న్యూయార్క్‌లో 70 వేల పరీక్షలు చేస్తే.. కేవలం..

ABN , First Publish Date - 2020-07-12T09:18:54+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలో నిత్యం

న్యూయార్క్‌లో 70 వేల పరీక్షలు చేస్తే.. కేవలం..

న్యూయార్క్: అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలో నిత్యం 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసుల విషయంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో కంటే ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే మార్చి, ఏప్రిల్‌లలో న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేది. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేసింది. న్యూయార్క్‌లో గడిచిన 24 గంటల్లో 69,203 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కేవలం 730 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. న్యూయార్క్‌లో ఇప్పుడు పాజిటివ్ రేటు 1 శాతానికి అటు ఇటుగానే ఉంటోంది. మరోపక్క గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కారణంగా ఏడుగురు మరణించినట్టు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. మార్చి 16 నుంచి ఇప్పటివరకు న్యూయార్క్‌లో ఇంత తక్కువగా కేసులు, మరణాలు నమోదుకావడం ఇదే మొదటిసారి అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో మొట్టమొదటిసారిగా 800 కంటే తక్కువ మంది 24 గంటల్లో ఆసుపత్రిలో చేరారని.. ఇది సంతోషించదగ్గ విషయమని ఆండ్రూ క్యూమో చెప్పారు. అయితే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉంటూ.. కరోనాతో ఈ విధంగానే పోరాటం చేయాలని అన్నారు. న్యూయార్క్ ప్రజలు, ప్రభుత్వం కలిసి కరోనాతో గట్టిగా పోరాడటం వల్లే కేసులు అదుపులోకి రాగలిగాయని ఆండ్రూ క్యూమో అన్నారు. కాగా.. న్యూయార్క్‌లో ఇప్పటివరకు 4,26,798 కేసులు నమోదుకాగా.. 32,388 మంది మరణించారు. ఇక అమెరికా వ్యాప్తంగా 33  లక్షలకు పైగా కేసులు నమోదుకాగా.. లక్షా 37 వేలకు పైగా మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-12T09:18:54+05:30 IST