పుట్టబోయే బిడ్డను చూసేందుకు.. కరోనా వచ్చిందన్న నిజాన్ని దాచి..

ABN , First Publish Date - 2020-04-02T00:19:16+05:30 IST

పుట్టబోయే బిడ్డను చూడాలనే కోరికతో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి భార్య, బిడ్డను కూడా ఇబ్బందుల్లోకి నెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లోని

పుట్టబోయే బిడ్డను చూసేందుకు.. కరోనా వచ్చిందన్న నిజాన్ని దాచి..

న్యూయార్క్: పుట్టబోయే బిడ్డను చూడాలనే కోరికతో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి భార్య, బిడ్డను కూడా ఇబ్బందుల్లోకి నెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లోని రాచెస్టర్ నగరంలో ఉన్న స్ట్రాంగ్ మెమోరియల్ ఆసుపత్రిలో డెలివరీ కోసమని గర్భవతి చేరింది. సరిగ్గా ఇదే సమయంలో అనుకోకుండా గర్భవతి భర్తకు కరోనా సోకింది. ఈ విషయం అతడికి తెలిసినప్పటికి అధికారులకు చెప్పలేదు. అంతేకాకుండా ఎటువంటి భయం, బాధ లేకుండా తన భార్య చేరిన ఆసుపత్రి మొత్తం తిరిగేశాడు. ఆసుపత్రి సిబ్బంది ప్రశ్నించినప్పటికి తనకు కరోనా సోకలేదని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే భార్యకు కరోనా లక్షణాలు రావడం మొదలయ్యాయి. వైద్యులు పరీక్షలు చేయగా.. మహిళ, ఆమెకు పుట్టిన బిడ్డకు కరోనా పాజిటివ్ అని తేలింది. మహిళకు తన భర్త నుంచే వైరస్ సోకిందనే అనుమానంతో వైద్యులు అతడిని ప్రశ్నించగా అసలు నిజం బయటపెట్టాడు. భార్య డెలివరీ ఉండటంతో పుట్టబోయే బిడ్డను చూడాలని తాను నిజాన్ని దాచినట్టు భర్త చెప్పాడు. కరోనా సోకిందని చెబితే తనను క్వారంటైన్‌కు తరలిస్తారనే భయంతో నిజాన్ని దాచానని వివరించాడు. కాగా.. మెటర్నిటీ వార్డులో మహిళతో ఉన్న నర్సుకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన తరువాత ఆసుపత్రికి వచ్చిన వారందరికి టెంపరేచర్ టెస్ట్ చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు.

Updated Date - 2020-04-02T00:19:16+05:30 IST