కొత్త మెలిక!

ABN , First Publish Date - 2021-12-05T07:38:04+05:30 IST

పట్టణ పేదల కోసం నిర్మించిన జీప్లస్‌త్రీ గృహాల మంజూరు విషయంలో కొంత కదలిక వచ్చింది.

కొత్త మెలిక!

టిడ్కో గృహాలకు జియో ట్యాగింగ్‌

విజయవాడ డీపీ ఫౌండేషన్‌కు బాధ్యతలు 

పత్రాలు సమర్పిస్తేనే రుణం మంజూరు : మెప్మా

కొప్పోలు సముదాయం వద్ద  లబ్ధిదారుల బారులు

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 4 : పట్టణ పేదల కోసం నిర్మించిన జీప్లస్‌త్రీ గృహాల మంజూరు విషయంలో కొంత కదలిక వచ్చింది. అయితే ఇందులో సరికొత్త మెలిక పెట్టడంతో లబ్ధిదారులు కంగుతిన్నారు. గతంలో మంజూరైన గృహాలకు జియోట్యాగింగ్‌ చేసే ప్రక్రియ ఒంగోలులో మొదలైంది. గతంలో లాటరీ పద్ధతిన ఇళ్లు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా తమ వివరాల పత్రాలు ఇవ్వాలని వలంటీర్ల నుంచి ఒత్తిడి మొదలైంది. ఎందుకు.. ఏమిటి అని లబ్ధిదారులు అడిగిన ప్రశ్నలకు ఏమో తెలియదు.. ఒకసారి వెళ్లి కేటాయించిన బ్లాక్‌లోని మీ ఇల్లు చూసుకోండంటూ వలంటీర్లు ఇచ్చిన సమాధానంతో లబ్ధిదారులు పత్రాలు చేత పట్టుకుని శనివారం కొప్పోలు రోడ్డు సమీపంలోని జీప్లస్‌సముదాయం వద్దకు పరుగులు పెట్టారు. అక్కడ వందలసంఖ్యలో లబ్ధిదారులు అర్హత పత్రాలు చేత పట్టుకుని బారులు తీరడం కనిపించింది. దానిని చూసి అందరికీ త్వరలోనే ఇళ్లు ఇస్తున్నారన్న ఆనందం వారికి కలిగింది. అయితే అది ఎక్కువసేపు నిలవలేదు. ఇల్లు ఇవ్వాలంటే జియోట్యాగింగ్‌ చేయాలి, మీ పేరున బ్యాంకు రుణం మంజూరుకావాల్సి ఉంది. మీ దగ్గర ఉన్న బ్యాంకు అకౌంట్‌, ఆధార్‌కార్డు, ఇంటి మంజూరుపత్రం, రేషన్‌కార్డు నకళ్లు సమర్పించాలని అక్కడి సిబ్బంది తెలియజేయడంతో లబ్ధిదారులు నీరసపడ్డారు. అక్కడ పరిస్థితి చూస్తే మరో ఐదేళ్లకు కూడా ఇళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోగా, ఇప్పటికిపుడు జియోట్యాంగింగ్‌, లోన్లు అంటూ చేస్తున్న హడావుడి వెనుక ఏదో ఉందన్న అనుమానం లబ్ధిదారుల్లో నెలకొంది. 

ఇవ్వకుండానే వెనుదిరిగిన లబ్ధిదారులు

అవసరం లేని వారు చెల్లించిన వాటా సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని చెప్తుండటంతో లబ్ధిదారులు అనుమానంగానే తమ పత్రాలు అందజేశారు. మరికొందరు ఇవ్వకుండానే వెనుదిరిగారు. అయితే గతంలో ఇళ్లు కేటాయించిన వారి వివరాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వం వద్ద లేవని, ఇల్లు కేటాయించాలంటే జియో ట్యాగింగ్‌ తప్పనిసరి అని టిడ్కో అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ప్రక్రియ పూర్తయిందని, జిల్లాలో 9,568 మందికిగాను 120 మంది బ్యాంకు అకౌంట్లు మాత్రమే ఓపెన్‌ చేయగా, మిగిలిన వాటికి రుణం మంజూరు చేయలేదని వారు చెప్పారు.  ఇంటిపై రుణాలు మంజూరు చేయించే బాధ్యత మెప్మా అధికారులకు అప్పగించారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించే పనిలో మెప్మా సిబ్బంది ఉన్నారు. ప్రతి గృహ యజమానికి వారి పేరు మీద బ్యాంకు అకౌంట్‌ ప్రారంభించి, బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయిస్తామని తెలిపారు. తద్వారా ఆ గృహంపై పూర్తిహక్కులు యజమానికి కలిగి ఉంటాయని వివరిస్తున్నారు. 

Updated Date - 2021-12-05T07:38:04+05:30 IST