సాధారణ మరణాలేనన్నారు.. కానీ ఓకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-04T16:47:31+05:30 IST

విజయవాడ పాతరాజరాజేశ్వరిపేటకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఢిల్లీ సమావేశాలకు హాజరై మార్చి 18న తిరిగి వచ్చాడు. తీవ్రమైన దగ్గు, ఆయాసంతో 29న మృతి చెందాడు.

సాధారణ మరణాలేనన్నారు.. కానీ ఓకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్

నష్టం జరిగాక.. కరోనా మృతిపై ఆలస్యంగా అధికారుల ప్రకటన

మార్చి 30న కరోనా లక్షణాలతో వ్యక్తి మృతి

29 అర్ధరాత్రి కన్నుమూసిన భార్య 

ఢిల్లీ వెళ్లొచ్చిన కొడుకు ద్వారానే కరోనా!

30న మృతుడి నుంచి శాంపిల్స్‌ సేకరణ

అది కరోనా మృతేనని ఎట్టకేలకు ప్రకటన 

అదే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్‌

పారామెడికల్‌ సిబ్బంది క్వారంటైన్‌కు

అధికారుల ఉదాసీనతతో మరింత నష్టం


విజయవాడ (ఆంధ్రజ్యోతి):

విజయవాడ పాతరాజరాజేశ్వరిపేటకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఢిల్లీ సమావేశాలకు హాజరై మార్చి 18న తిరిగి వచ్చాడు. తీవ్రమైన దగ్గు, ఆయాసంతో 29న మృతి చెందాడు. 


విజయవాడ కుమ్మరిపాలెంకు చెందిన భార్యాభర్తలు మార్చి 29 అర్ధరాత్రి ఒకరు, 30వ తేదీ ఉదయం మరొకరు మృతి చెందారు. ఇద్దరూ 50 సంవత్సరాలు పైబడినవారే. తీవ్రమైన దగ్గు, ఆయాసంతోనే ఇద్దరూ మృతిచెందారు. ఢిల్లీ సమావేశాలకు హాజరై వచ్చిన కుమారుడి ద్వారా వారికి వైరస్‌ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. 


‘ఆంధ్రజ్యోతి’ మార్చి 31వ తేదీ సంచికలో ఈ మూడూ కరోనా మరణాలు కావచ్చునని సందేహం వ్యక్తం చేసింది. అయినా అధికారులు పట్టించుకున్నది లేదు. ఇన్ని రోజుల తరువాత కుమ్మరిపాలెంకు చెందిన వ్యక్తిది కరోనా మరణంగా నిర్ధారిస్తూ అధికారులు శుక్రవారం ప్రకటన జారీ చేశారు. 


ఒక నిర్లక్ష్యం కొందరిని కరోనా బారిన పడేసింది. వందల మందిని క్వారంటైన్‌కు చేర్చింది. ఎందరినో భయాందోళనలకు గురిచేసింది. ఒక మరణం వెయ్యి సందేహాలను లేవనెత్తింది. ఢిల్లీ ప్రార్థనకు వెళ్లొచ్చినవారి అవగాహన రాహిత్యం.. వాళ్లను గుర్తించడంలో జరిగిన జాప్యం ఇంకొన్ని పాజిటివ్‌ కేసులు పెరగడానికి కారణం కాగా, కరోనా లక్షణాలతో ఒక రోజు వ్యవధిలో భార్యాభర్తలిద్దరు మృతి చెందిన ఘటనలో అధికారుల ఉదాసీనత ఇంకొంత నష్టాన్ని తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో తొలి కరోనా మరణం మార్చి 30న సంభవించగా, అధికారులు శుకవ్రారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఉదాసీనతే ఇంకొందరు కరోనా వైరస్‌ బారిన పడడానికి కారణమయింది.


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో జిల్లా అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడంతో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యే పరిస్థితి ఏర్పడింది. కుమ్మరిపాలెంకు చెందిన వ్యక్తి విషయంలో ఎట్టకేలకు స్పందించిన అధికారులు అతనిది కరోనా మరణంగా నిర్ధారిస్తూ శుక్రవారం ప్రకటన జారీ చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని ‘కోవిడ్‌-19 ట్రీటింగ్‌ సెంటరు’గా అధికారులు తీర్చిదిద్దారు. మార్చి 21న జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు రికార్డ్‌ అయింది. అప్పటి నుంచైనా అప్రమత్తం కావాల్సిన అధికారులు ఆ తర్వాత కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. కరోనా లక్షణాలతో మార్చి 29, 30న మూడు మరణాలు సంభవించాయి. వెనువెంటనే అప్రమత్తం కావాల్సిన అధికారగణం ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మూడు మరణాల్లో రెండు మరణాలను సాధారణ మరణాలుగానే రికార్డు చేశారు. 


కుమ్మరిపాలెం వ్యక్తి విషయంలోనూ సాధారణ మరణంగా రికార్డు చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఉన్నతాధికారుల జోక్యంతో చివరి నిమిషంలో మృతుడి నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షకు పంపారు. కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి బయటకు తరలించిన పారా మెడికల్‌ సిబ్బంది ముగ్గురిని ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. పాతరాజరాజేశ్వరిపేటలో మృతి చెందిన వ్యక్తి భార్యకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేవలం అధికారుల ఉదాసీనత కారణంగా కరోనా వ్యాప్తి జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. 


అప్పుడే అప్రమత్తమై ఉంటే..

జిల్లా అధికారుల తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. కుమ్మరిపాలెంకు చెందిన యువకుడు ఢిల్లీ సమావేశాలకు హాజరై మార్చి 17న విజయవాడ తిరిగి వచ్చారు. ఈ యువకుడి తల్లి శ్వాసకోశ సమస్యతో 29 అర్ధరాత్రి మృతి చెందింది. మరుసటి రోజు ఉదయం 9 గంటల సమయంలో ఆమెను ఖననం చేశారు. కొద్ది గంటలకే ఆమె భర్త కూడా అదే సమస్యకు గురికావడంతో ఆయన్ను ఉదయం 11.30కు ఆసుపత్రికి తీసుకురాగా, 12.30కు మృతి చెందాడు. ఈయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. మృతుడి నుంచి కరోనా నిర్ధారణ పరీక్షకు అవసరమైన శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. కానీ మృతదేహం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బంధువులకు అప్పగించారు. కరోనా కారణంగా మృతి చెందితే ఆ మృతదేహాన్ని ప్రత్యేకమైన విధానంలో తగిన జాగ్రత్తలతో ఖననం చేయాల్సి ఉంటుంది. అలాంటివేవీ జరగలేదు. కుటుంబసభ్యులకూ జాగ్రత్తలు సూచించలేదు. దీంతో అదే రోజు సాయంత్రం సుమారు 200 మంది బంధుమిత్రుల సమక్షంలో కుటుంబసభ్యులు ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. ఆ కుటుంబంలో ఉన్న ఆరుగురికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ రావడం గమనార్హం. ఢిల్లీ వెళ్లి వచ్చిన యువకుడి స్నేహితుడు (ప్రభుత్వ ఉద్యోగి)కి, అతని భార్యకూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ వ్యక్తి ఉద్యోగరీత్యా పలువురిని కలిశాడు. దీంతో వారికి, కరోనాతో మృతి చెందిన కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారిలో, ఖనన కార్యక్రమానికి హాజరైన వారిలో ఎంత మందికి కరోనా వైరస్‌ వ్యాపించి ఉంటుందోనని ఇప్పుడు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న 29 మందిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. కరోనా మృతిపై ఆ రోజే అధికారులు అప్రమత్తమై ఉంటే వైరస్‌ వ్యాప్తికి కొంత వరకైనా అడ్డుకట్టవేసేవారన్న వాదన వినిపిస్తోంది.   

Updated Date - 2020-04-04T16:47:31+05:30 IST