ఆలయాలకు ‘నూతన’ సందడి

ABN , First Publish Date - 2022-01-02T15:07:56+05:30 IST

నగరంలోని ఆలయాలకు కొత్త సంవత్సర కళ వచ్చింది. ఆంగ్ల సంవత్సరం తొలిరోజు దేవాలయాలు జనంతో కిటకిటలాడాయి. కొత్త ఏడాదిలో తొలిరోజు దైవ సన్నిధిలో గడిపితే సంవత్సరమంతా మంచి జరుగుతుందన్న

ఆలయాలకు ‘నూతన’ సందడి

                       - కొత్త సంవత్సరంలో పోటెత్తిన భక్తజనం


చెన్నై: నగరంలోని ఆలయాలకు కొత్త సంవత్సర కళ వచ్చింది. ఆంగ్ల సంవత్సరం తొలిరోజు దేవాలయాలు జనంతో కిటకిటలాడాయి. కొత్త ఏడాదిలో తొలిరోజు దైవ సన్నిధిలో గడిపితే సంవత్సరమంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. మరీ ముఖ్యంగా ఆలయాలు శనివారం భక్తులతో క్రిక్కిరిసి కనిపించాయి. ట్రిప్లికేన్‌ పార్థ సారథి ఆలయం, మైలాపూరు కపాలీశ్వరాలయం, టి.నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయం, ముండకన్ని ఆలయం, సాయిబాబా ఆలయం, శ్రీరామ కృష్ణమఠం విశ్వజనీన ఆలయం, ప్యారీస్‌ కార్నర్‌ కాళికాంబాళ్‌ ఆలయం, కందకోట్టమ్‌, పాడి తిరువళ్లీశ్వరాలయం, మాగాడు కామాక్షి అమ్మన్‌ ఆలయం, తిరువేర్కాడు దేవి కరుమారి అమ్మన్‌ ఆలయం, వడపళని మురుగన్‌ ఆలయం వద్ద శనివారం వేకువజామునే ప్రజలు దైవదర్శనం కోసం క్యూలైన్లలో నిలిచారు. మాస్కులు ధరించినవారినే ఆలయాల్లోపలకు అనుమతించారు. బీసెంట్‌నగర్‌ అష్టలక్ష్మి ఆలయం, వడపళని మురుగన్‌ ఆలయం వద్ద వేకువజాము నాలుగు గంట నుండే భక్తుల రద్దీ అధికమైంది. ఈ ఆలయంలో రూ.50 ప్రత్యేక దర్శనం క్యూలైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. సైదాపేట కడుంబాడి అమ్మన్‌ ఆలయంలో అమ్మవారిని కాయగూరల మాలలతో అలంకరించారు. మైలాపూరు శ్రీరామకృష్ణమఠం విశ్వజననీ ఆలయంలో కరోనా నిబంధనల మేరకు కల్పతరువు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మైలాపూరు సాయిబాబా ఆలయంలోనూ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఇదే విధంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం, తిరువళ్లూరు వీరరాఘవస్వామివారి ఆలయం, తిరుప్పోరూరు మురుగన్‌ ఆలయం, పెరియపాళయం భవానీ అమ్మన్‌ ఆలయం, ఆండార్‌కుప్పం బాలసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయం, తదితర ఆలయాల్లో  వేకువజాము నుంచిసాయంత్రం వరకూ ప్రత్యేక దర్శనాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.


టి.నగర్‌ శ్రీవారి ఆలయంలో...

స్థానిక టి.నగర్‌ వెంకట నారాయణరోడ్డులో వున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 4 గంటల నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని ఫలపుష్పాలు, విద్యుద్దీపాలతో సుందరీకరించారు. టీటీడీ చెన్నై సమాచారం కేంద్ర సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌, మాజీ అధ్యక్షులు ఆనంద కుమార్‌రెడ్డి, ఎన్‌.శ్రీకృష్ణ, మాజీ ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ సభ్యులు మోహన్‌రావ్‌, పీవీఆర్‌ కృష్ణారావు, నారాయణగుప్తా, రంగారెడ్డి తదితరులు భక్తులకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 


క్రైస్తవాలయాల్లో...

నగరంలోని సుప్రసిద్ధ క్రైస్తవ దేవాలయాల్లో ఆంగ్ల సంవత్సరాదిని పుర స్కరించుకుని శుక్రవారం అర్థరాతి నుంచే ప్రార్థనలు జరిగాయి. శాంథోమ్‌ చర్చి, బీసెంట్‌నగర్‌ వేలాంకన్ని చర్చి తదితరాలలో క్రైస్తవులు కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇదే విధంగా కాంచీపురం సీఎస్‌ఐ క్రిస్మస్‌నాథర్‌ దేవాలయంలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలు, ప్రార్థనలు వైభవంగా నిర్వహించారు.

Updated Date - 2022-01-02T15:07:56+05:30 IST