Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 29 2021 @ 02:47AM

కొత్త వేరియంట్లపై బూస్టర్‌ బ్రహ్మాస్త్రం

అదనపు డోసుతో అదుపు ఐరోపా దేశాల అనుమతి

భారత్‌లో బూస్టర్‌కు మద్దతు

మొదటి టీకా యాంటీబాడీస్‌ 

తగ్గాయ్‌: వైద్య నిపుణులు


కొవిడ్‌ నెమ్మదించిందని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ యూరప్‌ దేశాలపై కరోనా వైరస్‌ మరోసారి పంజా విసిరింది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. వ్యాక్సిన్లు వేయించుకున్న వాళ్లను కూడా కబళిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. వ్యాక్సిన్లు వేయడం మొదలెట్టి ఏడాది కావొస్తుండటంతో వారికి కొత్త వేరియంట్లు సోకే అవకాశాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యూరప్‌, అమెరికా వైద్య నిపుణులంతా ప్రజలకు బూస్టర్‌ డోస్‌ వేయాల్సిందేనని తీర్మానించారు. వృద్ధులకు, కోమార్బిడిటీస్‌ ఉన్న వాళ్లు, గర్భిణులకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ 16-18 ఏళ్లు దాటిన వాళ్లందరికీ బూస్టర్‌ డోస్‌ వేయొచ్చంటూ మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక భారత్‌ సంగతి చూస్తే.. 


బూస్టర్‌ లేకుంటే బయట తిరగనివ్వరు

యూర్‌పలోని చలి దేశాల్లో కొవిడ్‌ కొత్త రూపాల్లో విజృంభిస్తోంది. దాంతో అక్కడి వృద్ధులు, రోగ పీడితులను బూస్టర్‌ డోసుల ద్వారా కాపాడుకొనేందుకు ఆయా దేశాలు యత్నిస్తున్నాయి. 18 ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్‌ డోసులు సిద్ధంగా ఉన్నాయని డిసెంబరుకల్లా అవి వేయించుకోకపోతే బయట తిరగనివ్వబోమని ఫ్రాన్స్‌ తేల్చి చెప్పింది. ఐర్లండ్‌ 16 దాటిన వారందరికీ బూస్టర్‌ డోస్‌ ఇస్తామంటోంది. బ్రిటన్‌ కూడా 16 ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్‌ డోస్‌కు అనుమతి ఇచ్చింది. సింగిల్‌ డోస్‌ చాలన్న జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ సంస్థ ఇప్పుడు బూస్టర్‌ డోస్‌ తప్పనిసరని చెబుతోంది. అంటే, మరో సింగిల్‌ డోస్‌ వేసుకోవాలన్నమాట. మొత్తం మీద ప్రభుత్వాలు, వైద్య సంస్థలు, వ్యాక్సిన్‌ కంపెనీలు అందరిదీ బూస్టర్‌ డోస్‌ బాటే.


అదే ఫార్ములా

బూస్టర్‌ డోసుల్లో వాడేది అదే ఫార్ములా మందు. కాకపోతే తీసుకొనే పరిమాణంలో తేడా ఉంటుంది. ఉదాహరణకు మోడెర్నా టీకా మొదటి రెండు డోసులు 0.5 ఎంఎల్‌ ఇచ్చారు. ఇప్పుడు బూస్టర్‌ డోస్‌ 0.25 ఎంఎల్‌ ఇవ్వాలని నిర్ణయించారు. బూస్టర్‌ డోస్‌ కోసం ఏ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే అదే తీసుకోవచ్చని బ్రిటన్‌ సూచించింది. అమెరికా రోగ నివారణ విభాగం మాత్రం ఏ బ్రాండ్‌ తీసుకోవాలనేది తీసుకొనే వారి ఇష్టమని తేల్చిచెప్పింది. భారత్‌లో వైద్య నిపుణులు మాత్రం మొదట తీసుకున్న టీకా కాకుండా బూస్టర్‌ డోసు వేరే బ్రాండ్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.


బూస్టర్‌ కన్నా ముఖ్యం

ప్రపంచ జనాభా 700 కోట్ల మందిలో 300 కోట్లమందికి ఇంకా మొదటి రెండు డోసుల కొవిడ్‌ వ్యాక్సినే అందలేదు. వారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. వారి సంగతి పక్కనబెట్టి ధనిక దేశాలు బూస్టర్‌ డోసు వెంట పడటం నైతికంగా ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వాదన కూడా ఇదే. అసలు వ్యాక్సిన్‌ వేసేదే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి నుంచి, తీవ్ర అనారోగ్యం నుంచి, మరణం నుంచి తప్పించడం కోసం. అంటే, ఇప్పటికే ఇచ్చిన వ్యాక్సిన్‌ ద్వారా పై పరిస్థితుల నుంచి తగిన రక్షణ లేని వారికే బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలి. ప్రబలంగా ఉన్న వేరియంట్‌ ఎంత ప్రమాదకారి? ఎంత ఎక్కువగా ప్రభావితం అయ్యారు? మొదటి రెండు డోసులు ఇచ్చిన వ్యాక్సిన్‌ సురక్షత ఎంత? అన్న దాన్ని బట్టి బూస్టర్‌ డోసు అవసరాన్ని నిర్ధారిస్తారు. అనేక దేశాల్లో వ్యాక్సిన్ల కొరత వల్ల కోట్ల మందికి ఇంకా వ్యాక్సిన్‌ అందలేదని, ప్రమాదకర వేరియంట్లు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా దేశాల్లో మొదటి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడం ప్రథమ కర్తవ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉద్బోధిస్తోంది. బూస్టర్‌ డోసు తప్పనిసరి అని చెప్పడానికి ఆధారాలున్నచోటే వేయాలని సూచించింది. కానీ పశ్చిమ దేశాలు స్థానిక పరిస్థితులను బట్టి బూస్టర్‌ డోసుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 


భారత్‌లో కొరత లేదు

భారత్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రజలకు ఇవ్వడానికి వ్యాక్సిన్ల కొరత లేదు. సీరం, భారత్‌ బయోటెక్‌ పోటాపోటీగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. రెండూ కలిసి నెలకు 30 కోట్ల డోసులు అందిస్తున్నాయి. ఇటీవలే ఎగుమతికి అనుమతి ఇచ్చినప్పటికీ కొరత రాదు. ఇతర కంపెనీలు కూడా బరిలో దిగుతున్నాయి. అదే సమయంలో దేశంలో వ్యాక్సిన్ల వినియోగం తగ్గింది. దాంతో రాష్ట్రాల దగ్గర కేంద్రం కొనుగోలు చేసి ఇచ్చిన నిల్వలు పేరుకు పోయాయి. అయినా, వ్యాక్సిన్లు వేయించుకొనే వారు తగ్గిపోయారు. 138 కోట్ల దేశ జనాభాలో దాదాపు 40 శాతం మంది(55 కోట్లు) 18 ఏళ్ల లోపు వయసు వారు. వారికి వ్యాక్సిన్లు వేయడం ఇంకా మొదలు పెట్టలేదు. 83 కోట్ల మంది వ్యాక్సిన్లకు అర్హులు. 43 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చారు. మిగతా వాళ్లలో ఒక డోసు తీసుకున్న వాళ్లు 35 కోట్ల మంది ఉన్నారు. అందరికీ నిర్బంధంగా వ్యాక్సిన్‌ వేయడమా? స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్లకు బూస్టర్‌ డోస్‌ వేసి మిగిలి పోయిన వ్యాక్సిన్లను సద్వినియోగం చేయడమా? అనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. 


ఇక్కడాఅవసరమే

భారత్‌లో అధిక జనాభా, బహుళ రకాల వ్యాధుల పీడితులు ఎక్కువగా ఉండటంతో ఇక్కడా వైద్యులు, పరిశోధకులు బూస్టర్‌ డోస్‌ అవసరాన్ని గుర్తిస్తున్నారు. వ్యాక్సిన్ల కొరత లేనందున ఇప్పుడే బూస్టర్‌ డోస్‌కు అనుమతి ఇచ్చినా తప్పు లేదని సూచిస్తున్నారు. వ్యాక్సిన్లను కాల పరిమితి దాటాక వృథాగా పడేసే బదులు ఆసక్తి ఉన్న వారికి బూస్టర్‌ డోసులుగా ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు తాజాగా సూచించింది. కోవ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవడం ఉత్తమమని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణా ఎల్లా చెప్పారు. వచ్చే ఏడాది భారత్‌లో బూస్టర్‌ డోసులు అందిస్తామని సీరమ్‌ అధిపతి అదర్‌ పూనావాలా తెలిపారు.


కర్ణాటకలో బూస్టర్‌ డిమాండ్‌

బెంగళూరులో ఒమైక్రాన్‌ వేరియంట్‌ జాడలు కనబడటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వృద్ధులు, కోమార్బిడిటీస్‌ ఉన్న వారిని కొత్త ముప్పు నుంచి రక్షించుకొనేందుకు వారికి బూస్టర్‌ డోస్‌ ఇచ్చేందుకు అనుమతి కావాలని కేంద్రాన్ని కోరింది. వైద్య సిబ్బందికి బూస్టర్‌ డోస్‌ ఇచ్చేందుకు అనుమతి కోరామని, వారంలో వస్తుందని రెవెన్యూ మంత్రి అశోక చెప్పారు. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ సహా పలువురు ముఖ్యమంత్రులు బూస్టర్‌ డోసుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


 

గత కొద్ది వారాలుగా బూస్టర్‌ డోస్‌ విధానపత్రం రూపొందిస్తున్నాం. త్వరలో విడుదల చేస్తాం. 

                                                                      -  ఎన్‌.కె.అరోరా, కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు  

Advertisement
Advertisement