కొత్త వేతనాలు అసంబద్ధం

ABN , First Publish Date - 2022-01-21T09:24:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 17 అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది...

కొత్త వేతనాలు అసంబద్ధం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 17 అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 1958 నుంచి వేతన నిర్ణాయక కమిషన్‌ను నియమించటం, ఆ కమిషన్‌ సిఫారసులపై ఉద్యోగ సంఘాలతో చర్చించి కొత్త వేతనాలపై నిర్ణయం తీసుకోవడం పరిపాటిగా వస్తున్నది. ప్రతి 5సంవత్సరాలకు వేతన పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. మాజీ ఐఏఎస్‌ అధికారి అశుతోష్‌ మిశ్రా ఆధ్వర్యాన 11వ పే రివిజన్‌ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్‌ తన నివేదికను 2020 అక్టోబర్‌లో సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను ఇంతవరకు బయటపెట్టలేదు. గత 60 సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయానికి భిన్నంగా కార్యదర్శుల కమిటీని నియమించారు. వారం పదిరోజులలోనే ఆ కమిటీ నివేదిక రూపొందింది. ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి రూపొందించిన నివేదికను ప్రక్కన పెట్టి కార్యదర్శుల కమిటీ నివేదిక ఆధారంగా వేతన నిర్ణయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ సంఘాల జేఏసీలను చర్చలకు పిలవకుండా ప్రభుత్వ సివిల్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్య సంఘాలను మాత్రమే చర్చలకు ఆహ్వానించారు. ఏ సంఘానికైనా ప్రభుత్వాల అభీష్టం మేరకే సివిల్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం లభిస్తుంది. ఉద్యమానికి నోటీసు ఇచ్చిన జేఏసీల ఐక్య వేదికకు బదులుగా సివిల్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని సంఘాలను ఆహ్వానించడంలోనే ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరి బహిర్గతమయింది. ముఖ్యమంత్రి జగన్ 23శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. కార్యదర్శుల కమిటీ 14.29% మాత్రమే సిఫారసు చేసిందని, అయినా తాను 23శాతం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఫిట్‌మెంట్‌ 14.29శాతానికి గాని, 23 శాతానికి గాని ప్రాతిపదిక ఏమిటి అనే విషయాన్ని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు.


ఉద్యోగుల వేతన భత్యాలను నిర్ణయించడానికి 15వ ఇండియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌ రూపొందించిన కనీస అవసరాలు, వాటి పరిమాణాలను కేంద్రప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నది. పలు రాష్ట్రాలు కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. డాక్టర్‌ ఆక్రాయిడ్‌ నిర్దేశించిన కనీస కుటుంబ అవసరాల ఆధారంగా 15వ ఇండియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌ ఈ విధానాన్ని రూపొందించింది. మన రాష్ట్రంలో మొదటి నాలుగు పిఆర్‌సిలలోను ఫిట్‌మెంట్‌ ప్రస్తావన రాలేదు. మూలవేతనానికి, ఆనాడు ఉన్న కరువుభత్యం కలిపి కొత్త వేతన స్కేళ్ళను నిర్ణయించేవారు. సర్వీసును బట్టి వెయిటేజి ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు. 5వ పిఆర్‌సి (1986) సందర్భంగా వాస్తవ ధరలకు, కరువుభత్యానికి వ్యత్యాసం చాలా ఉంటుందని, ఆ వ్యత్యాసాన్ని తొలగించడానికి ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. 1986 పిఆర్‌సిలో 10శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. తరువాత 6వ పిఆర్‌సి (1993)లో 10%, 7వ పిఆర్‌సి (1999)లో 27%, 8వ పిఆర్‌సి (2005)లో 16%, 9వ పిఆర్‌సి (2010)లో 39%, 10వ పిఆర్‌సి (2015)లో 43% ఫిట్‌మెంట్‌గా ఇచ్చారు. డా. ఆక్రాయిడ్‌ నిర్దేశించిన విధానానికి అనుగుణంగా 2018 జూలై 1న రాష్ట్రంలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర అవసరాలు (కుటుంబాన్ని 3యూనిట్లుగా మాత్రమే పరిగణించి) ఖర్చులు గణించి మాస్టర్‌ స్కేల్‌లో ప్రారంభ మూలవేతనం రూ. 24,000గా ఉండాలని ఉద్యోగ సంఘాలు నిర్ధారణకు వచ్చాయి. 10వ పిఆర్‌సిలో ఇచ్చిన మాస్టర్‌స్కేలులో ప్రారంభ మూలవేతనం రూ. 13,000 మాత్రమే. 2018 జూలై 1నాటికి ఉన్న కరువుభత్యం 30.392%, దానికి 55% ఫిట్‌మెంట్‌ ఇస్తే ప్రారంభ మూలవేతనం 24,000 అవుతుంది. కనుక 55% ఫిట్‌మెంట్‌ను జేఏసీ డిమాండ్‌ చేసింది. కరువుభత్యం కనుక ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరిగినట్లయితే, ఫిట్‌మెంట్‌ అవసరం ఉండదు. అయితే వినియోగ ధరలసూచీకి అనుగుణంగా సవరిస్తున్న కరువుభత్యం వాస్తవంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేదు. ఆ వ్యత్యాసమే ఫిట్‌మెంట్‌ రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా 2016 పిఆర్‌సిలో 2.57 రెట్లు మూలవేతనం పెంచింది. (మూలవేతనం 100+ కరువుభత్యం 125% + ఫిట్‌మెంట్‌ 32%) 32% ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో వాస్తవ గణాంకాల ప్రాతిపదికన చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహనకు రావాలి. గతంలో అదే జరిగింది. ప్రస్తుతం ఆ ప్రజాస్వామిక అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. ఫిట్‌మెంట్‌ ప్రకటించి అమలుపరిచేందుకు ఉత్తర్వులు జారీచేసింది. కొత్త పిఆర్‌సిని ఎంచుకోవాలా? పాత పిఆర్‌సిలో ఉండాలా అనే ఐచ్ఛికతను ప్రకటించే అవకాశం ప్రతి ఉద్యోగికి ఇంతకు ముందు ఉన్నది. ఈ ఉత్తర్వులలో ఆ అవకాశం కూడా ఇవ్వలేదు.


పిఆర్‌సి అమలు చేయటం ఆలస్యమయిన సందర్భంలో మధ్యంతర ఉపశమనాన్ని (Interim relief) రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ ఉపశమనం 2019 జూలై 1 నుంచి 27% ఇచ్చారు. ఫిట్‌మెంట్‌ ఉపశమనం కంటే ఎక్కువగానే ఉండాలి. అంతకంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వటమే కాక మధ్యంతర ఉపశమనం ఇచ్చిన తేదీ నుంచి కాక 2020 ఏప్రిల్ 1 నుంచి నగదు ప్రయోజనం ప్రకటించారు. ఇది ఏ విధంగాను హేతుబద్ధంకాదు. నిజానికి 2018 జూలై 1 నుండి నగదు ప్రయోజనం ఇవ్వాలి. ఈ విధంగా నష్టపరచడమే కాక ఇకముందు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సిని నియమించదని, కేంద్ర పిఆర్‌సికి అనుగుణంగానే వేతన నిర్ణయం జరుగుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంటే 10 సంవత్సరాల వరకు పిఆర్‌సి లేదు. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న సౌలభ్యాలు, హక్కులను హరించి వేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరి పట్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు.

పి. పాండురంగవరప్రసాదరావు

రాష్ట్ర ప్రధానకార్యదర్శి,

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌

Updated Date - 2022-01-21T09:24:59+05:30 IST