విమానాశ్రయం ఏర్పాట్లు చేసింది. అయితే, అక్కడ ఫలితం వచ్చేందుకు ప్రయాణికులు 6 గంటలు నిరీక్షించాల్సి ఉంటుంది. ఒమైక్రాన్‌ వ్యాప్తి ఉన్న దేశాల విమానాలను చాలా దేశాలు రద్దు చేశాయని, మనమెందుకు చేయలేకపోతున్నామని కేంద్రాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నిలదీశారు. దేశంలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం పార్లమెంటుకు తెలిపారు.


విమాన చార్జీలు పైపైకి..

ఒమైక్రాన్‌ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణ చార్జీలు పెరిగాయి. ముఖ్యంగా యూఏఈ, కెనడా, అమెరికా, బ్రిటన్‌కు వెళ్లే చార్జీలు 2-3 రెట్లు పెరిగాయి. షికాగో, వాషింగ్టన్‌, న్యూయార్క్‌ సిటీలకు వెళ్లే విమానాల టికెట్‌ ధరలు 100శాతం పెరిగాయి. 


ఒమైక్రాన్‌పై మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్‌ తలోమాట

ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌పై తక్కువ ప్రభావశీలతతోనే పనిచేసే అవకాశం ఉం దని అమెరికా టీకా తయారీ కంపెనీ ‘మోడెర్నా’ సీఈవో స్టీఫెన్‌ బాన్సెల్‌ అంచనా వేశారు. కొత్త వేరియంట్‌ వల్ల సోకే ఇన్ఫెక్షన్‌ తీవ్రత తెలిసేందుకు మరో 2వారాలు పట్టొచ్చన్నారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేలా మోడె ర్నా టీకా ఫార్ములాలో మార్పులు చేయాలంటే కొన్ని నెలలు పడుతుందని చెప్పారు. వ్యాక్సిన్లకు ఒమైక్రాన్‌ లొంగదని చెప్పేందుకు ఆధారాలు లేవని కొవిషీల్డ్‌ టీకాను అభివృద్దిచేసిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తెలిపింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. చాలామంది భారతీయులకు దాని నుంచి రక్షణ లభిస్తుందని ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ వ్యాఖ్యానించారు. 


యూకేలో మాస్క్‌ కచ్చితం

ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) బహిరంగ ప్రదేశాల్లో, ప్రజా రవాణాలో మాస్క్‌ ధారణ నిబంధనను మళ్లీ అమల్లోకి తెచ్చింది. మూడు వారాల పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణికులంతా యూకే చేరిన రెండు రోజుల్లోపల ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలని, నెగెటివ్‌గా తేలేవరకు ఐసొలేట్‌ కావాలని సూచించింది. యూకేలో ఒమైక్రాన్‌ కేసులు 14కు చేరాయి. మంగళవారం స్కాట్లాండ్‌లో మరో ముగ్గురికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. అర్హులంతా టీకా బూస్టర్‌ డోసు తీసుకోవాలని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కోరారు. ఇప్పటివరకు 40 ఏళ్లుపైబడినవారికే బూస్టర్‌ ఇస్తుండగా.. ఇకపై 18 నుంచి 39 ఏళ్ల వారికీ వేయాలని యూకే టీకా సలహా కమిటీ పేర్కొంది. రోగ నిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్నవారికి నాలుగో డోసు ఇవ్వాలని ప్రతిపాదించడం గమనార్హం. వీటన్నిటినీ ప్రభుత్వం ఆమోదించింది. నార్వే కూడా వయోజనులందరికీ బూస్టర్‌ ఇవ్వాలని నిర్ణయించింది. జపాన్‌లో మంగళవారం ఒమైక్రాన్‌ వేరియంట్‌ తొలి కేసు నమోదైంది.

Updated Date - 2021-12-01T13:22:19+05:30 IST