అడ్డగోలు టీకాలతో కొత్త వేరియంట్లు!

ABN , First Publish Date - 2021-06-11T07:57:27+05:30 IST

ప్రణాళిక లేని వ్యాక్సినేషన్‌తో ప్రమాదమేనని ప్రజారోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారీ, విచక్షణారహిత, అసంపూర్ణ వ్యాక్సినేషన్‌తో వైరస్‌ ఉత్పరివర్తన చెంది కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొస్తాయని...

అడ్డగోలు టీకాలతో కొత్త వేరియంట్లు!

  • ముప్పు ఉన్న వారికే ముందు ఇవ్వాలి
  • యువత, పిల్లలకు టీకాతో ప్రయోజనాలుండవు
  • కొవిడ్‌ నుంచి కోలుకున్న వారికి టీకా అక్కర్లేదు
  • వైరస్‌పై పోరులో వ్యాక్సినే ఆయుధం
  • ప్రధానికి సమర్పించిన నివేదికలో నిపుణులు

న్యూఢిల్లీ, జూన్‌ 10: ప్రణాళిక లేని వ్యాక్సినేషన్‌తో ప్రమాదమేనని ప్రజారోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారీ, విచక్షణారహిత, అసంపూర్ణ వ్యాక్సినేషన్‌తో వైరస్‌ ఉత్పరివర్తన చెంది కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక ముప్పు ఉన్న వారికే ముందు వ్యాక్సిన్లు వేయాలి తప్ప పిల్లలు సహా ప్రజలందరికీ టీకాలు వేయడమే లక్ష్యంగా పెట్టుకోరాదని అంటున్నారు. ఈ మేరకు భారత ప్రజారోగ్య సంఘం (ఐపీహెచ్‌ఏ), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఏపీఎ్‌సఎం), భారత అంటువ్యాధుల నిపుణుల సంఘం (ఐఏఈ)లకు చెందిన నిపుణులు, కొవిడ్‌పై ఏర్పాటైన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు, ఎయిమ్స్‌ వైద్యులు తాజా నివేదికలో వెల్లడించారు. ఈ నివేదికను ప్రధాని మోదీకి అందజేశారు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అందరికీ వ్యాక్సిన్‌ వేయడం కంటే సౌకర్యాలు, వ్యాధి తీవ్రత సమాచారం ఆధారంగా ప్రాధాన్య క్రమంలో టీకాలు వేయడం మంచిదని స్పష్టం చేశారు. యువతకు, పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉన్నట్లు ఆధారాలేమీ లేవని, ఆర్థికంగా కూడా లాభదాయకం కాదన్నారు. పైగా ప్రణాళిక లేని వ్యాక్సినేషన్‌ వల్ల కొత్త వేరియంట్లు వస్తాయని తెలిపారు. కొవిడ్‌ బారిన పడి, కోలుకున్న వారికి టీకాలు అవసరం లేదని చెప్పారు. ఇలాంటి వారికి వ్యాక్సిన్ల వల్ల మేలు జరుగుతుందనేందుకు ఆధారాలు లభించిన తర్వాత టీకాలు వేయాలని నిపుణులు నివేదికలో సిఫారసు చేశారు. అందరికీ టీకాలు వేయాలనుకోవడం మంచిదేనని, అయితే ప్రస్తుతం దేశంలో సరిపడినన్ని టీకాలు లేవన్న విషయాన్ని గుర్తించాలని నివేదికలో తెలిపారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరణాలను తగ్గించడంపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. కరోనా రెండో దశలో ఇప్పటికే పలు వేరియంట్లను గుర్తించారని.. దేశంలో మాత్రం మొత్తం పాజిటివ్‌ల్లో 1 శాతం కంటే తక్కువ నమూనాల జన్యుక్రమాలనే పరిశీలించారని నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఇతర దేశాల కంటే ఎంతో వెనకబడి ఉన్నామన్నారు. దేశంలోని గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో టెస్టింగ్‌ సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందని గుర్తుచేశారు. ర్యాపిడ్‌ టెస్టుల కచ్చితత్వం కాస్త తక్కువ అని  తెలిపారు. 


ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేగం పెంచండి

ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ తక్కువగా జరగడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వ్యాక్సినేషన్‌ పురోగతిపై రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలకు తొలి డోసు టీకా జాతీయ సగటు 82 శాతంగా ఉందని.. రెండో డోసుకు మాత్రం ఇది 56 శాతమేనని తెలిపారు. ఈ విషయంలో 18 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయన్నారు. ఇక ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల విషయంలో తొలి డోసు జాతీయ సగటు 85ు కాగా.. రెండో డోసు 47 శాతమేనని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర సహా 19 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 


భారత్‌కూ అమెరికా టీకాలు!

అంతర్జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమం కోవాక్స్‌లో భాగంగా భారత్‌కు కూడా కొవిడ్‌-19 టీకాలు అందిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తెలిపారు. ఐరాస ఆధ్వర్యంలో చేపట్టిన కోవాక్స్‌లో భాగంగా ఈ టీకాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అమెరికాలో ఉన్న నిల్వల నుంచి ఆయా దేశాలకు వీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు.  వివిధ దేశాలకు ఇచ్చే 8 కోట్ల టీకాల్లో భారత్‌కూ వాటా మేరకు వ్యాక్సిన్లు అందుతాయని ప్రైస్‌ పేర్కొన్నారు.ఎప్పటికల్లా అందుతాయన్న పూర్తి వివరాలు తన వద్ద లేవన్నారు. 



వ్యాక్సిన్‌ స్లాట్లు బుక్‌ చేస్తామన్న పేటీఎం, మేక్‌మైట్రిప్‌, ఇన్ఫోసిస్‌

కొవిడ్‌ వ్యాక్సిన్‌కు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌లు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పేటీఎం, మేక్‌మైట్రిప్‌, ఇన్ఫోసి్‌సలు కోరినట్లు కొవిన్‌ పోర్టల్‌ నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఆర్‌.ఎ్‌స.శర్మ తెలిపారు. థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించేలా నిబంధనలను సడలిస్తున్నట్లు తెలిపారు.  


Updated Date - 2021-06-11T07:57:27+05:30 IST