బ్రిటన్‌లో అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్.. భారతీయులు ఇకపై..

ABN , First Publish Date - 2021-10-11T22:36:49+05:30 IST

భారత టీకా కార్యక్రమాన్ని గుర్తించబోమంటూ బెట్టు చేస్తూ వచ్చిన బ్రిటన్ ఎట్టకేలకు దిగొచ్చింది. భారతీయుల ఆగ్రహాన్ని గ్రహించి.. నిబంధనల్లో తగు మార్పులు తెచ్చింది. దీంతో.. కోవిషీల్డ్ తీసుకున్న భారతీయులు కూడా ఇకపై గుర్తింపు పొందిన ఇతర దేశాల పర్యటకుల లాగానే చాలా సునాయాసంగా బ్రిటన్‌కు ప్రయాణం కట్టొచ్చు.

బ్రిటన్‌లో అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్..  భారతీయులు ఇకపై..

ఇంటర్నెట్ డెస్క్: భారత టీకా కార్యక్రమాన్ని గుర్తించబోమంటూ బెట్టు చేస్తూ వచ్చిన బ్రిటన్ ఎట్టకేలకు దిగొచ్చింది. భారతీయుల ఆగ్రహాన్ని గ్రహించి.. నిబంధనల్లో తగు మార్పులు తెచ్చింది. దీంతో.. కోవిషీల్డ్ తీసుకున్న భారతీయులు కూడా ఇకపై గుర్తింపు పొందిన ఇతర దేశాల పర్యటకుల లాగానే చాలా సునాయాసంగా బ్రిటన్‌కు ప్రయాణం కట్టొచ్చు. కొద్ది రోజుల క్రితమే బ్రిటన్ ఈ కొత్త నిబంధనలను ప్రకటించగా.. నేటి నుంచీ అవి అమల్లోకి వచ్చాయి. తాజా నిబంధనల ప్రకారం..


ముందస్తు ఆర్‌టీపీసీఆర్ అవసరమే లేదు..

ఇప్పటివరకూ బ్రిటన్ వెళ్లాలనుకున్న వాళ్లు విమానం ఎక్కేముందే ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష ద్వారా  కరోనా సోకలేదని నిరూపించుకోవాల్సి వచ్చేది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక భారతీయులకు ఈ బెడద తప్పిపోయింది. బ్రిటన్‌లో కాలు పెట్టిన తరువాత రెండో రోజున కరోనా టెస్టు చేయించుకుంటే సరిపోతుంది. అయితే..కొవిషీల్డ్ తీసుకున్న వారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉంది.  ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వం ఆస్ట్రాజెనెకా/ఆక్స్‌ఫర్డ్ టీకా(కొవిషీల్డ్‌ కూడా), ఫైజర్-బయోఎన్‌టెక్, మోడర్నా, యాన్సెన్ టీకాలను మాత్రమే గుర్తించింది. ఇవి కాక ఇతర కరోనా టీకాలు తీసుకున్న భారతీయులు మాత్రం బ్రిటన్ విమానం ఎక్కేముందు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు చేయించుకుని, నెగెటివ్ వచ్చినట్టు చూపించాల్సి ఉంటుంది. 


అంతేకాకుండా.. బ్రిటన్ చేరుకున్నాక పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ క్రమంలో రెండో రోజున, మళ్లీ ఎనిమిదో రోజున కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని కరోనా బారినపడ్డదీ లేనిదీ తెలుసుకోవాలి. ఇక.. హోం క్వారంటైన్‌ను ముందుగా ముగిద్దామనుకునే వారు టెస్టు టూ ఫ్రీ సర్వీసు ద్వారా ఐదో రోజున ప్రైవేటులో కరోనా టెస్టు చేయించుకోవచ్చు. ఇందులో నెగెటివ్ వచ్చిందంటే వెంటనే క్వాంటైన్‌ను ముగించి దైనందిన జీవితాన్ని ప్రారంభించవచ్చు. 


బ్రిటన్ ప్రభుత్వం కొత్త రూల్స్‌ ప్రకారం.. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలు రెడ్ లిస్ట్‌లో ఉంటాయి. ఇతర దేశాలన్నీ మరో కేటగిరీలో ఉంటాయి. రెడ్ లిస్ట్‌లో ఉన్న దేశాలకు చెందిన వారు మాత్రం బ్రిటన్‌కు వెళ్లేముందే ఆర్‌టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. బ్రిటన్‌కు చేరుకున్నాక తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాలి. బ్రిటన్ ప్రభుత్వం గతంలో పేర్కొన్న నిబంధనలు యథాతథంగా రెడ్ లిస్ట్‌ దేశాలకు వర్తిస్తాయి. 

Updated Date - 2021-10-11T22:36:49+05:30 IST