Viral: పెళ్లికి రాని బంధువులు.. ఊహించని షాకిచ్చిన కొత్త జంట

ABN , First Publish Date - 2021-08-31T11:47:22+05:30 IST

మీ స్నేహితులు లేదా బంధువులు, ఇంకెవరైనా తెలిసిన వాళ్లు మిమ్మల్ని తమ పెళ్లికి ఆహ్వానించారా..? మీరు వస్తానని మాటిచ్చారా..? అయితే తప్పనిసరిగా వెళ్లండి. ఒకవేళ వస్తానని మాటిచ్చి వెళ్లకపోతే లేని పోని ఇబ్బందులు ..

Viral: పెళ్లికి రాని బంధువులు.. ఊహించని షాకిచ్చిన కొత్త జంట

చికాగో: మీ స్నేహితులు లేదా బంధువులు, ఇంకెవరైనా తెలిసిన వాళ్లు మిమ్మల్ని తమ పెళ్లికి ఆహ్వానించారా..? మీరు వస్తానని మాటిచ్చారా..? అయితే తప్పనిసరిగా వెళ్లండి. ఒకవేళ వస్తానని మాటిచ్చి వెళ్లకపోతే లేని పోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. అర్థం కాలేదా.. అయితే ఈ వార్త చదవండి. పెళ్లికి వస్తానని చెప్పి గైర్హాజరైన బంధువులకు చికాగోకు చెందిన ఓ జంట భారీ షాకిచ్చింది. తమ పెళ్లి వేడుకకు హాజరవుతామని చెప్పి చివరికి హాజరు కాని వారికి పెళ్లిలో వారి కోసం చేసిన ఖర్చు మొత్తం చెల్లించాలంటూ ప్రత్యేకబిల్లులు పంపించింది. ఈ బిల్లు 249 డాలర్లు(రూ.18వేలకు పైగా)గా ఉంది.


చికాగోకు చెందిన డోగ్ సిమన్స్(44), డెడ్రా మెక్ గీ(43) ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్(ఎక్కడైనా దూరంగా వెళ్లి వివాహ వేడుక నిర్వహించడం) చేసుకోవాలని అనుకున్నారు. కరీబియన్ దీవుల్లోని జమైకాలో ఉన్న రోయల్టన్ నెగ్రిల్ రిసార్ట్ అండ్ స్పాలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. ఈ వేడుకకు బంధు, మిత్రులందరినీ పేరు పేరునా ఆహ్వానించారు. వేడుకకు కచ్చితంగా హాజరవుతామని చెప్పిన వారి పేరిట అవసరమైన సీట్లు, భోజన ఏర్పాట్లూ చేశారు. ఒక్కొక్కరిక కోసం దాదాపు 126 డాలర్లు(రూ.9వేలకు పైగా) ఖర్చు పెట్టారు. అయితే వేడుకకు వస్తామని మాటిచ్చిన కొందరు స్నేహితులు వివాహ వేడుక గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన కొత్త జంట వారి కోసం తాము పెట్టిన ఖర్చులు చెల్లించాలంటూ సదరు స్నేహితులకు బిల్లులు పంపించింది. దీనికి సంబంధించిన ఇన్వాయిస్‌ను ఆ జంట తమ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.


ఫేస్ బుక్ పోస్ట్‌లో డోగ్ సిమన్స్.. ‘మా పెళ్లికి మీరు  వస్తామని మాటిచ్చారు. కానీ రాలేదు. మీ కోసం ప్రత్యేకంగా మేము సీట్స్ బుక్ చేశాం. కానీ మీరు రాలేదు. కనీసం రాకపోవడానికిగల కారణాన్ని కూడా తెలియజేయలేదు. అందుకే మీకోసం మేము ఖర్చు పెట్టిన ఈ మొత్తాని మాకు చెల్లించాలని కోరుతున్నాం. మీరు జెల్లె, లేదా పే పాల్‌ ద్వారా ఈ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఈ రెండింటిలో ఏ విధానంలో మీరు చెల్లింపు చేస్తారో తెలియజేయండి. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.


అయితే ఇది డబ్బుల కోసం చేస్తోంది కాదని, వారు వస్తామని చెప్పి రాకపోవడంతో తాము ఎంతగానో బాధపడ్డామని చెప్పారు. ఒకటికి నాలుగు సార్లు అడిగినా.. వస్తామని చెప్పి, చివరికి రాకుండా ఉండడం వల్ల తాము నొచ్చుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక ఈ సిమన్స్ చేసిన ఈ పోస్ట్‌‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫేస్‌బుక్‌లోనే కాకుండా ట్విటర్‌లో కూడా ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు కూడా వీరి ఆలోచనపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2021-08-31T11:47:22+05:30 IST