ఇంద్రకీలాద్రిపై వెండి సింహాల చోరీలో కొత్త కోణం

ABN , First Publish Date - 2020-09-19T16:01:53+05:30 IST

నేరం జరిగితే ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. క్లూస్‌ టీమ్‌, క్రైమ్‌ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ప్రాథమిక ఆధారాలు సేకరిస్తారు. చాలా కేసుల్లో ఇవే కీలకంగా ఉపయోగపడతాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రథంపై ఉన్న మూడు వెండి సింహాల చోరీలో మాత్రం ఆధారాలను అధికారులు మాయం చేశారు.

ఇంద్రకీలాద్రిపై వెండి సింహాల చోరీలో కొత్త కోణం

ఆధారాలు మాయం?

అధికారుల ముందస్తు హడావిడి

సీసీ కెమెరాల ఫుటేజీ లేనట్టే

పోలీసులకు సవాలుగా మారిన కేసు


ఆంధ్రజ్యోతి - విజయవాడ: నేరం జరిగితే ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. క్లూస్‌ టీమ్‌, క్రైమ్‌ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ప్రాథమిక ఆధారాలు సేకరిస్తారు. చాలా కేసుల్లో ఇవే కీలకంగా ఉపయోగపడతాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రథంపై ఉన్న మూడు వెండి సింహాల చోరీలో మాత్రం ఆధారాలను అధికారులు మాయం చేశారు. సింహం ప్రతిమలతో పాటు ఆధారాలు కూడా పోలీసులకు దొరక్కుండా చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


దుర్గమ్మ రథంపై వెండి సింహాల చోరీని అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా , ఘటనా స్థలాన్ని గందరగోళం చేశారు. అంతర్వేదిలో రథం దహనం తర్వాత పోలీసులు అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి రథాల చుట్టూ ఇనుప రాడ్లతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు సూచించారు. ఇందుకోసం అధికారులు రథంపై ముసుగును తొలగించారు. సింహాల ప్రతిమలు మాయమైనట్టు అప్పుడే గుర్తించారు. ఇది 14వ తేదీన వెలుగులోకి వస్తే, ఆలయాధికారులు 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపు రథంపై ముసుగును మార్చేశారు. ప్రతిమలు మాయమైన ప్రదేశంలో ఆలయ అధికారులు, సిబ్బంది చేతులు వేశారు. 


ఎందుకిలా?

క్లూస్‌ టీమ్‌ నేరాలు జరిగిన ప్రదేశంలో రసాయనాలను ఉపయోగించడం వెనుక పెద్ద ప్రక్రియ ఉంది. చోరీ జరిగిన ప్రదేశంలో నిందితుల వేలిముద్రలే కాకుండా శరీరంలోంచి విడుదలయ్యే రసాయనాలు కూడా ఆ ప్రదేశంలో ఉంటాయి. ఇలాంటి ఆధారాలు చెక్కు చెదరకుండా ఉండడం కోసమే నేరం జరిగిన ప్రదేశంలోకి పోలీసులు ఇతరులను అనుమ తించరు. అటువంటిది నేరం జరిగిన ప్రదేశాన్ని అధికారులు, సిబ్బంది చిందరవందర చేసి పడేశారు. సింహాల మాయంపై అప్పటికప్పుడు తోచిందేదో మాట్లాడేస్తున్న అధికారులు అన్నీ తెలిసీ నేరం జరిగిన ప్రదేశాన్ని మొత్తం ఎందుకు కదిలించారన్నది అంతుచిక్కని ప్రశ్నే. సీసీ ఫుటేజీ కూడా లేదు. ఆలయంలో ఫుటేజీ 15 రోజులకు మించి ఉండదంటున్నారు. సాధారణంగా ఫుటేజీ డీవీఆర్‌ (డిజిటల్‌ వీడియో రికార్డర్‌)లో నిక్షిప్తమవుతుంది. అధికారులు చెప్పినట్టు 15 రోజుల వరకే ఫుటేజీ ఉంటే, దాన్ని డీవీడీల్లో ఎందుకు కాపీ చేసుకోలేదన్నది మరో ప్రశ్న. విచారణ సమయంలో పోలీసులకు సీసీ ఫుటేజీని ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఇప్పుడు అదీ లేదంటున్నారు. ఒక తప్పును సరి చేసుకోవడానికి అధికారులు వరుసగా తప్పులు చేయడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2020-09-19T16:01:53+05:30 IST