మిగతా రాష్ట్రాల వల్ల న్యూయార్క్‌లో పెరుగుతున్న కేసులు

ABN , First Publish Date - 2020-07-01T01:54:17+05:30 IST

అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి

మిగతా రాష్ట్రాల వల్ల న్యూయార్క్‌లో పెరుగుతున్న కేసులు

న్యూయార్క్: అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. గతంలో కేవలం న్యూయార్క్ మాత్రమే కరోనాకు కేంద్రంగా ఉండేది. అయితే అక్కడి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడంతో ప్రస్తుతం అక్కడ కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చింది. ఇదే సమయంలో అమెరికాలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఈ కారణంగా కేసులు పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో కేసులు ఎన్నడూ లేని విధంగా నమోదవుతున్నాయి. మిగతా రాష్ట్రాల కారణంగా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్న మహమ్మారి న్యూయార్క్‌లో మరోమారు వ్యాప్తి చెందుతోందని న్యూయార్క్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా న్యూయార్క్‌లో ఓ స్కూల్‌లో జరిగిన స్నాతకోత్సవం కారణంగా 14 మంది కరోనా బారిన పడ్డారు. రెండు కుటుంబాలు ఫ్లోరిడాకు వెళ్లి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. వారి నుంచే కరోనా వ్యాప్తి చెందినట్టు అధికారులు గుర్తించారు. ఈ స్నాతకోత్సవంలో జూనియర్లు, సీనియర్లు ఇలా చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరంతా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారని.. వీరంతా ఒకే ప్రాంతంలో నివసిస్తున్నట్టు అధికారులు చెప్పారు. కాగా.. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల నుంచి న్యూయార్క్ వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Updated Date - 2020-07-01T01:54:17+05:30 IST